చిరంజీవి వణికిపోతూ అన్నాడు.
"ఆగు నాన్నా! నువ్వు వెళ్ళకు. నేనే వెళతాను. ఇప్పుడే వెళ్ళి సుమతిని తీసుకొస్తాను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. నువ్వు కూర్చో నాన్నా.... వెళ్ళకు."
రామదాసు ఆగిపోయారు. వచ్చి సోఫాలో కూర్చున్నారు. కూర్చుని అన్నారు.
"అలాగే నువ్వే వెళ్ళు. వచ్చేప్పుడు లాయరుగార్ని రమ్మన్నానని చెప్పు.... అట్లా గుడ్లప్పగించి చూడకు. రాత కోతలన్నీ ఇవాళే పూర్తికావాలి. ఇక నీ బతుకు నీ భార్య చెప్పుచేతల్లో వుంటుంది. అర్థమయ్యిందా?.... అయితే వెళ్ళింక."
రైలు దిగి వచ్చినవాడు వచ్చినట్టే సుమతి వాళ్ళింటివేపు కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళాడు చిరంజీవి.
* * * *
"మీరేం ఖంగారు పడక్కర్లేదు. అజీర్ణము మామూలు వ్యాధే. తిమ్మాపురంలో ఈ వ్యాధి అతి మామూలు. నన్నడిగితే సగానికి సగం మంది తిన్నది అరక్క బాధ పడుతుంటే సరిగ్గా అంతమందీ తిండిలేక బాధపడుతున్నారు, ఈ వూళ్ళో!" అన్నాడు డాక్టరు.
ఆ మాట విని సీతాపతి పకపకా నవ్వేశాడు.
"చూస్తుంటే, మీరూ నాయకులైపోయేట్టున్నారు."
"జోకా?"
"నన్ను తక్కువగా అంచనా వేయకండి మరి. మీరు నా నాడి చూసి వ్యాధి నిర్ణయం ఎలా చేస్తారో, నేను రాజకీయనాడి చూచి రాజకీయ వ్యాధి అలా నిర్ణయిస్తాను. నేను రాజకీయ డాక్టర్నండి బాబు, ఎంతయినా కనకంగారి అల్లుణ్ణి కదా!"
"మంచి జోకే!"
"నా వ్యాధి కూడా మంచి జోకే మరి. కుర్రవాణ్ణి. రాళ్లు తిని జీర్ణం చేసుకునే వయస్సా? మరి నాకెందుకొస్తుందండి ఆ దిక్కుమాలిన రోగం? ఇట్లాంటి వ్యాధులు మావకీ, మన ఎక్స్ ప్రభువు శ్రీ రామదాసుగారికీ రావాలిగానీ, నాకు రావడం జొక్కాదూ? ఆ వ్యాధికి నేనేపాటి వాడిని చెప్పండి?"
"అన్నట్టు సీతాపతి బాబూ, రామదాసుగారు రాజీనామా ఎందుకు చేశారో మీకేమయినా వివరాలు తెలుసా?"
"అడక్కండి. అదంతా డిప్లొమసీ. సీజరు గాడికి రాజ్యాభిషేకం చేస్తామని కిరీటాన్నిస్తే వాడేం చేశాడో తెలుసాండి? వద్దంటే వద్దని మూడుసార్లు ఫోజుకొట్టేడు. అప్పటి ప్రజలు పిచ్చి వెధవలు కనుక బతిమాలి, బామాలి నాలుగో తడవ వాడి నెత్తిన కిరీటం వుంచారు. అయ్యా! ఇక్కడ సీనేమిటయిందంటే దాసుగారు కూడా పోజు కోసం రాజీనామా యిస్తే, ఇదే గొప్ప ఛాన్సని వెనకున్న యావగాళ్ళు కిరీటాన్ని లాక్కుని దాసుగారికి 'గోవిందా' కొట్టారు. గొప్ప ఫిటింగ్సు లేండి. లోకనాథంగారు ప్రభువూ, మాన ఉపప్రభువూ అయ్యేందుకు ఇంతకంటే ఛాన్సెక్కడ ఏడ్చింది? అంచేత దాసుగారి డిప్లొమసి మన్ను కొట్టుకు పోయింది. పాలిటిక్సండి బాబూ! గొప్ప ట్రిక్స్, అడక్కండి మరి" అన్నాడు సీతాపతి.
ఇంత కథా విన్న డాక్టరు బాబుకి ఉత్సాహం పొంగి వచ్చి, ఆయన మరో కథ చెప్పాడు___
"పాలిటిక్సంటే గుర్తుకొచ్చింది. మనుపేం జరిగిందో తెలుసా? ఈ దాసుగారికి గుండెజబ్బనీ, క్షణమో, అరక్షణమో అన్నట్టుంది వ్యవహారమనీ కబురొచ్చింది."
"అవునవును. కానీ, మీరు ఆయన్ని రక్షించారుగా!"
"అక్కడే వుంది ట్రిక్కు. గాడిద కొడుకు గుండ్రాయిలా వున్నాడండి బాబూ! అదంతా నటన. నన్నూ నటించమని కబురంపేడు. ఛస్తానా. నటించాను. బాబూ! అప్పుడక్కడ జరిగిన సీను ఇవాళ గుర్తుకోస్తుంటే రామ రామ తడి గుడ్డలతో గొంతులు కోసేశారు కదండి. అదుగో. ఆ సీనులోనేగా లోకనాథం గారిని ఉపప్రభువుగా ప్రకటించారు. లేకపోతే, ఈ లోకనాథంగారు కత్తి దింపేవారేనా?"
ఆ ఉదంతం వినీ వినడంతోటే సీతాపతితోపాటు అక్కడున్న నలుగురైదుగురు పౌరులు ముక్కుల మీద వేళ్ళేసుకుని ఎంతో ఆశ్చర్యపోయారు. 'రామ రామ ఎన్నెన్ని రహస్యాలు వింటున్నాం, అనిగూడా అనుకున్నారు. నోరు ఇంత దారుణంగా జారడంవల్ల, తన వృత్తిని శంకించి తననెక్కడ దెబ్బతీస్తారోనని డాక్టరు భయపడి, వెంటనే ప్లేటు మార్చి చాలా అనునయంగా అన్నాడు.
"మరో డాక్టరూ, మరో డాక్టరూ వస్తే గొప్పగా వుండదని ఇంత ప్రాక్టీసూ, పనితనం వున్న నన్నే ఆడించారు దాసుగారు. ఏం చేస్తాను చెప్పండి? ఎంత పెద్ద డాక్టర్నయినా దాసుగార్ని ఎదిరించి ఈ వూళ్ళో ఎలా బతగ్గలను? అంచేత ఒప్పుకున్నాను."
వాతావరణం అనుకూలంగా నడవడంతో సీతాపతి (చొరవగా) అక్కడున్న పెద్దలూ, డాక్టర్ తో అన్నారు___
"చూశారా, చూశారా! ఎంత ఘోరమో ఎంత నీచమో విన్నారా? ఇవన్నీ గమనించే ఈ దరిద్రగొట్టు రాజకీయ దెయ్యాలకి నేనో మందు కనిపెట్టాను. చెప్పానుగా నేనో రాజకీయ డాక్టర్నని."
"ఏమిటండీ అది?" అడిగేడొక బద్ధకస్తుడు.
"మనవి చేస్తాను! అంతా నింపాదిగా మనవి చేస్తాను. ముందు దీనికి వప్పుకోండి___ప్రజాసేవ చేస్తామనేగా ఎన్నికల్లో ఇంతింతమంది గూండాలు పోటీలు పడి మనల్ని మోసం చేస్తుంది?"
"అవును," అన్నాడు రెండో బద్ధకస్థుడూ, పెద్దమనిషీను.
