ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"అయాం సారీ!" అన్నారు తనని తాను నిగ్రహించుకుని_
"అంకుల్! యువకులకి ఏ యువతీ అయినా అందరానంత దూరంగా ఉన్నప్పుడే ఆకర్షణ_ఆరాధన ఆ తర్వాత వాళ్ళల్లో చులకన భావం వచ్చేస్తుంది. అదంతేనేమో! అది ప్రకృతి సహజమా? అన్నట్టుగా అయిపోయింది" అంది వారుణి.
"ఒక శతాబ్దం_ అందాకా ఎందుకు. యాభయ్ ఏళ్ల క్రిందటి వరకూ భర్తలు భార్యల్ని గౌరవించి ప్రేమించేవారు. మరీ యీ మధ్యే పిదపకాలం వచ్చేసింది. తనతో సమానంగా జన్మ పొంది, చదువు నేర్చుకుని, ఉద్యోగం సంపాదించి, ఆర్జిస్తున్న తన ఉత్తమాంగాన్ని గౌరవించలేక పోతున్నాడు యీనాటి మనిషి. గౌరవం మాట వదిలేసినా, ప్రేమించలేక పోతున్నాడు" అన్నారాయన.
"దీనికి కారణం ఏమిటంటారంకుల్?"
"ఆడవాళ్ళు చదువుకోవటం_ వాళ్ళ ఆలోచనా ధోరణిలో వేగం రావటం" జడ్జిమెంటులాగా అన్నారాయన.
"అంకుల్" దెబ్బతిన్నట్టుగా అంది వారుణి. ఆమె పెదాలు వణికాయి. గుండెదడ హెచ్చింది. తను వినలేని మాటలు వింటున్నట్టుగా అయిపోయింది.
"అవునమ్మా! యుగయుగాలుగా స్త్రీని తనతో సమానంగా చూళ్లేక_ ఆమె ఒక సుఖభోగాల యంత్రంగా తన సంసారాన్ని లాగే బానిసగా_తన కోసం జన్మ ఎత్తిన మనిషిగా_తన అవసరాలని తీర్చేదానిగా ఊహించుకున్న పురుషుడికి_తనతో సమానంగా రాణించే స్త్రీతో చేయిచేయి కలిపి నడవటం కష్టమనిపిస్తోంది. ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించటం కష్టమవుతోంది" బాధగా అన్నారు శంకర రామారావుగారు.
"అది ఎవరి లోపం అంకుల్?" సూటిగా ప్రశ్నించింది వారుణి. ఆమెకి యీ కొత్తలోకంలోకి వచ్చాక అంతా తారుమారవుతున్నట్టుగా, తలకిందులవుతున్నట్టుగా అనిపిస్తోంది.
"నిస్సందేహంగా మగాళ్ళదే." నిర్ద్వంద్వంగా న్యాయాన్ని ప్రకటించే న్యాయమూర్తిగా అన్నారాయన!" సంపాదించటం తమ బాధ్యతగా, తమ సేవ స్త్రీ ధర్మంగా భావించే పురుషాహంకారం యీ పరిణామాన్ని హర్షించలేకపోతున్నది. ఆత్మీయంగా స్త్రీని సమీపానికి తీసుకోలేకపోతున్నది."
వారుణి జవాబివ్వలేదు.
"సారధీ అంతేనా ?" అనుకుంది మనస్సులో.
"వారుణీ! మనం కొడుకుతో సమానంగా కూతుర్ని చూళ్ళేని ప్రపంచంలో వున్నాం. కూతురితోపాటు కోడలినీ అదే ప్రేమతో దరిజేర్చుకునే సమానభావన లేని లోకంలో వున్నాం. భార్యని సమభావంగా భావించలేని సంఘంలో వున్నాం. కూతురితోపాటు కోడలినీ అదే ప్రేమతో దరిజేర్చుకునే సమానభావన లేని లోకంలో వున్నాం. భార్యని సమభావంగా భావించలేని సంఘంలో వున్నాం. ఈ అంతరాలు, ఈ క్లాస్ డివిజన్ పోవాలమ్మా_అప్పుడే హ్యాపీ ఫ్యామిలీస్ వస్తాయి. అప్పుడే మంచి సంఘం రూపుదిద్దుకుంటుంది" ఆలోచనగా అన్నారు ఆయన. ఆయన ముఖంలో ఏవో సుదూరలోకాల్లో సుందర స్వర్గాన్ని చూస్తోన్న భావాలు కన్పించాయి.
"స్త్రీకి శత్రువు స్త్రీయే అంకుల్" నిట్టూర్చి అంది వారుణి. నిరాశ ధ్వనించింది ఆమె గొంతులో.
"అవునమ్మా! అసంతృప్తి మొదలయ్యేది వంటిళ్ళలోనే. అక్కడ ప్రారంభమైన అశాంతి పడగ్గదిదాకా వస్తుంది." నిట్టూర్చి అన్నారాయన.
ఆయనకి క్షణ క్షణం భారంగా అనిపిస్తోంది. వారుణి సంసారాన్ని ఎంత గొప్పగానో ఊహించుకుని వచ్చారాయన. ఇప్పుడిక్కడ యీ క్షణంలో ఆయనకెదురైన ఘోరపరాజయంలాంటి అసంతృప్తి ఆయన ఊహించలేనిది, సహించలేనిది.
"అసంతృప్తే అన్నిటికీ మూలకారణం వారుణీ! అది భావితరాన్ని నిర్వీర్యంగా_నిస్తేజంగా చేస్తున్నది. విదేశీ వ్యామోహం, మనం మనంగా జీవించలేకపోతున్నాం. ఇంకా సంధయుగాన్ని దాటలేకపోతున్నాం. అటు పాతదాన్ని వదులుకోలేక ఇటు కొత్తని ఆహ్వానించలేక నలిగిపోతున్నాం. తెలిసీ తెలియని మనుషులుగా మిగిలిపోతున్నాం"
వారుణి మాటాళ్లేదు.
"నీ కాపురం చూద్దామనీ-నీలాంటి మేధావి తెలివితేటలు గల యువతి ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి సుఖంగా జీవిస్తుందనీ ఆశపడ్డాను. జీవితాన్ని నీ చేతుల్లోకి తెచ్చుకుని కాపురాన్ని అనురాగ గోపురంగా మార్చుకుంటావనీ ఆశించాను" అసంతృప్తి జ్వాలలు నిరాశానిస్పృహలతో కూడుకుని నిట్టూర్పుగా బయటికి వచ్చాయి.
