Previous Page Next Page 
నేను పేజి 45


    "కోపం రాలేదు."


    "మరి?"


    వైదేహి గురించి అతనికి చెప్పలేదు. చెప్పాలనిపించలేదు. రహస్యంగా ఉంచాలని ఉద్దేశం కాదు . ఒక ఉదాహరణ ఆధారంగా నిర్ణయాలు తీసుకోటమనే పధ్ధతి నాకే నచ్చటం లేదు. నిజానికి నేను వైదేహి ఉదాహరణను తీసుకుని ఓ అభిప్రాయానికి రావటంలేదు. ఆ సంఘటన తాలూకు తీవ్రత వల్ల మానసిక సంఘర్షణను తట్టుకోలేకపోతున్నాను.  


    "ఎందుకో.... నామీద నాకు నమ్మకం కుదరటం లేదు" "అంటే?"


    "భార్యాభర్త అంటే ఎంతో నిష్కల్మషంగా, మృదువుగా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి మీద ఒకరికి ప్రేమ పొంగి పొర్లుతూ, అయినా సాంఘిక బాధ్యతలు విస్మరించకుండా పరిపూర్ణమైన జీవితం జీవించగలగాలి. ఉండు. నన్ను చెప్పనియ్. పరిపూర్ణమైన సంసార జీవితమంటే ఏమిటని కదూ! ఇద్దరూ కలసి ఎన్నో సుదీర్ఘ సంవత్సరాలు అన్యోన్యంగా కనిపిస్తూ డబ్బులు సంపాదిస్తూ, పిల్లల్ని కంటూ, పెళ్ళిళ్ళు చేస్తూ గడిపెయ్యటం కాదు. ఎన్నో కుటుంబాలు చూశాను. వాళ్ళు, వాళ్ళ మొగుడూ పెళ్ళాలూ, పిల్లలూ, పైకిరావటం, వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు, పారిన్ అవకాశాలు డబ్బు.... డబ్బు.... గురించి ఆలోచిస్తూ, కూడబెడుతూ ఆ నిషాలో మునిగిపోతూ, జీవితాలు చివరికంటూ గడిపెయ్యటం. దీన్ని ఫ్యామిలీ ఎటాచ్ మెంట్ అందామా? ఉహు, ఫ్యామిలీ హిపోక్రసీ. వాళ్లకు ప్రక్కవాళ్ల బాధలు పట్టవు. కూలిపోతూన్నా కుటుంబాల ఆవేదన అర్థం కాదు. అంతేగాకుండా ప్రక్కవాళ్ళ కష్టాలని చూస్తూ ఎన్ జాయ్ చేస్తూ, తమ గొప్పలు ప్రతాపాలు చెప్పుకుంటూ, ఒక రకం శాడిజమ్ తో బతుకుతారు. అది ఫ్యామిలీ ఎటాచ్ మెంట్ అనటానిక్కూడా వీల్లేదు. ఫ్యామిలీ యిచ్. అంటే ఒక రకమైన దురద. ఆ దురదలోనే వాళ్ళకానందం. ఓ! ఆ మత్తులో జోగిపోతూ వుంటారు. ఇంకా కొన్ని కుటుంబాలు, ఎప్పుడూ వ్యతిరేక భావాలు భార్యకీ భర్తకీ మధ్య వ్యతిరేక భావాలు. తల్లిదండ్రులకీ పిల్లలకూ మధ్య వ్యతిరేక భావాలు. ఎప్పుడూ మిజరియే. కష్టాలు, జబ్బులు, బాధలు, వాటిల్లో కొన్ని సహజంగా తెచ్చుకున్నట్టివి. చాలావరకూ అజ్ఞానంతో, అర్థంలేని స్పీడ్ తో పోయి తెచ్చుకున్నట్టివి. అదో విషవలయంలా తయారయి ఎప్పటికి తీరకుండా జీవితాంతం వెన్నాడుతూ ఉంటాయి. ఇహ ఆర్ధిక బాధలు, పొగర్లు, దురలవాట్లు, విశృంఖలత్వం, మూర్కత్వం.... ఎందుకో నా మనస్సుకి అందరూ సహజ భ్రమతోనే కాని సహజంగా బతుకుతూన్నట్లనిపించటంలేదు. పర్ వర్షన్ కావచ్చు. నేను ఏ మెంటాలిటీని లైక్ చెయ్యలేననిపిస్తోంది. అసలు నా మెంటాలిటీ ఇంకొకరు భరించలేరేమోననిపిస్తోంది. నేను.... నావల్ల సుఖం లేకపోవటం.... ఈ హింసకన్న ఇలా ఉండిపోవటమే మంచిదనిపిస్తోంది.


    ఇలా మాట్లాడుతూన్నానే గాని మధ్య మధ్య నాకే కొన్ని అపశృతులుగా వినిపిస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అతన్ని బాధపెడుతున్నానన్న సత్యం నన్ను తొలిచివేస్తోంది.   


    "ఈ వివాహ వ్యవస్థ లేకుండా నువ్వు చెప్పిన మిజరీ లేకుండా ఉండటానికి ఇంకో మార్గం ఉన్నదా?"


    "లేదు"


    "మరి? లేని దాన్ని వెదుక్కోవటం కన్న ఉన్నదాన్ని ఆశ్రయించటం మంచిది కాదా?"


    అతను చెప్పినదాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మనిషి ఉన్నదాన్ని స్వీకరించటం కన్నా లేని దాన్నే వెదుక్కోవటంలో ఓ థ్రిల్ అనుభవిస్తాడు. వేదాంత రహస్యమంతా ఇందులోనే ఇమిడి వుందనిపించింది.            


    "అయినా సరే...."


    ఉన్నట్లుండి అతను గట్టిగా అరిచాడు.... "నీ భావాలు, అవన్నీ నాకనవసరం. నువ్వు నాక్కావాలి. తెలిసిందా? నువ్వు లేకుండా నేను బతకలేను. అదంతే "


    మెదలకుండా అలాగే మాట్లాడుతున్నాను.


    "మాట్లాడవేం....? నువ్వూ...." అంటూ మీదకు ఒంగి భుజాలు పట్టుకుని కుదిపేశాడు. చలించకుండా అలాగే ఉన్నాను. ముఖం మీదకు వ్రాలి నుదుటి మీద, కళ్ళ మీదా, చెంపల మీదా, పెదవుల మీదా ముద్దులు పెట్టేసుకుంటున్నాడు.    


    ఏ మాత్రం చలనం లేకుండా అలాగే వున్నాను.


    "నిన్ను విడిచి పెడతాననుకుంటున్నావా? ఒదల్ను నన్ను పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకునే దాకా ఇక్కడ్నుంచి కదలను...."  


    "సుకుమార్ ప్లీజ్ నన్నర్థం చేసుకో.... నాకేమిటో ఉక్కిరిబిక్కిరిగా వుంది. నువ్వంటే నాకు ప్రేమే. నన్ను నమ్ము. కాని నాకు నేను అర్థం కావటం లేదు.   


    "ఈ అర్థం కావటానికి ఓ అంతూ పొంతూ వుండదులే. నువ్వు నాక్కావాలి. అంతే"


    "చూద్దాంలే. ఇవేళ నువ్వు వెళ్ళిపో.... నేను కొంచమాలోచించుకున్నాక తర్వాత మాట్లాడతాను."    


    "ఉహు ఏ సంగతి తేలేదాకా ఇక్కణ్నుంచి కదల్ను."


    "ఈ పూట నాకు ఓపిగ్గా లేదు. అన్నం కూడా వండలేదు."


    "అన్నం గిన్నం నాకఖ్కర్లేదు. అవసరమైతే సత్యాగ్రహం చేస్తాను."


    నాకు నవ్వు వచ్చింది. కోపమూ వచ్చింది. అయినా మొండికేసి మంచం మీద అలాగే పడుకున్నాను.    


                                                   *    *    *


    ఎంతసేపు గడిచిందో తెలీదు. ఓ రాత్రివేళ మెలకువ వచ్చింది.


    గదిలో బెడ్ లైట్ మాత్రం వెలుగుతోంది. మంచం మీద ప్రక్కకి వొత్తిగిల్లాను. సుకుమార్ నేలమీద పడుకుని వున్నాడు. చాప కూడా లేదు. తలక్రింద చిన్న దిండు మాత్రం పెట్టుకుని వున్నాడు.      


    సుకుమార్ ఎందుకిలా చేస్తున్నావు? ఒక మనోహరమైన అనుభవమిచ్చాను. చాలదా? నేను పూర్తిగా ఎప్పటికీ కావాలా? ఎందుకు? ఏం చేసుకుంటావు నన్ను ఓ స్త్రీని, అందునా నాలాంటిదాన్ని భరించటం కష్టమంటే అర్థం కాదేం నీకు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS