ప్రసాదం కళ్ళింతవి చేసుకుని ఆశ్చర్యంగా చూశాడు. వాలు కుర్చీని గది మధ్యకి లాగి 'రండి' అన్నాడు ప్రసాదం.
రామదాసు లోపలికొచ్చేరు.
"కూర్చోండి" అన్నాడు ప్రసాదం.
"చాలా సంతోషం. గుమ్మంలోంచే వెళ్ళిపొమ్మంటావేమో అనుకున్నాను. గౌరవముంచేవు!"
"అంతమాట నేనెందుకంటాను? ముందు కూర్చోండి!" అన్నాడు ప్రసాదం.
రామదాసు వెన్ను చరిచినట్టయింది. అయినా వెంటనే సర్దుకున్నారు.
"నేను కూచోడానికి రాలేదు బాబో౧ నీకేం అభ్యంతరం లేకపోతే, మనమలా నడుచుకుంటూ వెళదాం వస్తావా?"
నిజానికి ప్రసాదానికి వెళ్ళాలని లేకపోయినా, రామదాసుగారేదో పనిమీద వచ్చినట్టు గమనించి ఆయనతో కలిసి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
తలుపుకి తాళంవేసి రామదాసుగారి వెంట నడిచాడు ప్రసాదం. దార్లో రామదాసు మాట్లాడటం ప్రారంభించాడు.
"సుమతికీ, చిరనజీవికీ పెళ్ళి చేశాను."
"విన్నానండి, చాలా మంచిపని చేశారు."
"పెళ్ళి చాలా సామాన్యంగా జరిగిపోయింది. ఎవర్నీ పిలవలేదు."
"అవునట!"
"ఆస్తి మొత్తం సుమతిపేర్న రాయించాను."
"ఆ విషయమూ విన్నానండి."
రామదాసు చాలా హాయిగా నవ్వేరు.
"అయితే నువ్వు అన్నీ విన్నావన్నమాట. ఇప్పుడు చెప్పు నాయనా! నేను మంచివాడినా, లేక యింకా దొంగనేనా?"
ప్రసాదం ఏమీ జవాబివ్వలేదు.
"పర్లేదు నిర్భయంగా చెప్పు. నేనిప్పుడు పురప్రభువుని గూడా కాను. రాజీనామా ఇచ్చేశాను గదా. గనుక సామాన్యుణ్ణి. చాలామందిలాగా అతి సామాన్యుణ్ణి. కొన్ని మంచి పనులు చేస్తున్న మనిషిని అవునా?"
అప్పటికీ ప్రసాదం మాట్లాడలేదు.
రామదాసు మెల్లిగా నవ్వేసి అన్నారు.
"పదవిలో వున్నప్పుడు నేను దొంగనని నేనూ ఒప్పుకుంటాను. అందుచేత ఆ పదవి వదిలి మంచివాడినయ్యానోయ్ ప్రసాదం; పూర్తిగా మారిపోయాను. నేనిప్పుడు నా మేడలో వుండటం లేదు. ఆ మేడకి కొంచెం దూరంలో ఒక చిన్న కుటీరం కట్టుకుని దానిలో ఉంటున్నాను, కారులో తిరగటం మానేసి నడవడం ప్రారంభించాను. నౌకర్లందర్నీ వదిలేసి అన్నీ నేనేగా అయిపోయాను. ఇన్ని చేసుకుని, ఇంత మారిపోయిం తర్వాత ఇప్పటికీ నన్ను దొంగనే అంటావా?"
"నా తీర్పు మీకు అంత అవసరమా?"
"మరి? అంత అవసరం లేకపోతే పనిగట్టుకుని నీ గదికి నడిచి వస్తావా? పూర్వం ఘరానా మనుషులు నాకోసం నా మేడకొచ్చి నా దర్శనభాగ్యం నిమిత్తం పడిగాపులు కాచేవారు. ఇవాళ నీకోసం నేనే వచ్చాను. ఎందుకో తెలుసా? నేను చేస్తున్నది కిరాతకమని ఆ రోజు నన్ను హెచ్చరించి వెళ్ళావు, గుర్తుందా? ఇవాళ ఏమంటావో విని వెళదామని నిన్ను వెతుక్కుంటూ వచ్చేను."
"మీరు బజారువేపు వెళ్ళలేదనుకుంటాను. అటువేపు వెళ్ళండి. మీ గురించీ, మీ రాజీనామా గురించి చాలా కథలు చెప్పుకుంటున్నారు ప్రజలు."
"నాయనా! నేనిప్పుడు ప్రజలకోసం బతకడం లేదు. వాళ్ళేమనుకుంటున్నదీ నాకు ముఖ్యంకాదు, నీ విషయం చెప్పు."
ప్రసాదం చాలా ఖచ్చితంగా చెప్పాడు.
"నేను మీతో వాదించిందీ, మీరన్నట్టుగా మిమ్మల్ని హెచ్చరించిందీ సుమతి విషయంలో, ఇప్పుడు ఆ అమ్మాయి మీ కోడలయ్యింది. నేనాశించింది మీరు చేశారు."
"అవునా? కనీసం ఈ ఒక్క విషయంలోనైనా నేను మంచే చేశానుగదా! థాంక్స్!"
"కాని, రామదాసుగారూ! ఎవరో ఫలానా వ్యక్తికి మంచిగా కనిపించాలనే తాపత్రయంతో మంచి చేయడంకంటే పదిమందికీ మంచేవిఁటో తెలుసుకుని ఆ మంచినే చేయడం ఉత్తమమేమో? ఆలోచించండి!"
రామదాసుకి అలవాటులేని ఈ నడకవల్ల అలసట కలగడంతో ఒకచోట ఆగిపోయి అన్నారు.
"ఇక్కడాగు బాబు! నేనింక నడవలేను. ఇక్కడ కాసేపు కూర్చుందాం."
ఆ మైదానంలో ఒత్తుగా పెరిగిన గడ్డి ఉన్నచోటు నెంచుకుని అక్కడ కూచున్నారు. ఆయన పక్కనే ప్రసాదం కూచున్నాడు.
అప్పుడన్నారు రామదాసు____
"నిజమే నాయనా! నువ్వన్నట్టు పదిమంది కోసం మంచిచేసే అవకాశం నా చేయి దాటిపోయింది. ఈ జన్మకి మంచి చేయడమంటూ జరిగితే_ ఇదిగో సుమతి పెళ్ళొక్కటే! అదొక్కటే చేశాను. ఈ మంచి అయినా, నువ్వు నా దగ్గరికి రావడం వల్లనే జరిగింది. ఇంకో రహస్యం గూడా చెప్పేదా?"
"చెప్పండి."
"నిరాటంకంగా సాగిపోయేనా అరాచకం నీ వల్లనే ఆగిపోయింది. తెలుసా?"
ప్రసాదం ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు. తక్షణమే అన్నాడు___
"చాలా ఆశ్చర్యంగా వుంది సుమాండీ! నేన్నమ్మలేను."
రామదాసు చిరునావు నవ్వి అన్నారు_
"నమ్మలేవూ? తిమ్మాపురం ప్రజలు గూడా చాలా విషయాలు నమ్మలేరు. నువ్వూ వాళ్ళల్లో ఒక్కడివై నన్ను బాధపెట్టకు. నేను దుర్మార్గుడిగా ఉన్ననాడు నన్ను దుర్మార్గుడంటే నమ్మలేదు ఈ ప్రజలు. నేను మారిపోయి మంచి పనులు చేద్దామనుకున్ననాడు_ ఏం విన్నారో గాని_ మళ్లా యిప్పుడు నన్ను నమ్మడంలేదు. నువ్వు మందలో మనిషివి కావు నాయనా! నువ్వు...." ఆయనేం చెప్పేవారోగాని, ఏమీ చెప్పకుండానే మాట నక్కడితో వదిలేశారు.
