"ప్రజాసేవంటే ఏమిటి? మనిళ్ళల్లో వాళ్ళొచ్చి వెట్టి చాకిరీ చేయడం కాదని నేనూ వప్పుకుంటాను. మనందరికీ ఉపయోగపడే అవసరాలేమిటో గమనించి, వాటిని మనందరి అందుబాటులో వుండే యేర్పాటు చేయడమే ప్రజాసేవ! వప్పుకున్నారా? ఉదాహరణకి రోడ్లు వేయించుట, వీథుల్లో దీపాలూ, కుళాయిలూ ఏర్పాటుచేయుట వగైరా వగైరా. బోరుకొడితే చెప్పండి సార్, ఆపేస్తాను. థాంక్స్....అయితే వినండింక. రేపొచ్చే ఎన్నికల్లో మీ వార్డులో పోటీ చేసే అభ్యర్థుల్ని నిలబెట్టి, వాళ్ళ మొహాన్న అడగండి_'మీలో నువ్వు గెలిస్తే మాకేం చేస్తావని? వాడొక కథ చెబుతాడు. రోడ్లూ, పంపులూ, లైట్లూ అంటాడు. అది మామూలే. అన్నీ వినండి. విన్న తర్వాత మరో అభ్యర్థిని అడగండి_అతని కథేమిటో? పౌరుషం పొంగి వాడు మరికొన్ని అడనమైన ఏర్పాట్లు చెబుతాడు. అదీ వినండి. తర్వాత మనమేం చెయ్యాలంటే జాగ్రత్తగా వినండి సార్. 'అయ్యరూ మా ఓట్లన్నీ మీలో ఒక్కరికే వేస్తాంగాని, మా మనవి ఆలకించండి. ఇదిగో ఈ రోడ్డుకీ, దీపాలకీ వగైరాలకు ఒక పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేశాం. రేపొద్దున మీలో ఒకరు ఎన్నికయితే, మీరన్నట్టు యింత డబ్బునీ ప్రభుత్వం దగ్గర పుచ్చుకుని ఇవన్నీ చేయించాలిగదా? అవునా? మీరప్పుడు చేయించగలరో చేయలేరో మాకు అనవసరం. ఇవాళ ఆ పదివేల రూపాయిలూ మా దగ్గర డిపాజిట్ చేయండి. మా సమస్తమైన వాళ్ళ ఓట్లూ మీకే వేస్తాం. ఆ తర్వాత మీరు ఎన్నికలముందు సెలవిచ్చిన విధంగా మా పనులు చేయించగలిగితే మీరు డిపాజిట్ చేసిన పదివేలూ మీకు నిక్షేపంగా చేరతాయి. లేదూ మీ డిపాజిట్ సొమ్ముతో మా పనులన్నీ మేము చేయించుకుంటాం. మాక్కావలసింది మీరు గాఢంగా ఆశిస్తున్న ప్రజాసేవయే. మీకు శక్తివుంటే ప్రభుత్వం చేత చేయిస్తారు. లేదూ, మీ చేతి చమురుతో ప్రజాసేవ చేసి ధన్యులవుతారు. అంతేగాని, బాబులూ! మీ మీ కట్టు కథలూ, తడి గుడ్డలూ, బోడి లిటిగేషన్ లతో పనిలేదని గట్టిగా మాటాడి చూడండి. తిమ్మాపురంలో ఎన్నికంటూ అస్సలు జరగనే జరగవు. అయిదూ, పదీ యిచ్చి మనుషుల్ని కొనుక్కోవటం తెలుసుగాని, హామీ యిచ్చిన ప్రజావసరాలు తీర్చగల దమ్ములెక్కడివి ఈ పాలకులకు? ఏవంటారు? అయ్యా, యిదండి బాబూ రాజకీయం. దీని దుంప తెంచడానికి నాలాటి వాడొకడుండి వాడి వెనక కొందరు నిలబడితే ఇక చెప్పనేల?"
డాక్టరుతోబాటు అక్కడున్న మనుషులంతా సీతాపతి వాగ్దాటికీ, అతని తెలివికీ మురిసిపోయి 'అవునని' తలలూపేరు.
ఇప్పుడు మరో మనిషి మరో చిట్కా చెప్పడానికి ఉద్యుక్తుడయ్యేడు____
* * * *
సుమతి డాక్టరు కోసం వీధిలోకి వచ్చింది.
అంత వీధిలోకి రాగానే సుమతి మొట్టమొదట సిగ్గు పడింది. ఆ తర్వాత గుండె కొట్టుకోడం ఎక్కువై భయపడింది. ఇంత వీధిలో ఎవరు ఏది మాట్లాడినా, అది తన గురించేనని భ్రమపడి వణికిపోతోంది.
అయినా డాక్టరుకోసం నడుస్తూనే వుంది.
తలొంచుకుని నడుస్తున్నా చుట్టుప్రక్కల గమనిస్తూ, భయపడిన లేడి పిల్లలా ఒక్కోచోట నడక వేగం పెరుగుతూ, కాళ్ళల్లో వణుకు పుట్టుకురాగా తప్పటడుగులు వేస్తూ, గుండెల్ని చేత్తో పట్టుకున్న విధంగా అంత భారంగా నడుస్తూనే వుంది.
ఆ పిల్ల వీధి మొహం చూచి చాలాకాలమైపోయింది. ఇంట్లో మంచానపడ్డ తల్లికి వ్యాధేమిటో డాక్టర్లు ఖచ్చితంగా చెప్పలేకపోయారుగాని సుమతి మాత్రం సుళువుగా గ్రహించింది.
గ్రహించిందేగాని ఆ వ్యాధి నివారణ నిమిత్తం మందేమిటో తెలీక అల్లాడిపోతూంది.
ఇవాళ ఆ తల్లి పరిస్థితి మరింత దారుణంకాగా, డాక్టరు కొరకు సుమతి వీధిని పడక తప్పలేదు.
ఇవాళ ఆ తల్లి స్పృహ తప్పిపోయే ముందు మళ్లా తనతో ఆ వేడుకోలే చేసుకుంది. సుమతిని దగ్గరకు పిలిచి చేతులు పట్టుకుని ప్రాధేయపడి అన్నది____
'అమ్మడూ, నీకు అన్యాయమే జరిగిపోయింది. నిజమే_ అయినా బతుకు, నిండా నూరేళ్లు బతుకు అమ్మడూ, బతుకు. అలాగే పరాభవాన్ని సహించి బతుకు. ఎవరేమన్నా, నీ మనసెంత గాయపడుతున్నా నాకోసం.... నా కోసమే బతుకు. అంతేగాని అమ్మడూ నువ్వేదయినా అఘాయిత్యం చేసుకుంటే, నా గతేంగాను? నువ్వు బతికి నన్ను బతికించు తల్లీ!.... అలా అని మాటివ్వు.'
అంతకంటే ఒక ఆడది ఒక తల్లి ఏమంటుంది?
దీనికి తగ్గట్టు ఆ చుట్టుపక్కల వాళ్ళకి సుమతి కథ తెలీడంతో బయటపడి ఎక్కడ పోయినా, తల్లి, కూతుళ్ళని గుచ్చి గుచ్చి చూస్తూ, ఆ చూపుల్తో ఇద్దరినీ భయపెట్టేస్తున్నారు.
మళ్ళీ ఆ చూపులకివేళ అవకాశమిచ్చింది సుమతి. అందుచేత ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి.
ఈ పాడు బతుకుని సముద్రంలోనో దూకి పూర్తి చేసుకుందామనుకున్న ప్రతి తడవా తల్లి దైన్య స్థితి జ్ఞాపకం వచ్చి, ఆ ప్రయత్నాలను విరమించుకోడం మామూలైపోయింది సుమతికి. తల్లి బ్రతికినన్నాళ్ళూ (ఇంకెంత కాలం? దగ్గర పడిందిగదా) తనూ బతికి, ఆ తల్లి కన్ను మూసిన తక్షణమే తనూ చావాలని చివరి నిర్ణయంగా అనుకుంది సుమతి.
ఇదుగో....అందుకే.....ఈ తల్లి బతుకెన్నాళ్ళో సరిగ్గా తేల్చి చెప్పమని....డాక్టర్ని అడిగేందుకు వీధిని పడక తప్పింది కాదు. అంతవరకూ ఈ అవమానం భరించక తప్పదు.
ఈ డాక్టరొకడు. రోజూ తల్లికి మందు కొచ్చే ప్రయత్నమే చేస్తాడుగానీ, క్షణంలో చంపే వైద్యం చేయడం లేదు. ఎన్నాళ్ళిలా ఒకరికొకరు సానుభూతి తెలుపుకుంటూ బతకాలని దేవుడు రాసేడో!
ఇవాళ సుమతికి గట్టి నమ్మకంగా వుంది. ఇవాల్టితో తల్లి చరిత్ర ముగిస్తే_ రేపు తన కథ.... ....
డాక్టరు దిస్పెన్సరీలో నవ్వులు వినిపిస్తున్నాయి.
ఈ మధ్య జన సముదాయాన్ని చూసినా, నవ్వులు విన్నా సుమతికి భయంగా, బాధగా, రోతగా ఉంటోంది.
ఈ డాక్టరూ తగ్గ డాక్టరే! ప్రాక్టీసు మాటెలా వున్నా రోజు రోజుకీ ఈ డిస్పెన్సరీ క్లబ్బు రూపాన్ని పొందుతూంది. తిమ్మాపురంలో మరెక్కడా చోటు లేనట్టు, తోచని మహాశయులంతా ఇక్కడకు చేరడమేమిటి?
'ఈ డాక్టరు దగ్గరకొచ్చే రోగులకు రోగాలుండవు. ఉన్నా, అవి తోచని రోగాలే తప్పించి ప్రమాదకరమైన రోగాలు కావు,' అనుకుంది సుమతి. శరీరం నిండా కొంగు కప్పుకొని లోపలికి అడుగుపెట్టింది.
ఠక్కున నవ్వులాగిపోయాయి.
సుమతికి ఈ మార్పు భయంగా వుంది.
