"ఓస్! ఖర్చుదెంలే! కాకుల్ని కొడతాం - గద్దలకి వేస్తాం."
అవునవును-"
మునసబు మాట్లాడలేదు.
"ధర్మన్నా! ఆ ఆలోచన ఈ పిటీషన్ మీద లేదు. బంజరు భుములంటే పాడి ఆవులు మనకీ. సాగు చేసుకునేపుడు పట్టాలకి తిరిగేపుడు, యిచ్చేప్పుడు వర్షం కురుస్తుంది. కురిసింది! మన వూళ్ళో యిన్నేల్లుగా మన వసూలు చేస్తూ వున్నాం. అది వుండదు యిక మీద!" గభాలున అన్నాడు.
"పోన్లే! కాలం ఎదురు తిరిగింది. ఆ జయన్న గాడొచ్చి యీ తిరకాసు పెడుతున్నాడు చూద్దాం! చూద్దాం! ఎన్నాళ్ళు యీ ఆటలు. తోక కత్తిరిస్తా!"
"తోకో! మెడో! కత్రించాల్సిందే!"
ఆ ఆ అంతేలే!"
"ఇదిగో మీరంతా బ్రాందీలు, విస్కీలు మత్తు అనుకుంటారు కదూ! ఊహో డబ్బు ఒక్కటే మహా మత్తు. ఆది వచ్చేకొద్ది ఎక్కుతుంది. ఇప్పుడింక మనకి నిషా తగ్గుతుంది అన్నాడు శేషయ్య.
"ఇది పొతే యింకోటి వస్తదిలే మామా!"
కనుక్కోవాలి గదా!"
"సొసైటీ వచ్చింది గదా!"
"ఇది పాడైపోయే కదా!"
"ఏం చేస్తాం! ఒక్కసారి వరద ఎదురు తిరుగుతుంది."
"ప్రవాహాన్ని మనం మళ్ళించుకోవాలి!"
"సర్లే! యిప్పుడెం చేద్దాం, చెప్పు మామా!"
"మనం పట్టాలిచ్చినట్టుగా ఎప్పుడో వేలిముద్దర్లు వేయించి పంపినాం. అవన్నీ తగలేశా అప్పుడే! ఇకపోతే రసీదులు లేవు డబ్బిచ్చిందానికి ఎంక్వయిరీ వస్తే గిట్టక పెట్టరందాం అంతే.
"నీకేది తోస్తే అది చెయ్! నాకేం తోచడంలా?"
"సరే! అభయమందుకున్న మునసబు వెళ్ళిపోయాడు. శేషయ్య ఆలోచనల్లో పడిపోయాడు.
21
ఉదయమే లేచి గంజినీళ్ళు తాగి తడిదుక్కుకి బయలు దేరబోతున్నాడు సోము! జానయ్య యింకా నిద్దర్లేవలేదు. సంద్రమ్మ పని ముగించి , చల్ల చేసి , సద్ది కట్టి కోడికి తగిలించింది.
రామి యింటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గులెస్తుంది.
పెద్ద తలారి లక్ష్మన్న వచ్చాడు కర్ర పట్టుకుని.
అతన్ని చూడగానే కనుబొమ్మలు ముడివేశాడు సోము.
"రేయ్ సోమిగా మా చౌదరయ్య రమ్మంటున్నాడురో." అతని కంఠం కర్కశంగా వుంది.
"ఎందుకు? ఎక్కడికి?" ఎద్దులకి పట్టేళ్ళు బిగిస్తూ తలయినా తిప్పకుండా అడిగాడు.
"ఎందుకో నాకేం తెలుసు. రచ్చబండ కాడి కంటరా!"
"ఇప్పుడు కాదు. నే పొలం పోతున్నా. మధ్యాహ్నం వస్తా!"
"ఊహు అర్జెంటుగా రావాలంటా!"
"ఎందుకు లక్ష్మన్నా" మాటలు వినిపించి బయటకు వచ్చిన చంద్రమ్మ అడిగింది.
"నాకేం తెలుసోదినా! వాళ్ళు చెప్పినారు, నేనోచ్చినా"
కొడుకు ముఖంలోకి చూసిందామె.
సోముకి ఏమి అర్ధం కావటం లేదు.
"పదరా! " అంది చంద్రమ్మ.
అప్పుడే నిద్దర్లేచి వచ్చిన జానయ్య "ఎక్కడికే" అని అడిగాడు ఏమి అర్ధం కాక.
మీ షావుకారు పిలుస్తున్నాడంట" వెటకారంగా అందామె లక్ష్మన్న రాక ఆమెకి అనర్ధదాయకంగా అభసూచికంగా అనిపిస్తోంది.
గుండె జల్లు మంది జానయ్యకి. ఇదేదో పంచాయితీ వ్యవహారం లాగుందే! అనుకున్నాడు "పద వెళదాం అన్నాడు.
అంతా కలిసి వెళ్ళేరు అక్కడికి.
ఆ సరికే చిన్నా పెద్దా రైతులు, గ్రామ నాయకులు , గ్రామాధికారులు సమావేశమై కూర్చుని వున్నారు.
జయన్న కూడా తల వంచుకుని వున్నాడు.
ఇతన్ని చూడగానే థూ.....అంటూ ఊశాడు చౌదరి.
