Previous Page Next Page 
నేను పేజి 43


    "ఆలోచించుకో. ఆలోచించుకో" అని హెచ్చరిస్తున్నాడు.


    "నేనాలోచించుకున్నాను. మీరిస్తోన్న ఆఫర్ గొప్పదే కావచ్చు. కాని నా మనసంగీకరించటం లేదు. ఇహ మీరిక్కడికి రాకండి" అని చెప్పేశాను.


    ముఖమంతా ఎర్రగా చేసుకుని వెళ్ళిపోయాడు.


    వైదేహి వాళ్ళింట్లో భయంకరమైన తతంగం జరుగుతోంది. ఆమెను బలవంతంగా మిగతా రెండు రోజులూ కూడా ఆ నరకంలోకి పంపించారు. బహుశా పిచ్చిపిల్ల స్వర్గమని ఎన్నో కలలు కని ఉంటుంది. గదిలోంచి కేకలూ, హాహాకారాలూ వినిపిస్తున్నాయి.   


    హీరో కమ్ విలన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.


    ఇల్లు ప్రక్క ప్రక్కనే ఉండబట్టి మధ్య మధ్య వాళ్ళ సంభాషణ లీలగా తెలుస్తోంది.


    "నేనెంతో సహనం చూపిస్తున్నానండీ. మీ అమ్మాయి కోపరేట్ చెయ్యటం లేదు. పెళ్ళి చేసుకునేది దేనికి? సుఖాలనుభవించాలని ఉండదా?"


    "ఎందుకుండదు బాబూ ఉంటుంది. మగాడన్నాక పెళ్ళాంతో తప్పక సుఖాలనుభవించాల్సిందే. దానికప్పటికీ నూరిపోస్తున్నాము. మొగుడితో ఎలా ఉండాలో, ఎలా మసులుకోవాలో...."  


    లక్ష రూపాయలకు పైగా కట్నమిస్తామని పెద్ద పెద్ద సంబంధాలొచ్చాయండి. ఏదో మీరు మా చుట్టూ తిరిగారని జాలిపడి పెళ్ళి చేసుకున్నాను. కలిసిన ప్రతిసారీ పెద్ద యుద్ధం చెయ్యాల్సి వస్తోంటే ఛీ ఛీ ఛీ విసుగెత్తిపోతోంది. ఇలాగైతే తెగతెంపులు చేసుకోవాల్సి వస్తుంది."


    "బాబ్బాబు. అంత పని చెయ్యకు. అది నీ పెళ్ళాం నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో."


    "చూస్తాను చూస్తాను. దారికొచ్చిందా సరే సరి. లేకపోతే ఎవరేం చెప్పినా వినిపించుకోను."


    ఈ వ్యవహారమంతా చూస్తూ నా రక్తం ఉడుకెత్తిపోతోంది. అసలు.... ఈ కుటుంబం, సమాజం, ఈ వ్యవస్థ అంతా ఏమిటి? మనిషికి మనిషికీ మధ్య రిలేషన్ షిప్ ఇంత ఘోరంగా ఎందుకు సృష్టించబడింది ?


    వైదేహిని బలవంతంగా కాపరానికి తీసుకెళ్ళిపోయారు.


    తీసుకెళ్ళిన మూడో రోజునే పారిపోయి వచ్చేసింది.


    ఆ మర్నాడే మొగుడు వెధవ "చంపేస్తాను, పొడిచేస్తాను, వొదిలేస్తాను" అంటూ తయారయ్యాడు.


    వాడ్ని బ్రతిమిలాడుకుని, బామాలి, క్షమించమని కాళ్ళా వ్రేళ్ళా పడి కూతుర్ని తిట్టి, తన్ని మళ్లీ వాడివెంట పంపించారు.    


    రెండు రోజుల తర్వాత ఇల్లంతా ఏడుపులూ, పెడబొబ్బలతో గగ్గోలుగా ఉంటే ఏమిటని వాకబు చేశాను.    


    వైదేహి కిరసనాయిల్ పోసుకుని, నిప్పంటించుకుని చనిపోయిందట. టెలిగ్రామొచ్చింది.


    తన ఆక్రందనలు, మొర ఎవరికీ అందని ఓ నిస్సహాయ అబల జీవితం ముగిసిపోయింది.  


                                   16


    సుకుమార్ వచ్చాడు.


    నేను మంచంమీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నాను. అతన్ని చూసి మళ్లీ కళ్లు మూసుకున్నాను.       


    దగ్గర కొచ్చినట్లు అలికిడి వల్ల తెలుస్తోంది.


    "సతీ!" అని పిలిచాడు.


    నేను కళ్లు తెరవలేదు.


    మంచం మీద కూచున్నాడు. "కోపమొచ్చిందా?"


    కళ్లు తెరిచి అతని వంక చూసి నవ్వాను. "ఇంత చిన్న చిన్న వాటికి కోపం రాదు. మనసు వేటి వేటి గురించో బాధపడుతోంది."


    "ఇక్కడ్నుంచి రూమ్ కెళ్ళగానే అమ్మకి సీరియస్ గా ఉందని వచ్చిన టెలిగ్రాం ఎదురు చూస్తోంది. వెంటనే బయల్దేరి వెళ్లిపోయాను. వెళ్లిన కొంతసేపటికే అమ్మ చనిపోయింది. అంత్యక్రియలు పూర్తిచేసి వచ్చేశాను."  


    చేయి 'జాచి' అతని చెయ్యి పట్టుకుని గుండెల మీదకు లాక్కున్నాను.


    "అమ్మగారు పోయారా? సారీ" అన్నాను.


    అతని ముఖంలో దిగులు స్పష్టంగా తెలుస్తోంది.


    స్వచ్చమైన దిగులులో గుండెల్ని కరిగించే శక్తి వుంది. "రా ప్రియతమా. ఇలా నా హృదయం మీద సేద తీర్చుకో" అన్నాను.     


    అతని తల నా వక్షస్థలం మీద వాల్చి పడుకున్నాడు. తల నిమురుతున్నాను.


    "సుకుమార్. అమ్మ గాకుండా నీకు...."


    "ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో నేనేకాకిని."


    "నాలాగా."


    కొంచెం సేపలా నిశ్శబ్దంగా గడిచిపోయింది.


    అదో అందమైన విషాదం. ఈ విషాదమంటే నాకెంతో ఇష్టం. సమయమొచ్చినప్పుడల్లా చెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. దీపావళి పండుగ తర్వాత శూన్యంగా, దిగులుగా మారిన మరునాడూ, సర్కస్ డేరాలో వందలమందిలో కూర్చున్నప్పుడూ, ఆ డేరా అక్కణ్ణుంచి ఎత్తేసినప్పుడూ, పెళ్ళి జరుగుతూన్నప్పుడూ, పెళ్లి పూర్తయి ఎవరిదార్న వాళ్లు వెళ్లినప్పుడూ, చివరివరకూ పోరాడి క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడూ, ఆ పోరాటంలో వెంట్రుక వాశిలో ఓడినప్పుడూ, శృంగార రసంతో మనసు నిండి పోయినప్పుడూ, శృంగార రాహిత్యంలో సొమ్మసిల్లినప్పుడూ, ప్రేమలో, సంతోషంలో, తృప్తిలో, అన్వేషణలో.... ఏదో రకమైన విషాదం వెన్నంటి ఉంటుంది. పెల్లుబికే విషాదాన్ని మనుషులు గుర్తిస్తారు. గాని, గుప్తమైన విషాదాన్ని అస్పష్టంగా అనుభవిస్తారు గాని దర్శించలేరు.  


    "సతీ! నీకు కోపమొచ్చిందా?"


    "దేనికి?"


    "ఆ రోజాలా జరిగినందుకు"


    "నా అంగీకారంతోనే జరిగిందిగా. కోపం దేనికి?"


    "ఆ అంగీకారం తెలిసీ తెలీని స్థితిలో, ఓ మైకం ఆవరించిన స్థితిలో ఇచ్చి ఉండవచ్చుగా." 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS