కానీ నేను సంప్రదాయ అభిమానిని.
అవును సంప్రదాయం రక్షించే స్త్రీని, నాకు తల్లిదండ్రులు, నా భర్త, నా అత్తమామ పూర్వాచారపరాణతనే నేర్పించారు. ఆచరింప చేశారు నాతో.
భర్త పోతే మళ్ళీ పెళ్ళికి తలపడటం నా ఉద్దేశ్యంలో మహా ఘోరం. ఆ మాట చెబితే కొందరి దృష్టిలో ఘోరం కానీ మామగారూ! శాస్త్రం, సాంప్రదాయం అనేవి చట్టం కంటే కఠినమైనవి. అవి ఎవరు ఎలా నిర్ణయిస్తే అలా మారేవి కావు. అనుకూలం కొద్దీ సవరించుకునేవు కావు. పూర్వర్షులు నిర్ణయించినవి. ఆర్ష సాంప్రదాయాన్ని, ఆర్య రక్తాన్ని కలుషితం చేయకుండా కాపాడేందుకు ఉద్దేశింపబడినవి.
ఈరోజు అన్నీ కలుషిత మయ్యాయి. తినే తిండి, కట్టే బట్ట, తాగే నీరు అన్నీ కల్తీ బ్రతుకులే కల్తీ అయ్యాయి.
అందుకే బ్రతుకుల్లో శాంతిలేదు. ఏ కొంపలో చూసినా అశాంతి! ఇదంతా సంప్రదాయం చెడటం వల్లనే.
నేను చెడను.
అయినా అతను నాపై ఆశ పడ్డాడంటే నాలో ఏ దోషం వుందో? నేను అతన్ని ఆకర్షించాను కదా! అది నా తప్పు. పూర్వీకులలాగా నేనూ శిరో ముండనం చేసుకుని తెల్లబట్టలు కట్టుకొని తలుపు చాటు జీవితం సాగించి ఉంటే పట్టాభి నన్ను పెళ్ళాడతాననేవాడా?
ఊహు అదీ నా తప్పు. అందుకే నన్ను నేను శిక్షించుకుంటున్నాను. ఈ చావుకి ఎవరూ బాధ్యులు కారు.
"మావయ్యా! నాదో ఆఖరు కోరిక_ నేను పోయానని మీరు రామాయణ రచన ఆపుచేయకండి. శ్రీవిద్యకు చెబుతూ పూర్తి చేయండి. నా భాగం ఆస్తి శ్రీవిద్యకివ్వండి.
అందరిలాగా నేనూ మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాను.
నన్ను మన్నించండి మీ కోడలు స్వాతి.
ఉత్తరం చదివి పట్టాభి ముఖాన విసిరికొట్టారు శాస్త్రిగారు.
గబగబా చదివాడు పట్టాభి.
అయ్యో! అని విచారించాడు.
ఆమె మనసు తెలుసుకోకుండా ఎంత పని చేశాను? "నేను నీ చావుకి కారణమయ్యానా స్వాతీ! ఛ ఛ నేను పాపాత్ముణ్ణి" అనుకున్నాడు.
"ఇక జరగవలసింది కానివ్వండి. అన్నారెవరో" చకచకా అందరికి కబుర్లు చేశారు. సాయంత్రానికి ఒక్కొక్కరు దిగసాగారు.
శ్రీవిద్య, పార్వతి కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.
జానకి వచ్చి స్వాతి మంచితనాన్ని తలుచుకుని తలుచుకుని కుమిలిపోయింది.
"నీవెంత ఆత్మాభిమానం గలదానివి? నీకూ మాకూ ఎంత తేడా వుంది? భర్తపోయిన దగ్గర్నుంచి మహా యోగినిలా కాలం గడుపుతున్నావు. కోరికలకి సమాధి కట్టేసి... నిజంగా శాస్త్రిగారి అసలైన కోడలు అనేలా జీవించావు. నీ వ్యక్తిత్వం ముందు మేమెంతో అల్పంగా అనిపిస్తున్నాం" జానకి కన్నీళ్ళ మధ్య బాధగా అనుకుంటోంది.
జరగాల్సిన కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి అందరి హృదయాలు, బాధతో దుఃఖంతో బరువెక్కి పోయాయి.
నిన్నటివరకూ శాంతిదూతలా ఇంట్లో తిరిగి, మామగారికి తలలో నాలుకలా మెలగిన స్వాతి మరిలేదు.
* * *
ఆరోజు శ్రీవిద్యని చూసుకోవటానికి పెళ్ళి వారొస్తారు. ఇల్లంతా చాలా హడావిడిగా వుంది. స్వాతి చనిపోయిన తరువాత వచ్చిన జానకి మళ్ళీ పుట్టింటికి వెళ్ళలేదు. దాశరధి ఈ మార్పుకి సంతోషించినా ముభావంగానే వుండిపోయాడు.
ఆరోజు తన మనసునంతగా క్షోభపెట్టిన భార్యని క్షమించలేక పోతున్నాడతను. అంతకూ పార్వతి ఒకసారి హెచ్చరించింది కొడుకుని.
"చూడు దాశరధి! జరిగిందేదో జరిగిపోయింది. అది తన తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చింది. తప్పులందరూ చేస్తారు. కాని తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడినవాళ్ళే మహానుభావులు."
అయినా దాశరధి మనసు కరగలేదు. జానకి అంటే అంటీముట్టనట్లే తిరుగుతున్నాడు. భర్త ప్రవర్తనకు జానకి పైకి ఏమీ అనలేకపోయినా లోలోపలే కుమిలిపోసాగింది.
శ్రీవిద్యని చక్కగా అలంకరించింది. ఇల్లంతా నీట్ గా సర్దింది. కావలసిన ఫలహారాలు అత్తగారి సాయంతో తయారుచేసి సిద్ధంగా ఉంచింది. ప్రతి పనిలో ఆమెకి స్వాతి గుర్తుకొస్తూనే వుంది. ఆ శాంతం, ఆ వినయ స్వభావం దేనికి తొణకని మనస్తత్వం, ఆమెకి స్వాతిని తలుచుకున్న కొద్దీ పదేపదే కళ్ళనీళ్ళు నిండుకుంటున్నాయి_
"జానకి ఏమిటలా వున్నావు?" పార్వతి కోడలి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది.
"అబ్బే ఏం లేదండీ?" మరో పక్కకి తిరిగి పైట చెంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంది_
పార్వతి దీర్ఘంగా నిట్టూర్చింది. కొడుకు మూర్ఖత్వానికి కోపం వచ్చింది.
"ఆ రూములోకి వెళ్ళి కప్పులూ సాసర్లు టిఫిను ప్లేట్లు తీసుకురామ్మా. వాళ్ళొచ్చే వేళవుతుందేమో?"
జానకి గబగబా స్టోరు రూమువైపు వెళ్ళింది. తలుపు దగ్గరే హటాత్తుగా ఆగిపోయింది. దాశరధి కిటికీలోంచి బయటికి చూస్తూ నిలబడి వున్నాడు. అడుగుల చప్పుడు విని ఇటు తిరిగి చూశాడు.
పాలకడలిలో లక్ష్మీదేవిలా వుంది జానకి... కనకాంబరం రంగు ధర్మవరం పట్టుచీర, మెడలో ముత్యాల హారం, నుదుట అందమైన సింగార్, చేతుల నిండా గాజులు తలలో జాజులు_వదులుగా వేసుకున్న జడ...ఇద్దరు పిల్లలైనా సడలిపోని యౌవనం, అతని కళ్ళముందు మెరుపులా మెరిసిందామె.
ఇద్దరి చూపులూ ఒక్కక్షణం కలుసుకున్నాయి. అవి విడదీయరానంతగా పెనవేసుకున్నాయి. గుండెలలో ప్రేమ ప్రవాహాలు పొంగుతున్నాయి. మనసులలోని అభిమానాలు మాత్రం వెనక్కి లాగుతున్నాయి.
"జానకీ! ఎంతసేపు త్వరగా రా!" అత్తగారి పిలుపు విని ఈ లోకంలో కొచ్చింది జానకి. గబగబా అలమర దగ్గరకు నడిచి కప్పులు, సాసర్లు తీసి కింద ట్రేలో సర్దసాగింది.
"విడాకుల కాగితాలమీద సంతకం పెట్టిన రాణీగారు మళ్ళీ ఎందుకొచ్చినట్లు?" ఆ నిష్టూర స్వరానికి చరాలున తల వెనక్కి తిప్పి చూసింది.
