ఎక్కడికీ పరుగు పందేలు?
ఇంట్లో ఏదో పెన్నిధి దాచుకున్నట్టుగా పరుగెడుతారు. బజార్లో నవనిధులూ కుప్పలు పోసి ఊరకే ఎత్తికెళ్ళమన్నంత ఆత్రంగా వెళతారు, ఎందుకీ ఆరాటం?
జీవితంలో యీ వేగం వల్లనే మనుషుల ఆయుర్దాయం సగం క్షీణిస్తోందేమో! ప్రతివారికీ హైప్రెషర్ లేదా లోప్రెషర్.
ఎందుకీ హైరానా?
ప్రశాంత జీవితం రాదా మళ్ళీ! పట్టణాల్లో అంతే! పల్లెల్లోనూ అంతే! అంతా_అంతటా ఉద్విగ్నత. ప్రకృతి అందాలకి, ప్రశాంత జీవనానికి, నిర్మలత్వానికి నిలయమైన పల్లెలు యిప్పుడు కలుషితమైపోయాయి. అక్కడా నాగరికత ప్రబలిపోయింది.
దాని వెర్రితలలు అది వేస్తోంది.
జీవితం పరుగుపందెమైపోతే యిక అందులో సుఖమే వుంది? రొప్పుటం తప్ప. శాంతేముంది? ఆరాటం తప్ప. ఎప్పుడూ పరుగెత్తడమేనా?
దేనికీ పరుగులు ?
డబ్బు కోసమా ?
పదవి కోసమా ?
ఏదయినా దాని పరమార్థం తృప్తికావాలి. తృప్తి లేని యీ పరుగులెందుకు? ఈ పదవులెందుకు? ఈ డబ్బెందుకు? ఐశ్వర్యమెందుకు?
పెళ్ళిళ్ళు కూడా జూదాలయిపోయాయి. ఏ యువతికి ఎలాంటి యువకుడు వస్తాడో, ఏ యువకుడికి ఎలాంటి అమ్మాయి లభిస్తుందో తెలీదు. అన్నీ చూశామే అనుకుంటారు. అన్నీ వచ్చాయనుకుంటారు. ఫర్లేదు అనుకుంటారు.
కానీ నిజ జీవితంలో ప్రవేశించాకే తెలుస్తోంది దౌర్భాగ్యం. ఎవరికి ఎక్కడా తగిన జోడు దొరకటం లేదేమోననిపిస్తోంది. అంతా నటన, అంతటా నటన. ప్రతి కుటుంబం ఓ నిప్పుల కుంపటి. ప్రతివారి జీవితం ఓ నిత్య సంగ్రామం. అన్యత్ర ఆకర్షణ!
వ్యవసాయం ఒక లాటరీ. ఒక పందెం. ఒక జూదమైపోయాక రైతు ఎలాగా దివాలా తీస్తున్నాడో తద్వారా దేశం ఏ విధంగా బీదదైపోతోందో- పెళ్లి కూడా ఒక జూదమై అయిన వారికి నిరాశగా, కాని వారికి ఆశగా మిగిలిపోతోంది.
అంతా ఎండమావి. దూరం వాడికి నీటి పడియలాగా_ సమీపించిన వాడికి ఇసక పర్రలాగా కనిపిస్తోంది. అనుభవానికి వస్తోంది.
పూర్వర్షులు మేధావులు ఆలోచించి యీ వివాహ వ్యవస్థని దర్శించి సంఘ భద్రత కోసం_మానవ శాంతికోసం మనుగడకోసం యీ ధర్మాన్ని నిర్వచించారు.
వాళ్ళ ద్రష్టత యిప్పుడు లోపించిందా? ఆ చూపులో యిప్పుడు దోషం వచ్చేసిందా? ఆదర్శాలు, ఆ మనుధర్మాలు క్రమేపీ శిథిలమై జీర్ణమై యీ వివాహ వ్యవస్థ క్రమేపీ కూలిపోతోందా?
ఒకానొకనాటికి రోజురోజుకి క్రమక్రమంగా దిగజారిపోతున్న యీ నైతిక విలువలు, యీ వివాహ వ్యవస్థని పూర్తిగా కూల్చేసి ఫ్రీలవ్ ప్రపంచం వస్తుందా?
భయం వేసింది వారుణికి.
ఆమె ఆలోచనా ధోరణి ఆమెకే ఒడలు జలదరింపజేసింది. తను వక్రమార్గంలో ఆలోచిస్తున్నదా అనుకున్నది. తను పరిస్థితులని మరీ భూతద్దంలో విశ్లేషించి చూస్తున్నదా? అనుకుంది. ఊహూఁ అలా కాదు. తన ఆలోచనలు వక్రమార్గాన వెళ్ళవుగాక వెళ్ళవు.
మరి ?
మరి ?
తల విదుల్చుకున్నది వారుణి. ఆమెకి మనశ్శాంతి కరువైపోతున్నట్టుగా అనిపించింది.
"వరూ!"
"ఎవరూ ?"
"ఎవరూ!"
"ఎవరు? ఎవరు కావాలి?"
"ఎవరూ_అంటే వారుణి లేదా?" తన చమత్కారం ఫెయిలయిపోవటంతో అడిగాడా వ్యక్తి.
ఆలోచనల నుంచి చప్పున బయటపడింది వారుణి. తన కోసం_తనని చూడటం కోసం వచ్చిన రావుగారితో అత్తగారు మాటాడుతోన్నట్టుగా అర్థమైంది ఆమెకి. చప్పున గది నుంచి బయటికి వచ్చింది. ఆ సరికే ఆయన తనని తాను పరిచయం చేసుకున్నారు లాగుంది. యితర్ల రాకపోకలు అంతగా నచ్చని సుబ్బరత్నంగారు ఆయన్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు.
