"కాబట్టి వాటిని చేజారకుండా చూసుకోవాలి."
"ఎలాగా?"
నశ్యం పీల్చాడు కరణం . కొద్దిగా అగండన్నట్టు సైగ చేశాడు.
"చెప్పవయ్యా బాబూ! వెధవ సస్పెన్సు!"
"అవి చేజారకుండా వాటిని హరిజనులకి కౌలుకిచ్చినట్టు పత్రాలు పుట్టించాలి. తర్వాత దేవాదాయ కమిషనరూ కు అర్జీ పెట్టించి వాళ్ళకే అమ్మేట్టు చేయాలి."
"ఏడ్చినట్టుంది. ఇదా సలహా - ఏనాడో చచ్చేది ఇప్పుడే ఎండ్రిన్ తాగించమన్నట్టుంది" అన్నాడు చౌదరి.
"పూర్తిగా వినవు కదా నువ్వు. మనూళ్ళో వాళ్ళ పేర్లు వద్దు. ఆ మాటకొస్తే అ పేరు గల వాళ్ళు ఎక్కడా వుండరు. కొత్తగా రాసే జనాభా లెక్కల్లో ఓటర్ల లిస్టులో కనిపిస్తారు. అవసరమైతే కోన్ కిస్కా గాడిని నిలబెడతాం. వీడే వీరయ్య, వీడే దానం,వీడే ఏసోబు వీడే లక్ష్మి పతి అందాం. ఆ పొలాలు శాశ్వతంగా దక్కుదు కాదనే హక్కు శక్తి మన వూళ్ళో ఎవరికీ లేవు. ఇదంతా అధికార్ల కన్ను కప్పటానికే.
శేషయ్య వివరంగా చెప్పగానే ఆనందమైంది.
"నిజానికి పుడితే కరణం యింట్లోనే పుట్టాలి. తెలివంతా అది మీ సొమ్మే!"
"చౌదరీ! ఆ మాటలకేంలే ఖర్చుకి చూడు."
తలా వందా రెండొందలు యిచ్చారు.
ధర్మారెడ్డి మాత్రం తర్వాత సర్దుబాటు చేస్తానన్నాడు.
శేషయ్య కాదనలేదు. దేవాదాయభూములు పూర్తిగా స్వాధీనం చేసుకున్న తృప్తి కలిగిందాయనకి.
20
"ఇడిగో! వెళ్లి ఆ సోముగాడిని రాత్రి చినీ తోటకు కావలి వెళ్ళమను! ఇంజను వేశారు నిన్న. కావలివాడు వూరికి పోయినాడు. రాత్రికి పదిహేను రూపాయలు కూలీ యిస్తాననీ చెప్పు, జాగ్రత్త అనీ మరీ మరీ చెప్పు."
చౌదరి మాటలు విని తలూపేడు తలారి వెంకట స్వామి తమ్ముడు సుబ్బిగాడు. వాడు చౌదరి యింట్లో జీతానికి పని చేస్తున్నాడు.
"నువ్వు కావలి పోతావా?"
"లేదు! మాయింటి దానికి బాగాలేదు."
"సర్లే! తోటలో కాపెం లేదు గదా! ఇంజను రూమ్ దగ్గరే పడుకో!"
తలూపాడు వాడు.
"ఇంకేం! వెళ్ళు!"
"ఊ" నసిగాడు వాడు!
"డబ్బు గావాల్నా! ఎంత?"
"ఓ నూరియ్యి!" తల గోక్కుంటూ అడిగేడు.
"నూరా! ఎందుకు"
"మా యింటిదానికి చీర కావాల్నంట!"
"నోర్ముయ్యరా గాడిదా! నా పంచలు చొక్కా నీకు, నా భార్యవి నీ భార్యకు అంతే! కొంటాడంట కొంటాడు అబ్బో! షావుకారు దిగోచ్చినాడు. నాలుగు రూపాయలు కూడేసుకుని దాచి పెట్టుకుని వడ్డీకిచ్చుకుందామని ;లేదు వెధవకి."
కిక్కురు మనలేదు వాడు. తలవంచుకుని వెళ్ళిపోయాడు.
నేరుగా సోము ఇంటికి బయల్దేరి దారిలోనే వాడు కనిపిస్తే విషయం చెప్పాడు.
"సరే!" ఆన్నాడు సోము బాకీ తీరుతుందన్న ఆశతో.
సుబ్బిగాడు తన యింటికి - సోము పాఠశాలకి కదిలారు.
* * * *
ఆరోజు సాయంకాలం నుంచీ కరణం శేషయ్య నిప్పు తొక్కినా కోతిలా వున్నాడు. నిలుచున్నా చోట నించోవడం లేదు. కూర్చోవడం లేదు. కల్లుతాగిన కోతిలా - నిప్పు తొక్కిన పిల్లిలా శివమెత్తిన శివంగిలా ఎగిరెగిరి పడుతున్నాడు.
అచ్చమాంబకి ఏమీ అర్ధం కాలేదు. భర్త ఎందుకు చిందులు తోక్కుతున్నాడో ఆమెకి అవగాహన కాలేదు. పలకరిస్తే ఎగిరి దూకేలా వున్న భర్తని చూస్తూ మౌనం వహించిందామె.
