Previous Page Next Page 
నేను పేజి 44


    చాలామంది విషయంలో అలాంటి సందర్భాలుండవచ్చు. కాని ఆ రోజు నాకలా అనిపించలేదు సుకుమార్. నీకో సంగతి చెప్పనా? పురుషుడు ప్రేమనీ, సెక్స్ నూ వేరు వేరుగా విభజిస్తాడు. లేకపోతే అర్థం లేకుండా కలగాపులగం చేస్తాడు. స్త్రీ ప్రేమని పొందాకే సెక్స్ కు తలవంచుతుంది. లేకపోతే ఆహ్వానిస్తుంది. అందులో అమాయకత్వమే ఉంటుంది గాని కల్మషం ఉండదు" చలంగారి రచనల్లో ఎంతో మేధస్సు గొప్పతనం ఉన్నా స్త్రీ సెక్సును ప్రేమనుంచి విడతియ్యబట్టి సంపూర్ణ రచయిత కాలేకపోయాడనిపిస్తుంది. అందుకనే చలంగారి భాష బావుంటుంది. శైలి బాగుంటుంది, వర్ణనలు బావుంటాయి అని అంతా అంటారు గాని ఆయన పాత్రలు గొప్పవి అని అనరు.... ఏ ఒకటి రెండో తప్ప."


    "సతీ! నీకు సాహిత్యంలో చాలా ప్రవేశమున్నట్లుందే."


    "చాలా అని చెప్పలేను. ఇందులో ఏదో ప్రత్యేకత ఉన్నది అనిపించిందల్లా చదువుతాను."


    "నువ్వు జీవితాన్ని బాగా పరిశీలిస్తావనుకుంటాను."


    "తెలీదు. కాని ఒకటి మాత్రం చెప్పగలను. సంఘటన కన్న పరిస్థితికీ, పరిస్థితి కన్నా మనిషికీ ప్రాధాన్యతనిస్తాను. సంఘటన ఎంత దారుణాతి దారుణమైనదైనా మనిషి విలువైన వాడయినప్పుడు ఆ మనిషిని గౌరవిస్తాను. సంఘటన గొప్పదైనా మనిషి నీచుడని తోచినప్పుడు, వాడ్ని ఏవగించుకుంటాను.


    "సతీ! నిన్ను చూస్తే నాకొకటనిపిస్తోంది."


    "ఏమిటి?"


    "నువ్వు ప్రయత్నిస్తే మంచి రచయిత్రివవుతావని"


    ఉలిక్కిపడ్డాను. నాకంత శక్తి ఉందా?


    మౌనంగా ఉండిపోయాను.


    "సతీ! నువ్వు తెలుగులో ఏ రచయితని అభిమానిస్తావు?"


    "మదన్ మోహన్" ఆలోచించకుండా వెంటనే సమాధానం నా నోట్లోంచి వచ్చేసింది.


    ఈసారి అతను ఉలికిపడ్డట్లు స్పర్శలో తెలుస్తోంది. నాకర్థం కాలేదు.


    "ఏమిటి?" అన్నాను.


    "ఏమీలేదు."


    అతని తల నిమురుతూ మదన్ మోహన్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను.


    "అతనంటే చాలా ఇష్టమా?"


    "అతని రచనలంటే"


    "అతన్నెప్పుడయినా చూశావా?"


    "లేదు, అవకాశమొస్తే చూడాలని మాత్రం చాలా కుతూహలంగా ఉంది."


    కొంచెం సేపతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. జెలసీ ఫీలవుతున్నాడని తెలుస్తోంది. నవ్వొచ్చింది.


    "సతీ! తనని తాను సముదాయించుకుంటున్నట్లు తెలుస్తోంది."


    తర్వాత "సతీ! ఆ రోజలా జరిగాక ఇంతవరకూ నీక్కనిపించలేదు కదా. కారణమేమైనా కానీ. నా ఎడ్రెస్ కూడా నీకు తెలీదు. ఒకవేళ రాకుండా ఉంటే ఏం చేసే దానివి?"


    "ఏమీ చేసేదాన్ని గాను."


    "అంటే.... నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినా పట్టించుకునే దానివి కాదా?"  


    "పట్టించుకునేదాన్ని కాదు."


    "ఎందుకని?"


    "బహుశా. అది నా స్వభావమేమో. అలా ఎందుకు చేశాడో అనుకుంటాను గాని మోసం, కుట్ర అనుకోను. నిన్నసహ్యించుకోను కూడా. ప్రేమించిన వాళ్ళని వాళ్ళెంత తప్పు చేసినా అసహ్యించుకోలేం."


    "అప్పుడేం చేసే దానివి?"


    "ఇలా ఉండిపోయేదాన్ని" అప్రయత్నంగా నవ్వేశాను.


    "సతీ! నువ్వు చాలా తెలివైనా దానివైనా, కొన్ని సమయాల్లో ఎంతో అమాయకురాలివనిపిస్తోంది."


    "సుకుమార్ నన్ను గురించి మరీ అంత మంచి అభిప్రాయం ఏర్పరుచుకోకు. నా దృష్టిలో ఏ ఆడపిల్లా అంత అమాయకురాలయి ఉండదు."


    నా మీద అతనికి మ్రింగుడుపడట్లేదని తెలుస్తోంది.


    మళ్ళీ కొంచెంసేపు మౌనంగా గడిచింది.


    "సతీ! నీతో ఓ ముఖ్యమైన సంగతి మాట్లాడాలనొచ్చాను."


    "ఏమిటది?"


    "మన పెళ్ళి గురించి."


    "నాకిష్టం లేదు."


    అతను షాక్ అయినట్లున్నాడు. నా వక్షస్థలం మీద నుంచి తల తీసేశాడు. ముఖంలోకి, ముఖ్యంగా కళ్లలోకి చూస్తూ ఇంచుమించు అరుస్తూన్నట్లన్నాడు. "ఎందుకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకేం జరిగింది?"  


    "నేను ఏ అలజడి లేకుండా ప్రశాంతంగానే ఉన్నాను. నాకేం జరగలేదు. ఈ పెళ్లి, బంధం ఇదంతా ఏమిటో వికృతంగా అనిపిస్తోంది. నా భావాలు పర్ వర్టెడ్ గా ఉండవచ్చు. కాని ఏం చెయ్యను? నాకలా అన్పిస్తోంది. నా శరీరాన్ని నీకర్పించుకున్నప్పుడు తప్పు చేశానన్న బాధగానీ ఏదో పోగొట్టుకున్నానన్న భావన గానీ కలుగలేదు. పైగా చాలా హాయిగా, రిలీఫ్ గా ఫీలయ్యాను. కాని పెళ్లి అనగానే భయం వేస్తోంది.   


    "నువ్వు నన్ను ప్రేమించటం లేదు. అందుకనే అలా మాట్లాడుతున్నావు."


    "ప్రేమ, ప్రేమ, ప్రేమ, దీన్ని గురించి గొంతెత్తి చెప్పుకోవటం కంటే మౌనంగా ఆస్వాదించటంలోనే ఆనందముంది. ప్రేమ గురించి ఎప్పుడో ఒకప్పుడు గాని బయటకు మాట్లాడకూడదు.


    "నువ్వు.... నేను దూరంగా ఉన్న ఈ కాసిని రోజుల్లో నీలో మార్పు వచ్చింది. నేను చీటికీ మాటికీ కనిపించకుండా పోవటం, బహుశా నీకు కోపమొచ్చి ఉంటుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS