Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 42


    అతని మాటల్లో నిష్ఠూరం వున్నా కళ్ళల్లో అనురాగం పొంగుతోంది. అది బలవంతాన అణచిపెడుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తూనే వుంది.

    ఆమె కళ్ళల్లో సున్నితమైన బాధ మిలమిల్లాడుతూ కనిపించింది. ఇక నిగ్రహించుకోవటం ఆమె చేత కాలేదు. ఒక్క ఉదుటున వచ్చి అతని పాదాలను చుట్టేసుకుని బావురుమని ఏడ్చేసింది.

    ఆ ఏడ్పు మెల్లగా ప్రారంభమై ఉదృతం కాసాగింది. తల్లిదండ్రి ఎవరైనా చూస్తారేమోనని దాశరధి కంగారుగా అటూ ఇటూ చూశాడు.

    చటుక్కున ముందుకి వంగి ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు. గాఢంగా హృదయానికి హత్తుకుని తల నిమురుతూ కళ్ళనీళ్ళు తుడిచాడు.

    "పిచ్చి జానకీ! నీలో ఈ మార్పు కోసమే నేను నిరీక్షించింది. నాకు ప్రేమ, అనురాగం, దగ్గరవాలనే, ఆత్మీయత లేక కాదు. నీకై నీవు నీ తప్పు తెలుసుకోవాలి. అందుకే ఓర్పుగా నిరీక్షించాను" దాశరధి ఆమెను ఓదార్చాడు.

    జానకి మరింత గాఢంగా అతన్ని హత్తుకుపోయింది.

    "ఏమండీ! నేనెంత నరకం అనుభవించానో మీకు తెలుసా?"

    "తెలుసు!" అన్నట్లుగా ఆమె నుదురు చుంబించాడతను.

    ఇంతసేపైనా కోడలు రాలేదని అటువైపుగా వచ్చిన పార్వతికి కన్నుల పండుగైంది. గుండెలమీద నుంచి కొండంత భారమేదో దిగిపోయినట్లయింది.

    ముసిముసిగా నవ్వుకుంటూ తలుపులు దగ్గిరగా చేరవేసి వెళ్ళిపోయింది.

    "పోస్ట్!" అన్న కేకవిని శాస్త్రిగారు లేచి వెళ్ళి అందుకున్నారు.

    "నే చదువుతా మీరు పడుకోండి నాన్నా!" పట్టాభి చేతిలోని లేఖ అందుకున్నాడు.

    అతను మొదట పైకే చదువుదామనుకున్నాడు గానీ చదవలేకపోయాడు.

    వేదమూర్తులైన పరబ్రహ్మ శాస్త్రిగారికి_

    రఘునాధశర్మ నమస్కరించి వ్రాయునది_

    మీరీపాటికి అన్నీ యేర్పాట్లు పూర్తి చేసుకుని మా కోసం ఎదురు చూస్తుంటారు. మేము రాలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా వుంది. మనకి సంబంధం కలుపుకునే యోగం లేదు. ఎందుకంటే మీ అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నాడన్న విషయం మాకు తెలిసింది. యీ విషయంలో నాకంతగా పట్టింపులేకపోయినా_ పెద్దవారు మా నాన్నగారు అంగీకరించరు. ఆయన గారి మనసు కష్టపెట్టడం నాకిష్టంలేదు. నన్ను మన్నించండి. తరాల అంతరాలో వస్తున్న ఈ మార్పుకి మనం తలవంచకా తప్పదు. దానివలన వచ్చే పరిణామాలు ఎదుర్కొనకా తప్పదు.

                                                                                                        భవదీయుడు
                                                                                                        రఘునాధశర్మ

    పట్టాభి జాలిగా చూశాడు తండ్రివంక. ఆయన కుతూహలంగా చూస్తున్నారు కొడుకువంక.

    నిండైన అలంకరణలో వున్న శ్రీవిద్యని చూడగానే అతని హృదయం తరుక్కుపోయింది.

    "ఎక్కణ్నుంచయ్యా ఉత్తరం?" అంటూ వచ్చింది జానకి. ఆమె వెనకగా వచ్చిన దాశరధి తమ్ముడిచేతిలోని లేఖతీసి చదువుకుని నిర్ఘాంతపోయాడు.

    "ఇలా జరిగిందేమిటి?" అతని మనసు విలవిల్లాడుతోంది. మౌనంగా ఆ లేఖ భార్యకందించి అక్కణ్నుంచి వెళ్ళబోయాడు...

    "అన్నయ్యా!" పట్టాభి పిలిచాడు.

    "ఇప్పుడు వెళ్ళిపోవటం కాదు కర్తవ్యం!" గంభీరంగా అన్నాడు. దాశరధి అయోమయంగా చూశాడు తమ్ముడివంక. జానకి మనసు కలుక్కుమంది. మామగారి ముఖంవైపు చూడాలంటేనే బాధగా అనిపించింది.

    "ఏవిటర్రా! మూగమొద్దుల్లా అలా నిలబడిపోయారు? ఎవర్రాశారు లెటరు? ఏవిటి సంగతి?" శాస్త్రిగారు ఆదుర్దాగా ప్రశ్నించారు.

    దాశరధి బరువుగా అన్నాడు_

    "వాళ్ళకేవో ఇబ్బందులొచ్చాయట నాన్నా! మరోసారి వస్తామని రాశారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

    పట్టాభి కూడా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.

    శాస్త్రిగారు, పార్వతి అయోమయంగా చూస్తుండిపోయారు. వాళ్ళకళ్ళకి ఎదురుగా వస్తున్న సీతారాం కనిపించాడు. పార్వతి కళ్ళు ఆనందంతో మెరిసాయి. శాస్త్రిగారు ముఖం మరో పక్కకి తిప్పుకున్నారు. కొడుకు ఇల్లు పట్టకుండా అలా వూళ్ళు తిరుగుతూ నాటకాలు వేయటం ఆయనకు సుతారామూ ఇష్టం లేదు.

    "దొరగానికి ఇల్లు కనిపించిందా?"

    సీతారాం వస్తూనే తండ్రి పాదాలకు నమస్కరించాడు. 'ఏమిటోయ్ అంత భక్తి?'

    "ఏం లేదు నాన్నా! మీ అనుమతిలేకుండా నేనొక పని చేశాను. మీరు ఆశీర్వదించాలి" తగ్గు స్వరంతో మెల్లగా అన్నాడు.

    ఆయన దీర్ఘంగా నిట్టూర్చి వేదాంతిలా చిరునవ్వు నవ్వారు. "నువ్వు ఏ పని చెప్పి చేస్తున్నావు గనక? సీతా చెప్పరా ఏం చేశావు?"

    గుమ్మంవైపు వేలుపెట్టి చూపించాడు.

    చామనచాయలో సామాన్యమైన అందంతో వెలిగిపోతున్న ఒక అమ్మాయి. పెళ్ళికూతురి అలంకరణలొ నడిచి వస్తోంది.

    అందరికీ పరిస్థితి అర్ధమై పోయింది.

    ఏదో జరగబోతుందని ఎదురు చూశారు. అది జరగలేదు. మరేదో జరుగుతోంది. ఈ జీవితం ఎప్పుడూ మనం చెప్పినట్లు వినదు. దాని చేతిలో మనం కీలు బొమ్మలం.

    "ఎవరీ అమ్మాయి!" గంభీరంగా ప్రశ్నించారాయన.

    "మీ కోడలు" స్థిరంగా సమాధాన మిచ్చాడు. __

    "ఆ సంగతి తెలుస్తూనే వుంది. తల్లిదండ్రీ వూరు పేరూ... కులం గోత్రం"__


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS