Previous Page Next Page 
వారుణి పేజి 43


    అదాయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది "ఇది మా వారుణి యిల్లు. నాకు యిక్కడికి రావటానికి సర్వస్వతంత్రాలూ వున్నాయి. నువ్వేమిటి నన్ను చూడగానే జిడ్డు ముఖం వేశావు?" అన్నట్టుగా చూస్తున్నారాయన.
    చప్పున అక్కడికివెళ్ళి "రండి! అంకుల్!" అని నమస్కారం చేస్తూ ఆహ్వానించింది వారుణి. ఆయన్ని చూడగానే ఆత్మీయత పొంగి పొరలినట్టయింది.
    వారుణి కంఠస్వరమూ చిరునవ్వులు చిందే ఆమె ముఖం, ఆమె మాటలోని ఆత్మీయతా కనిపించగానే ఆయన ముఖం వికసించింది. కనుక్కోవలసిన తారకనామం కనిపించినంత సంబరపడిపోయాడు.
    "హమ్మయ్య" దొరికావన్నమాట! అలవైకుంఠపురమ్ములో, నగరిలో ఆ మూల సౌధమ్ములో అన్నట్టుగా ఎక్కడో వుండిపోయావు నువ్వు...పిలిస్తే పలకలా?
    పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిన ప్రతి ఆడపిల్లా తొలిరోజుల్లో పుట్టింటినీ, పుట్టినింటివైపు వాళ్ళనీ మరిచిపోతుందట. మళ్ళీ అత్తారింట్లో ఆప్యాయతో, అనురాగమో ఏదో కొరవయితేనే మళ్ళీ వీళ్ళు గుర్తుకొచ్చేది. సామాన్యంగా ప్రతి యువతికీ ఆర్నెల్లు తిరక్కుండానే అత్తిల్లు, ఏడాది తిరక్కుండానే భర్త బోర్ కొట్టేస్తున్నారీ మధ్యకాలంలో...
    అప్పుడే వాళ్ళకి తమ వాళ్ళు గుర్తుకొస్తారట. అంచేత ఆర్నెల్లదాకా ఆగుదామనుకున్నాను. కానీ మా వరూని చూడకుండా వుండలేకపోయాను. అందుకే వచ్చేశాను"
    ఆయన చప్పున మాటలు మధ్యలోనే ఆపేసి కాస్త మంచినీళ్ళివ్వమ్మా! అన్నారు నవ్వుతో.
    ఆ మాటలకి నవ్వేసింది వారుణి.
    "మంచినీళ్ళు తెస్తానుండండి" అని కదిలింది.
    గదిలో అడుగుపెట్టబోతోన్నదల్లా లోపల వినిపించిన మాటలని విని ఆగిపోయింది. ఆమెకి "వోవర్ హీయరింగ్" గిట్టదు. అలవాటూ లేదు, ఇష్టమూ వుండదు.
    కానీ మానవ సహజమైన కుతూహలంతో ఆగిపోయింది. సబ్జక్ట్ తనదాయె మరి! అంతే కాకుండా ఆ మాటాడుకుంటున్నది ప్రత్యర్థి వర్గమా అన్నట్టుగా వున్న అత్తా తోడికోడళ్ళూను. అంచేత వారుణి కూడా కొద్దిసేపు ఆగిపోయింది.
    "ఎవరట ?"
    "ఎవరో నాకేం తెలుసు ?"
    "బంధువులా ?"
    "ఏమోఁ బంధువో_రాబందువో_"
    "ఎక్కడి నుంచి వచ్చాడో! మంచి నీళ్ళు_కాఫీయో_టిఫినో_"
    "ఎందుకూ ? అదో దండగ"
    "రాత్రికి వుండిపోతారేమో?"
    "చేతిలో లగేజ్ లేదు."
    "చేతులూపుకుంటూ వచ్చాడా ?"
    "వస్తూ కాసిని పూలో_ పళ్ళో_ స్వీట్సో తేకూడదూ? వేసవి కదా మల్లెలు కారుచౌక.. ఊరకే మా వారుణి..వారుణి అంటే ప్రేమ వొరిగిపోతుందా?"
    "పోదూఁ మర్యాద తెలీని మనిషి"
    "ఎలాంటి వాళ్ళతో అలా వ్యవహరించాలి. అంతే! అల్మెరాలో సున్నుండలున్నాయి. డబ్బాలో కారప్పూస వుంది. ఫ్లాస్కులో కాఫీ వుంది. అయినా యివ్వటానికి నాకు మనస్కరించటం లేదు. ఆఖరికి మంచినీళ్ళయినా_"
    "ఇక అవికూడానా? ఖర్చు"
    రైల్వే ప్లాట్ ఫాంపైన సాగే సంభాషణ లాగా సాగే ఆ ధోరణి యిక ఆగదనిపించి, కొద్దిగా తనరాకని ధ్వనింపచేస్తూ వంటింట్లోకి ప్రవేశించింది వారుణి. ఆమెకి యింకా బయటే నుంచుని అంతూ పొంతూ లేని ఆ మాటలని వినాలని లేదు.
    తమ మాటలు విన్నదా అన్నట్టుగా చూశారు సుబ్బరత్నమ్మ కోడలివైపు.
    సావిత్రి ముఖం మాడిపోయింది.
    "అత్తయ్యా ఆయనకి టిఫిన్ పెడతాను పొడిగా అంది వారుణి. ఆమెకి అత్తగారితో మాటాడాలంటేనే అసహ్యంగా వుంది. సిగ్గుగా వుంది...బాధగానూ వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS