శ్రీ వెంకట వరదాచార్యులు, టి.ఎన్.సి
భారతా!
జననికి జ్యేష్ఠ పుత్రుడగు
జహ్వరు యోధుడు శాంతశీలుడై
వినుడని చెప్పుచున్న, నవివేక
గుణంబున గాలు ద్రువ్వుదు
ర్జనుల సహింతువో! తగిన
శక్తిని వెన్కకు నెట్ట జూతువో!
కను మతి దీర్ఘదర్శివయి
కాలగతిన్ దలయెత్తి భారతా!
కనకనలాడు చిచ్చువలెఁ
గాలము వచ్చి హఠాత్తుగా బడెన్
దనువున జీవముల్ గలుగుదాక
సహించి త్యజించి నిల్చుటో
ఘనమగు కీర్తిఁ బోదుడిచి
కత్తిని బట్టినచేత మ్రొక్కుటో
మన యెదకాని నిల్చె; తగు
మార్గము జూడగదయ్య భారతా!
దండిగ సైన్యముల్ పెనిచి,
దక్షిణ గోగ్రహణమ్ము సేయగా
నుండిరి వైరు లుగ్రముగ-
నుత్తర గోగ్రహణమ్ము సేయగా
దుండగులై మహోగ్రముగ
దూకిరి చైనులు హద్దుమీఱి, భీ
ముండు, కిరీటిపై నిలిచి
పూర్వుల ఖ్యాతిని నిల్పు భారతా!
కోరగరాని కోరికల గోరుచు
నిద్దరు రెండు దిక్కులన్
బోరొనరింప సేనలను వ్యూహము
దీర్చుట దేఱి చూడవా?
కూరుకుచుంటివా? కుడిచి
కూరుచు నుండుట వీరధర్మమా?
భారము నీదిరా! భరత పౌర!
కుమార! బిరాన లేవరా!
పిడుగయి రామ బాణములు
భీముని భీషణ ముష్టిఘాతమై
మృడుని త్రినేత్రమై కదిసి
మృత్యువు శత్రుల మ్రింగుదాక, నీ
మడమను ద్రిప్పకోయి! మితి
మీఱిన నున్నది ధర్మరక్షా, నీ
యిడుమల కెందు ముందు
జనియించని కీర్తి పథంబు భారతా!
హృదయము లేని జాతులకు
హృత్కువిశంబయి నిల్చి వెల్గరా!
చెదరని బుద్ధినీది, స్థిరచిత్తుడ
వీవు, జగాన దేనికిన్
బెదరని గుండె నీది, తనువే
మదినెంచని జాతి నీది, నీ
కెదురయి యెవ్వడోపు
జగదేక బలాఢ్య గుణాఢ్య భారతా!
చూపగదయ్య నీ తెగువ,
చూపరు లెల్లరు చోద్యమందగా
నీ పగ దాయ గుండియలు
నీఱయి పాఱగ శౌర్య ధైర్యముల్
చూపిన తీరుమెచ్చి కవి
లోకము నింపుగ పద్య గద్యముల్
నీపయి వ్రాయ, వైరితతి
నిందల పాలయిపోవ భారతా!
పగిలి యుసుళ్ళ పుట్టవలె
బర్వతపంక్తుల దాటి భూమిపై
దిగి చెలరేగి మత్తులయి
తిందుము మిమ్మని వచ్చినా రదే!
పగతురు, నిద్ర మేల్కొని
శుభమ్మని యూదర శంఖరాజమున్
దిగుదురు కొండ కాలవలను
దియ్యని మాటల బోరు, భారతా!
చీమల బారులట్ల మన సీమల
గాలిడె, చైన సైన్యముల్
పాములు చేర బుట్టల
నపారముగా నిక బెట్టు నిప్పుడే
చీమల బారులన్ దుడిచి
చిందర వందర చేసి వైవగా
స్తోమత గూర్పరా! మిగుల
శూరత జూపర వీరభారతా!
ఆశను జంపలేవ, మన
హక్కుల జిక్కుల దీర్ప బూనవా,
దేశము నీది కాద? పర
దేశజు లేలగ గంట జూతువా,
దేశము దేశ నాయకులు
దిగ్భ్రమ జెందుట గాంచి యోర్తువా,
దేశము శాంతి గూర్పగను
దీక్ష వహించర వీరభారతా!
* * * *
