ఆ మాటలకి సుబ్బరత్నమ్మ ఊఁ అన్లేదు ఆఁ అన్లేదు. ఊహుఁ అన్లేదు. మౌనం వహించింది.
వారుణి నేరుగా అల్మైరా వద్దకి వెళ్ళి ఓ ప్లేట్లో మూడు సున్నుండలూ, మరో సాసర్ లో కాస్త కారపూస తీసుకుని తన దారిని తను వెళుతున్నట్టుగా వెళ్ళిపోయింది. మీ మాటలతో మీ ధోరణిలో మీ పెద్దరికంతో నాకేం పనన్నట్టుగా వెళ్ళిపోయిందామె.
ఆమె వెళ్ళగానే సావిత్రికి తిరిగి ధైర్యం వచ్చినట్టయింది. చేజారిపోయిన అవకాశం దొరికినట్టయింది. "చూశారా ఏమిటా చొరవ? ఎంత ధైర్యం? ఎంత ధైర్యం? అది కొత్త కోడలి లక్షణమా? ఇన్నేళ్ళు సంసారం చేసిన నేనే మిమ్మల్ని అడగంది ఏదీ చెయ్యనే! చెయ్యలేనే? ఎంత నిర్లక్ష్యం?" అంది.
గడప దాటీ దాటకుండా వున్నట్టున్న వారుణి ఒక్క క్షణం ఆగింది ఆ మాటలు విని. ఆమె మనస్సులో ముల్లు గుచ్చుకున్నట్టయింది. బలవంతాన బాధని నిగ్రహించుకుంటూ "అక్కయ్యా! దయచేసి గెస్ట్ వెళ్ళేదాకా శాంతించండి! మన మధ్యవున్న కలతలు మళ్ళీ పరిష్కరించుకుందాం! ఆ వచ్చినవారికి యీ కుటుంబ స్థితి తెలిసిపోయేలా ప్రవర్తించకండి!" అని చరచరా వెళ్ళిపోయింది.
స్థాణువైపోయింది సుబ్బరత్నమ్మ.
సావిత్రి ఉక్రోషం పట్టలేకపోయింది.
ఏవేవో అనెయ్యాలని, వారుణి అంతగొప్పగా గౌరవిస్తోన్న ఆ అతిధిముందే ఆమెని నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా నిర్ముఖమాటంగా అవమానించాలనీ, ఆమెకీ యింట్లో వున్న స్థానం ఆయనకి తెలియజేయాలనీ అల్లరి పెట్టాలనీ అనుకుంది.
కానీ సుబ్బరత్నమ్మగారు పెద్దకోడల్ని చూపులతోనే వారించింది...సమయం వస్తుందన్నట్టుగా ప్రవర్తించిందామె.
20
టిఫిన్ ఫ్లేటు తీసుకెళ్ళి రావుగారి ముందుంచింది. వీలుగా సాధ్యమైనంతవరకు మనస్సుని నిగ్రహించుకుంది. ముఖంపై మనస్సులోని కల్లోలం ప్రతిబింబించకుండా చూసుకుంది.
"ఆఁ ఆఁ సున్నుండలా! ఇవి నాకు చాలా యిష్టమని యింకా గుర్తుందన్నమాట! అయితే నీ అత్తింటి కాపురం సక్సెసే!" అంటూ నవ్వేరాయన.
కానీ వారుణి మనస్ఫూర్తిగా నవ్వలేకపోయింది.
వారుణిని చూసి ఆశ్చర్యపోయారు శంకర రామారావుగారు. "ఏంటమ్మా?" అని అడిగారాశ్చర్యంగా.
"అదంతే అంకుల్! దూరపు కొండలు బాగా నునుపు. ప్రేమ వివాహం చేసుకుని కూడా నేనిలా అంటున్నానని అనుకోకు. ఆశ్చర్యపోకు. ప్రేమ జనించటానికి ఒక చిన్న సంఘటన ఎలా కారణం అవుతుందో- జీవితంలో నిట్టూర్చటానికి అంతకంటే చిన్న సంఘటనే చాలు. నేను యీ యింట్లో అస్వతంత్రురాలిని. అస్సాంలోని విదేశీయుల్లాగా అయ్యామో ఫారినర్ యిన్ దిస్ హౌస్."
ఆ మాటలంటున్నప్పుడు వారుణి గొంతుక కొద్దిగా విచలితమైంది. ఎక్కడో నాభిస్థానం నుంచి బయలుదేరిన అసంతృప్తి వీచికగా కదలి వచ్చింది.
నోట్లో పెట్టుకోపోతున్న సున్నుండని అలాగే పట్టుకుని "వరూ!" అన్నారు రావుగారు.
నిజానికి రావుగారితో వారుణికి చుట్టరికం లేదు. ఆమె ఉద్యోగం చేస్తూ మేనత్తతో సహా రావుగారింట్లో అద్దెకుండేది. ఆమె వ్యక్తిత్వం, చలాకీతనం, నిర్భయత్వం, చొరవ, ధైర్యం, వివేకం, చురుకుదనం, స్పీడీ యిన్ ధాట్ ఆయన్ని బాగా ఆకర్షించాయి. వారుణి అంటే ఎంతో అభిమానం ఆయనకి. కన్నకూతుర్లా అభిమానించారామెని.
ఒక శతాబ్దం తర్వాత పుట్టవలసిన దానివి అని అభినందించేవారు. 2047లో పుట్టవలసిన దానివి. 1947లో పుట్టావు అనేవారు. స్వాతంత్ర్యానికి సరిగ్గా నాలుగు నెలల అయిదు రోజులు ముందు పుట్టావు. కొంచెం ఆగి వుంటే లక్షణంగా స్వేచ్చావాయువులు పీలుస్తూ పుట్టేదానివి అంటూ నవ్వేవారాయన. యు హావ్ ఎడ్వాన్స్ డ్ యువర్ ఏజ్ అని అభినందించేవారాయన. వారుణి అంటే అంత ప్రేమ, అంతటి అభిమానం ఆయనకి.
అలాంటి వారుణి_
అంతటి ఉన్నత వ్యక్తిత్వంగల వారుణి_ ఒక మామూలు గృహిణిలాగా_ ఒక సాధారణ స్త్రీలాగా. ఆయన ఊహించలేకపోయాడు ఆపైన.
