"పెళ్లి చేసింది మొగుడు దగ్గర పడుకోటానికా? అక్క దగ్గర పడుకోటానికా?" అంటూ లాగుతోంది.
"నేను రాను" అంటూ వైదేహి పెనుగులాడుతోంది.
"ఎందుకని?"
"వాడు మొగుడు కాదు రాక్షసుడు. నా వొళ్లంతా చీల్చి పారేస్తున్నాడు."
"మొదటి రోజలాగే ఉంటుందిలే. అప్పట్లో మీ నాన్న నన్నిలాగే చేశాడు. నేనిలాగే పారిపోయి వచ్చానా? చక్కగా కాపరం చెయ్యలేదూ? మొదట్లో ఇలాగే ఉంటుంది. తర్వాత ఇంకా కావాలని నువ్వే ఎగబడతావు."
చేసిన తప్పును సరిదిద్దుకోటానికి మనిషి ఎన్ని రకాలుగానైనా మాట్లాడతాడు.
తల్లి లాక్కెళ్లటానికి ప్రయత్నిస్తోంది. కూతురు విడదీసుకోటానికి గింజుకుంటోంది.
ఆ స్థితి పరాకాష్ఠ చేరుకుంటుందనుకునేసరికి నేను కల్పించుకున్నాను.
"చూడండి వైదేహి చాలా భయపడిపోయింది. ఇంకాసేపట్లో ఎలాగూ తెల్లారిపోతుంది. జరిగింది కూడా తక్కువ తతంగమేం కాదు. సరిగ్గా చూస్తే మీకే తెలుస్తుంది. తనకి మెల్లిగా నచ్చ చెబుతాను. రేపటిదాకా ఇక్కడే ఉండనివ్వండి" అన్నాను.
"ఓ యబ్బో! పెద్ద అనుభవమున్న దానిలా చెబుతున్నావే. మొగుడితో కాపరం చెయ్యటం చేతగాక పరాయి మొగాడితో కులుకుతున్న దానివి.... నీ సలహా ఎవడిక్కావాలే. బోడి సలహా. ఏమని నచ్చచెబుతావు? మొగుడ్నొదిలేయమనా? ఇంకోడుతో లేచిపొమ్మనా?"
నా శరీరం ఆవేశంతో వొణికిపోయింది. "కాంతమ్మగారూ! నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. అవును. నేను మొగుడ్నొదిలేశాను. ఎందుకు? ఎందుకలా జరిగిందని ఈ లోకంలో ఒక్కరు.... ఒక్కరయినా సానుభూతి చూపించారా? సానుభూతి చూపించకపోతే మనె. కనీసం ఆలోచించనన్నా ఆలోచించారా? మొగాళ్ళ సంగతలా ఉంచండి. ఆడవారిలో ఎవరయినా అర్థం చేసుకోటానికి ప్రయత్నించారా? కన్న కూతుర్నే అర్థం చేసుకోలేని మీలాంటి ఆడవాళ్ళు బయటి స్త్రీని ఏ విధంగా అర్థం చేసుకుంటారు" అవును. అవసరమొస్తే మొగుడ్ని పెళ్లామూ, పెళ్లాన్ని మొగుడూ వొదిలెయ్యవల్సి వస్తుంది. పరమ వికృతంగా పరిణమించినప్పుడు ఆ బంధాన్ని భరించడం కన్నా వొదిలించుకోటమే మంచిది. కొందర్లో ఈ అగ్ని బయట పడటానికి సంవత్సరాలు పట్టవచ్చు.
కొందర్లో కొన్ని రోజుల్లోనే రగులుకోవచ్చు. ఏమన్నావూ? ఎవర్నో తీసుకొచ్చి కులుకుతున్నాననా? నాకిష్టమయింది కులుకుతున్నాను. అద్దె ఇంట్లో ఉంటే కులక్కూడదనీ, సొంత ఇల్లయితే కులకవచ్చనీ రూల్సు ఉన్నాయా ఏమిటి? సొంత ఇల్లయితే మిగతా వాటితోబాటు ఈ హక్కు కూడా ఇస్తుందా ఏమిటి, ఆ మాటకొస్తే పదహారేళ్ళ పడుచుదగ్గర్నుంచే నలభైయేళ్ళ నడివయసుదాని దాక ఏదో ఓ సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు కులుకుతూనే ఉంటారు. సీను మారొచ్చు. చెప్పుకునే అర్థం మారొచ్చు. మనకున్న కెపాసిటీని బట్టి దూరాలూ, అర్థాలూ మార్చుకుంటూ ఉంటాం. నిజం చెప్పాలంటే మీరూ ఒకరిద్దరితో కులకటం చూశాను."
అంతవరకూ కామ్ గా ఉన్న ఆవిడగారి మొగుడు ఉన్నట్టుండి ఉగ్రుడైపోయాడు.
"ఆయ్ పెద్దా చిన్నా అంతరం లేకుండా మా ఆవిడ్ని పట్టుకుని అంత మాటంటావా" అంటూ మీదకొచ్చాడు.
"పోరా. నువ్వేం చేస్తావు? అందరు మొగుళ్ళు ఎక్కడ ఆత్మవంచన చేసుకుంటారో అక్కడే నువ్వూ చేసుకుంటున్నావు. నిన్నటిదాకా ముక్కూ మొహం తెలీని పరాయి వెధవ ఇరవైనాలుగంటల్లో నీ కూతురి శరీరం మీద సర్వాధిపత్యం సంపాదించి చీల్చి చెండాడుతూంటే ఇలా కాదని చెప్పటం చేతకాదుగాని పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా చవట వెధవా!"
అంత ఆవేశంగా ఎలా మాట్లాడగలిగానో తెలీదు. సృష్టిలో ప్రకృతి స్త్రీకి ప్రసాదించిన వరం ఇదే. ఎంతో జుగుప్సాకరమైన పరిస్థితి ఉత్పన్నమైతే తప్ప మగాడు పరాయి ఆడదానిమీద చెయ్యి చేసుకోలేడు. ఈ నిజాన్ని గ్రహించిన ఆడది ఆ సన్నివేశాన్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తూ ఉంటుంది.
కాంతమ్మకీ విషయం ఎందుకు తెలీదు? కూతుర్ని వొదిలేసి నా మీదకు దూసుకొచ్చింది.
"నా మొగుడ్ని పట్టుకుని ఎంతమాట పడితే అంత మాటంటావా? నాలాంటి ఉత్తమ ఇల్లాలికి రంకులు కడతావా?" అంటూ చెయ్యెత్తింది.
ఆ చెయ్యి ముందుకు రాకుండా అలాగే పట్టుకున్నాను.
"ఇదిగో కాంతమ్మా! నన్ను తక్కువగా అంచనా వెయ్యకు. నా వొంటిమీద దెబ్బపడిందా, అంతకు పదిరెట్లు దెబ్బలు నువ్వు తినాల్సి వస్తుంది."
నా కళ్ళలోకి చూసి ఉలిక్కిపడినట్లయి తమాయించుకుంది.
"సరే సరే. నీ పనిప్పుడు కాదు. ముందు దీని సంగతి తేల్చనియ్" అంటూ కూతురు రెక్క పట్టుకుని బరబరా ఈడ్చుకుపోయింది.
* * *
సుకుమార్ గుర్తొస్తున్నాడు. అతన్తో నా అనుభవం ఎంత మృదువుగా ఉంది! ఇదేమిటీ పైశాచికత్వం! ఓ ఆడపిల్లను అనుభవించాలంటే ఇన్ని ఘోరమైన మార్గాలు అనుసరించాలా? ఆనందాన్ని ఇంత వికృతంగా జుర్రుకోవాలా?
ఛీ.
ఆ వెధవని ముక్కలు ముక్కలుగా నరికి పారెయ్యాలనిపిస్తోంది.
* * *
తర్వాత వారం రోజుల్లో ఎన్నో సంఘటనలు గబగబ జరిగిపోయాయి.
ప్రకాష్ బాబుతో నా నిర్ణయం ఖచ్చితంగా చెప్పేసినా రెండు మూడుసార్లు వొచ్చి విపరీతంగా బలవంతం చేసి వెళ్ళాడు.
