ఆమె కళ్ళల్లో ప్రేమ మెరుపులు మెరుస్తోంది.
"చిన్నా! నువ్వే నన్ను గాయపరిచావు!" ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అన్నాడు. "ఈ పదిరోజులూ నేనెంత నరకం అనుభవించానో తెలుసా?" అతని గొంతులో గాద్గదికత ధ్వనించింది.
"నువ్వు_ నువ్వు_ నువ్వయినా రాజీపడలేదు."
నువ్వు మాత్రం_ ఏదో పోగొట్టుకున్న దానిలా శూన్యంగా అయిపోయావు. ఎప్పుడూ ఏదో ఆలోచన. ఈ గది వదిలి బయటికే రాలేదు."
"నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. ఆ సర్వాంతర్యామికి తెలుసు. ఈ తెలుగు దేశంలో ఆధునిక యువతికి అడుగడుగునా ఎన్ని అపజయాలో నాకు తెలుసు? మీ మగవాళ్ళకేం తెలుసు? నోటిదాకా వచ్చి ఉవ్వెత్తుగా ఎగిసిపడే ఎదలోపలి సొద అక్కడే ఆగిపోయింది. అతనికేసి జాలివుట్టిపడే కళ్ళతో చూసింది.
ఆ చూపులకి కరిగిపోయాడతను. "చిన్నా! నిన్నీ యింటికి తెచ్చి తప్పు చేశానా!" అన్నాడు.
"ఊహూఁ రధి_ ఇది మనిద్దరి యిల్లే అనుకున్నాను. కానీ మనం ఒక కుటుంబంలో భాగం అనుకోలేదు. ప్రవాహం వెంట నీరు మాత్రమే రాదు. చెత్తాచెదారం కూడా వస్తుంది. నీటి కోసం దాన్ని భరించాలి. నీకోసం నేను దేన్నయినా భరిస్తాను."
అతనికా మాటలు కొంత బాధని కలిగించాయి. పరోక్షంగా తల్లిని, వదిన్ని ఆమె వేలెత్తి చూపటం అతనికి నచ్చలేదు. కానీ అభ్యంతరం చెప్పలేదు. "చిన్నా! మా వదిన బోలెడంత కట్నం తెచ్చింది. ఆమెకి పుట్టింటివారు నగలు కూడా ఎక్కువే యిచ్చారు. ఆరుగురు అన్నదమ్ముల మధ్య ఒకమ్మాయి. అంతా వెల్ ప్లేస్ డ్. అంచేత వాళ్ళకి తడుముకోవలసిన అవసరం కనిపించలేదు. చిన్నా! ఇంకా యీ దేశంలో మనుషులకి ఐశ్వర్యం మీద_అందునా అప్పలంగా లాటరీలోనో, కట్నంగానో, కానుకగానో, లంచంగానో వచ్చేదానిమీద కాంక్ష పోలేదు. మనం భరించక తప్పదు!"
"నన్నేం చెయ్యమంటారో చెప్పండి!"
నిట్టూర్చాడు సారధి. అతనికీ యీ పరిస్థితి యిబ్బందిగానే వుంది. "ఇటు భార్య_అటు తల్లీ! ఎవర్నేమనాలి?"
నిజంగా యీ దేశంలో సామాన్యంగా ప్రతి మధ్య తరగతి కుటుంబంలోనూ ప్రతి యువకుడికి యీ సమస్య ఎప్పుడో ఒకప్పుడు వచ్చేది. తనూ ఒకనాటి కోడలినేనని ప్రతి అత్తా మరిచిపోతుంది. వయస్సు తెచ్చే మార్పో, అనుభవం నడిపించే లక్షణమో, పిన్నలకి తెలియదనే భ్రాంతో కానీ తామూ తమ అత్తలాగే ప్రవర్తిస్తారు కోడళ్ళు.
"ప్రేమకి డబ్బుకి యింత లంకె వుంటుందనుకోలేదు."
సారధి ఆప్యాయంగా చూశాడు. ఆమె తన పాయింట్ కి వస్తోందన్న భావం కన్పించింది.
"ప్రేమ యింత స్థిరత్వం లేనిదా?"
దెబ్బతిన్నట్టుగా చూశాడు సారధి.
"నేను సర్దుకుపోవటానికి ప్రయత్నిస్తాను!"
"థాంక్స్ చిన్నా. అనవసరంగా కలతలు సృష్టించుకుని మనం బాధపడటం ఎందుకు? లెటజ్ ఎంజాయ్ ది లైఫ్."
"తను అనవసరంగా కలతలు సృష్టించిందా? ఇదా అతను తనని అర్థంచేసుకున్నది. ఈయన బ్రెయిన్ ని ఎవరో "వాష్" చేశారు అనుకుంది వారుణి.
ఇద్దరి మధ్య తాత్కాలికమైన ఒప్పందం కుదిరిపోయింది.
19
ఒక రోజు సాయంకాలం.
ఇంట్లో మగాళ్ళెవరూ లేరు. నారాయణ ఆఫీసుకెళ్ళాడు. ఫణి ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు. సారధి లైబ్రరీకి వెళ్ళాడు. సుబ్బరత్నమ్మ, సావిత్రి లోపల వంటతో కుస్తీ పడుతున్నారు. ఏది ఏమైనా తను వంటింటికి అంకితం కాదలచుకోలేదు వారుణి. ఎలాగూ వేసవి శలవులు. పగలెలాగూ వేసవి ఎండలతో పోరాటం తప్పదు. సాయంకాలం బయట వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంటుంది.
ప్రతిరోజూ అక్కడే కూర్చుని జనం రద్దీని గమనిస్తూ వుండటం వారుణికి అలవాటు. రోజూలాగే కూర్చుని దారివెంట వచ్చిపోయే జనాన్ని చూస్తోంది. ఏమిటో హడావిడి! బజారుకెళుతోన్నా, బజారు నుంచి ఇంటి ముఖం పట్టినా, సినిమాలు వెళుతున్నా థియేటరు నుంచి ఇంటికయినా ఒకటే పరుగు!పరుగు!
