శ్రీ వెంకటరత్నం, కొనకళ్ల
"నిను తరిమి కొడతా"
చివరి నెత్తురు బొట్టు
చిందిపోయేదాక,
నిను తరిమి కొడతా;
నీ ఆట కడతా.
నా మేడ, నా వాడ,
నా యిల్లు, నా పల్లె
పగులిచ్చిపోయినా,
పాడుపడిపోయినా ||చివరి||
నా దొడ్డి, నా తోట,
నా దొడ్డ మాగాణి
మ్రోడులైపోయినా,
బీడుగా మారినా ||చివరి||
నా శక్తి, నా యుక్తి,
నా సర్వ సంపత్తి
నష్టమైపోయినా
నాశమైపోయినా ||చివరి||
వెన్నుపోటున నన్ను
కన్నుగప్పిన నిన్ను
మన్ను దినిపించకే
మనుగడేదీ నాకు? ||చివరి||
* * * *
