Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 43


    తలెత్తకుండానే అడుగులు లెక్కపెట్టుకుంటోంది.
    వెంటనే సీతాపతి గొంతు పసిగట్టగలిగింది.
    "పదండి సార్స్! వెళ్ళిపోదాం పదండి మన రోగాలు తనిఖీ చేశారు. డాక్టరు బాబు. ఇక ఇప్పుడు వారు తనిఖీ చేయబోయేవి మాయదారి రోగాలు. వళ్ళు తిమ్మిరెక్కిపోయి, కళ్ళు మూసుకుపోయి, ప్రేమ గోతుల్లోపడి బతుకు పాడుచేసుకొన్న హై క్లాస్ రోగాలు. మనం చూడకూడదీ రొంపి. రండి రండి పోదాం.
    డాక్టరేమని హెచ్చరించాడోగాని ఆపైన యింక మాటాడలేదు సీతాపతి. అందరూ తలో దోవా తప్పుకున్నారు. ఆ డిస్పెన్సరీని ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
    డాక్టరు ముందు శోక దేవతలా నించున్న సుమతి ఒక్క అక్షరం గూడా మాట్లాడలేకపోయింది.
    "అమ్మగారికెలా వుందమ్మా?" అడిగాడు డాక్టరు.
    "వచ్చి, దయచేసి వెంటనే వచ్చి, అమ్మని చూచి మీరే చెప్పండి." అన్నది సుమతి.
    డాక్టరు మరి నోరెత్తకుండా సరంజామాతో సిద్ధమై డిస్పెన్సరీ వదిలేడు.
    డాక్టర్ని వెంటబెట్టుకొచ్చిన సుమతి గుమ్మంలో నించున్న వ్యక్తిని చూసి తన కళ్లని తానే నమ్మలేకపోయింది.
    డాక్టరు ఇంట్లోకి వెళ్ళపోయాడు.
    గుమ్మంలో నిలబడ్డ చిరంజీవి సుమతిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. సుమతి కిది కలా, నిజమా అన్నట్టుంది. ఏదో మాటాడాలని ప్రయత్నించింది. గొంతులో గుండె నిలిచిపోయింది. పెదాలు వణికాయేగాని మాట రాలేదు. కళ్ళల్లో మొదట ఆశ్చర్యం నిలిచింది. ఆ పిదప ఆనందం తొణికిసలాడింది. నోటి నుంచి రాని మాటల్ని కళ్ళతో అప్పగించింది. అనబోయే మాటనీ, ఆ భావాన్నీ కన్నీళ్ళు అందుకున్నాయి. చూపుకి కన్నీళ్లు అడ్డం కావడంవల్ల చిరంజీవి కనిపించటం మానేశాడు.
    మనిషి మొత్తాన్నీ పరవశత్వం కుదపగా సుమతి కదిలిపోయింది. వళ్లుతూలింది. నిలబడ్డ చోటనే కుప్పలా కూలిపోతుండగా అతి జాగ్రత్తగా ఆమెను ఆదుకొన్నాడు చిరంజీవి. అతని గుండెలకు ఆమెను హత్తుకొని అన్నాడతను___
    "నన్ను క్షమించు."
    అందుచేత___
    సుమతీ, సుమతి తల్లి ఏ డాక్టరు సాయం లేకుండానే, ఏ మందూ వాడకుండానే బతికిపోయారు.

                                                                       14

    పరీక్షలు రెండు రోజుల్లో పూర్తవుతాయనగా ఒక ఆదివారం నాటి మధ్యాహ్నం గదిలో మడత మంచంమీద పడుకొని సిరిపల్లెలో ఉన్నవాళ్ళక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాడు ప్రసాదం.
    చాలాసేపట్నుంచి అతని వాలకాన్ని గమనిస్తోన్న రవి యింకా మౌనంగా వుండలేక అడిగాడు.
    "ఏమిటి ఆలోచిస్తున్నావు? సీతక్క గురించేనా?"
    ప్రసాదం తలూపేడు.
    "సీతక్క కొచ్చిన భయమేం లేదు. నా మాట విని పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి పుస్తకం పుచ్చుకో. రెండు రోజులు....ఈ రెండు రోజులూ గడిస్తే మన ప్రాణాల పాలిట గండం గడిచినట్టు లెక్క. మూడో నాటికల్లా సీతక్క దగ్గర రెక్కలు కట్టుకు వాలు. నా మాట విని ముందు పుస్తకం తియ్యి."
    ప్రసాదం రవివేపు కొంచెంసేపు చూచి తల దించుకున్నాడు.
    గత ఆరు నెలలుగా అక్క మొహంలో నేను కొన్ని నీడలు చూస్తున్నాను. మొన్న నేను వెళ్ళినప్పుడు పూర్తిగా మారిపోయింది అక్క. నేనక్కడ వున్నరోజంతా అక్కతో సరదాగా గడుపుదామనుకున్నానా? వీల్లేకపోయింది. ఏదో పరాకు. ఉండి ఉడిగీ కన్నీళ్ళు, కారణం అడిగితే చెప్పదు. మనిషి మంచం దిగి నేలమీద అడుగుపెట్టలేదు. నేనొచ్చేస్తున్నప్పుడు రవీ! అక్క నన్ను దగ్గిరికి తీసుకుని ఏడ్చిందోయ్! పాడు పరీక్షలు. ఈ పరీక్షలొచ్చి పడ్డాయి గనుక తప్పలేదుగానీ, లేకపోతే అక్క నా స్థితిలో వదిలివచ్చే సమయమా యిది?" అన్నాడు ప్రసాదం దిగులుగా.
    రవి కొంచెంసేపు ఆలోచించి అన్నాడు.
    "ఒక పని చేద్దాం. పరీక్షలయిపోవడముతోటే సిరిపల్లె వెళ్ళి సీతక్క నిక్కడికి తీసుకొద్దాం. ఇక్కడ మంచి మంచి డాక్టర్లున్నారు."
    "అక్క ఎక్కడికీ రాదు. అక్క సంగతి నాకు బాగా తెలుసు."
    "అలా అని వూరుకుంటారా? బతిమాలో, భయపెట్టో తీసుకొస్తాంగాని ఆ దిక్కుమాలిన పల్లెటూళ్ళో వదిలేస్తామా? అవన్నీ నెంపాదిగా ఆలోచించవచ్చు. ముందు చదువు, అది ముఖ్యం.
    కొంచెంసేపాగి ప్రసాదం అన్నాడు.
    "ఇప్పుడు చదవాలని లేదు రవీ! రాత్రి అంతా కూచుని చదువుతాను. నాకేం ఫరవాలేదు. నేనీ పరీక్ష పాసవుతాను."
    ఆ తర్వాత రవి ఏమీ మాట్లాడలేదు. ప్రసాదం అటు తిరిగి పడుకున్నాడు.
    ఆ సాయంత్రం రవి బజారువేపు వెళుతూ ప్రసాదాన్ని అడిగాడు___
    "వస్తావా? రంగుల మేడ సెంటర్ వరకూ వెళ్ళొద్దాం."
    "నే రాలేను. నువ్వెళ్ళు." అన్నాడు ప్రసాదం.
    రవి సంశయిస్తూ నించున్నాడక్కడే.
    "నేను రాత్రికి చదువుకుంటానుగా. నా విషయం పట్టించుకోవద్దు, నువ్వెళ్ళిరా రవీ."
    రవి అయిష్టంగానే ఆ గది విడిచి వెళ్ళాడు.
    రవి వెళ్ళిన కాసేపటికి ప్రసాదం లేచి స్నానం ముగించాడు. తల దువ్వుకుంటుండగా గుమ్మం దగ్గర చప్పుడైతే అటువేపు చూశాడు.
    గుమ్మంలో రామదాసు నిలబడి వున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS