Previous Page
సప్తపర్ణి పేజి 43


    "అవేమో నాకు తెలీదు. ఆమె అనాధ. నాకు నచ్చింది. ఆమె కిష్టమైంది. పెళ్ళి చేసుకున్నాం. మీరు ఆశీర్వదిస్తే ఇంట్లో వుంటాం... లేదా ఇలాగే వెళ్ళిపోతాం"__

    అందరూ బొమ్మల్లా నిలబడిపోయి ఆ మాటలు వింటున్నారు__

    పార్వతి అప్పుడే చలనం వచ్చిన దానిలా కదిలింది. శాస్త్రిగారు ఆలోచనలో పడిపోయారు.

    అసలే సమస్యలతో నలిగిపోయి వున్న పార్వతి మనసు మరింత గాయపడింది. తలవంచుకుని నిల్చున్న పెళ్ళికూతురి వంక రెప్ప వాల్చకుండా చూసింది.

    "నా పేరు శిరీష" అమ్మాయి మెల్లగా అంది.

    "ఆహా" అనుకున్నారందరూ...

    జానకి ఇంట్లో నుంచి హారతి తెచ్చింది నూతన దంపతులిద్దరికీ దిష్టితీసి హారతిచ్చింది. శాస్త్రిగారు లోపలికి తీసికెళ్ళ మన్నట్లు సైగ చేశారు.__

    సీతారాం ముఖంలో ఆనందం తొంగి చూచింది.

    అతను సంతోషంగా తండ్రి చేతులు కళ్ళ కద్దుకున్నాడు భక్తిగా__

    "కానీ ఒక షరతు" గంభీరంగా అన్నారాయన... ఏవిటన్నట్లు చూశాడు__

    "నువ్వామెను ఇంట్లో పడేసి... నీ యిష్టం వచ్చినట్లు వూళ్ళు తిరుగుతానంటే ఒప్పుకోను. కుదురుగా యింటిపట్టునే వుండాలి"__

    గతుక్కుమన్నాడు సీతారాం__

    "మరి నా బ్రతుకు తెరువు"__

    "అది నీవు నిర్ణయించుకోవాలి"

    సీతారాం ఆలోచిస్తూ లోపలికి నడిచాడు.

    శ్రీవిద్యకి క్షణంలో విషయం తెలిసింది. సీతారాం ధైర్యాన్ని ప్రశంసించింది గానీ తండ్రి మనసు ఎంతగా క్షోభిస్తుందో ఆమెకి అర్ధమైంది... జానకి శ్రీవిద్యకి చాటుగా వుత్తరం చూపించింది.

    ఆ పిల్ల అదిరిపడలేదు. చిన్నగా నవ్వుకుంది.

    "ఇది చాలా సహజం వదినా! ఈ సమాజంలో మార్పు అనేది మనం అనుకున్నంత త్వరగా రాదు. మెల్లమెల్లగా వస్తుంది. నాకేం బాధగాలేదు. మీరూ వర్రీ కావద్దు"...

    అతి మామూలుగా మాట్లాడుతున్న ఆడబిడ్డని చూసి జానకి విస్తుబోయింది.

    "ఎంత మనోధైర్యం ఈ అమ్మాయికి!" అనుకుంది.

    "వదినా! ఆశ్చర్యపోతున్నావా? ఆడపిల్లలకి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలుండాలి. దృఢమైన వ్యక్తిత్వం వుండాలి. ప్రతిదానికీ జావగారిపోయి, బేలగా విలపించే మనస్తత్వం పోవాలి. వాళ్ళు కాదనగానే నాకిక పెళ్ళి కాదా?..." పెద్ద ఆరిందాలాగా అనుభవమున్న దానిలాగా మాట్లాడుతున్న కూతుర్ని చూస్తే ఏమనాలో అర్ధంకాలేదు పార్వతికి.

    అందరూ కొత్త కోడలిని పరామర్శించే హడావిడిలో పడిపోయారు.

    సరాసరి శ్రీవిద్య తండ్రి దగ్గరకు వచ్చింది. ఆయన చేతిలో స్వాతి రాస్తూ రాస్తూ వదిలేసిన రామాయణం ఉంది. అది చూడగానే ఆమెకు మనసులో ఒక మెరుపు మెరిసినట్లయింది. తనకి కర్తవ్యమేదో స్పురించినట్లు అనిపించింది.

    "నాన్నగారూ!" మృదువుగా పిలిచింది.

    "ఏమ్మా" ఆయన చూపులు మెల్లిగా కూతురివైపు తిరిగాయి.

    "నాకిప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు..."

    ఆయన పెదవులపై మందహాస రేఖ మెరిసింది.

    "ఎందుకు తల్లీ అలాంటి మాటలు?"

    "కాదు నాన్నా! పెళ్ళి ఒకటే జీవనగమ్యం కాదు. అయినా నాపెళ్ళికి ఇప్పుడేమంత తొందర. నాకు ఒక కోరిక వుంది."

    "ఏమిటి తల్లీ అది?"

    "నేనున్నాను. మీరేం విచారించకండి. నాకు చెప్పేందుకు నోరు రావటం లేదు. మాట పెగలటం లేదు. కానీ నేను మీ ఆఖరి కొడుకుననుకోండి. మీరు రామాయణం చెపితే రాస్తాను. వదిన ఆత్మ శాంతిస్తుంది__"

    శాస్త్రిగారు కూతురివంక, తనముందే ఎంతో ఎత్తుగా ఎదిగిపోయిన శ్రీవిద్య వంక ప్రశంసాపూర్వకంగా చూశారు. ఆయన కళ్ళల్లోని కాంతులు ఆమె శిరస్సుపై ఆశీస్సులుగా కురిశాయి.

    మరో గంట గడిచాక చూస్తే యీజీ చెయిరులో పడుకుని ఆత్మజ్యోతిలాగా మనోనేత్రం ముందు మహోజ్వలంగా వెలుగుతున్న రామాయణగాధనే చెబుతున్న శాస్త్రిగారు, ఏకదీక్షగా రాస్తున్న శ్రీవిద్య_ ఆగానం వింటున్న పార్వతి కనిపిస్తారు ఎవరికైనా!

    ఆయన సాహిత్య తపస్వి. భవబంధాలకు అతీతంగా ఆయనొక మార్గాన్ని ఎన్నుకున్నారు. అదే వెలుగు బాట. ఆ బాటలో దివ్యజ్యోతి ఆ శ్రీరామచంద్రుని దివ్య మంగళ విగ్రహం.

                                  *** THE END ***


 Previous Page

WRITERS
PUBLICATIONS