Previous Page Next Page 
రాగోదయం పేజి 44

 

    ఏనాడూ ఎదురు దెబ్బ తినని మనిషిని దార్లో ముల్లు తొక్కినా శివమెత్తినట్టుగా వుంటుంది. ఆపజయం ఎరుగని వాడికి తన క్రిందివాడు తలెత్తి చూసినా అసహనంగా వుంటుంది. అధికారం చలాయిచేవాడికి తన ఉత్తర్వు జారీ కాకపోయినా పుండుకి కారం రాచినట్టుగా వుంటుంది.
    తాత తండ్రుల కాలం నుంచీ ఆ గ్రామదికారం వాళ్ళది. ఆ పల్లెలో కూలీ మొదలు రైతుదాకా అందరూ వాళ్ళ అడుగులకీ మడుగులోత్టిన వాళ్ళే. ప్రెసిడెంటు మారి సర్పంచులైనా మునసబు తరాలు మారినా వీళ్ళ ఆలోచనా ఛత్రాల కిందే వాళ్ళు ఎదిగి వచ్చారు.
    అలాంటిది ఒక హరిజనుడు - ఛ-ఛ మాలవాడు, మరో మాదిగవాడు కలిసి అతని మీద తహసీల్ దారు వద్ద పిటిషన్ వేసి వచ్చారు. బంజరు భూమికి పట్టా వచ్చినా, యింకా ఫేనాల్టీలు వసూలు చేస్తున్నారని, తోటలు దొడ్లు కళ్ళాలు పొలాలు అన్నీ ఫేనాల్టీలు వసూలు చేసి రసీదు యివ్వటం లేదని తహసీలుదారుకి అర్జీ యిచ్చారు.
    అయితే కరణాలకి, రెవిన్యు ఇన్స్ పెక్టర్లకి తహసీల్ దారులకి తరతరాలుగా వస్తున్నా లావాదేవీల సంబంధ బాంధవ్యాలు యిలాటి విషయాలలో రైతులకు సహాయం చేయనివ్వవు. కాదంటే కరణానికి మరింత టాక్సేషన్ పడుతుంది.
    ఆ విషయం తెలుసుకున్న జయన్న అదే ఆర్జీనీ కాపీలు తీయించి సబ్ కలెక్టర్ కీ, కలెక్టర్ కీ, డి. ఆర్.వోకి రెవిన్యూ మినిస్టరుకి పంపేడు. కాపీ మార్క్ చేసిన విషయం కూడా అందులో రాశాడు.
    దాంతో తహసీలుదారికి చెమటలు పుట్టాయి. వేడి పుట్టుకొచ్చింది. ఇమీడియట్ గా డి టి కీ, అర ఐ కీ రిమార్క్స్ పంపాడు.
    తుఫాను పుట్టనే కూడదు. పుట్టిందా అది నీరు నేలా ఒకేలా చేస్తుంది. తాకీదు తీసుకుని తాలుకా జమాన్ వచ్చాడు. అది కరణానికి సమను. దాని వెంటే మునసబు సమను.
    వాటిని చూస్తూనే రుద్రుడయ్యాడు శేషయ్య.
    శివతాండవం చేశాడు.
    అదీ అతని ఆందోళనకు కారణం.
    ఇతనో ఒంటికాలి మీద దక్ష యజ్ఞంలో శివుడిలా తాండవం చేస్తుంటే వీరభద్రుడిలా వచ్చాడు ధర్మారెడ్డి.
    అతన్ని చూడగానే శేషయ్య కామ్ గా అయ్యాడు. ఆందోళనని అంతా అణచుకున్నాడు.
    గ్రామాధికారంలో ఇద్దరూ ఒకటే అయినా యిక్కడ మునసబు కరణనికి ఉపగ్రహం.
    భూమి తన చుట్టూ తానూ తిరిగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ వున్నట్లుగా యీ గ్రామాల్లో మునసబు స్వయం వ్యక్తిత్వంగా ప్రజల మీద అధికారం చెలాయించినా, తమ విషయం వచ్చేసరికి కరణాలమీద ఆధారపడక తప్పదు.
    ఏనుగెంత పెద్దది అయినా అంకుశానికి లోకువే అన్నట్టుగా మునసబు ఎంత మొనగాడయినా కరణానికి లోకువే.
    "చూసినావా మామా! ఈ గాడ్ది కొడుకులు ఎంతపని చేసినారో, వుక్రోషంగా అన్నాడు మునసబు.
    "కూర్చో!" శాంతంగా అన్నాడు కరణం.
    "కూలబడతాలే!"
    "ధర్మన్నా! నీకు రాజకీయం తెలియదు."
    "ఇప్పుడు చచ్చే చావొచ్చిందిగా!"
    "ఊరు మీద వూరు పడినా మన మీదికేం రాదు!"
    "అది కరణాల విషయంలో ! నాకు చావొచ్చిందే!"
    "నువ్వు రాశీదిచ్చావా?
    "ఛ! ఛ! మీ కుటుంబం నీడలో పెరిగినోళ్ళం . అంత పొరబాటు చేస్తామా?" మీసాలు దువ్వాడు ధర్మారెడ్డి.
    "మరింకేం తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా! అయినా అప్లికేషన్లకు పనులు, అర్చనకి పిల్లలు పుడతారా!" నవ్వాడు శేషయ్య.
    అయితే ఏం కాదంటావా?" ఆందోళనగా అడిగాడు.
    "నధింగ్, కానయితే మనకి ఖర్చు. తాలుకా ఆఫీసుకు తిరిగేందుకు, వాళ్ళు కెంపు కొస్తే అదీ మన ఖర్చు. అంతే!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS