"నేను విన్నది నిజమేనా నాన్నా?"
"సమయానికి వచ్చావురా నీ పనిమీదే బయటకు వెళ్ళబోతున్నాను. నాకు శ్రమ తగ్గించావ్, రా....చెబుతా. అక్కడ కూచో!" అన్నారాయన సోఫా చూపిస్తూ.
తండ్రి కొడుకు లిద్దరూ కూచున్నారు.
"నేనడిగిందానికి సమాధానం చెప్పలేదు నాన్నా?"
"రాజీనామా గురించేనా?"
"అవును. నిజమేనా."
"అవును. నిజమేరా! రాజీనామా చేశాను."
"ఎందుకు చేశావ్?"
"మంచికోసం?"
"మంచికోసమా? మంచేమిటి నాన్నా?"
"మంచి అంటే ఏమిటని అడుగు బావుంటుంది. నీకు మంచేమిటో చెప్పే ఓపిక నాకు లేదుగానీ, ఇకముందు నేను చేయబోయేదంతా మంచే! నేను చేస్తున్నది చూసి మంచేమిటో నేర్చుకో!"
"ఆ మంచి, పదవిలో వుండే చేయవచ్చుగా!"
రామదాసు నవ్వేరు____
"నా పదవిని అడ్డం పెట్టుకుని ఎదగాలనుకుంటున్నావు కదుట్రా నువ్వు! ఆ ఆశని తుంచేయాలనే రాజీనామా చేసేన్రా! అదొక మంచి ముఖ్యమైన మంచి. మరికొన్ని నెమ్మదిగా అర్థమవుతాయి నీకు."
చిరంజీవి బాధ పడ్డాడు. చాలా దిగులుగా అన్నాడు.
"తెలీక నేను పాడుపనేదైనా చేస్తే నువ్వు హెచ్చరిస్తే, నేను దిద్దుకోనా? ఇంత మాత్రానికే నువ్వు రాజీనామా ఇవ్వాలా?"
"నేనా పదవిలో వుంటే నువ్వు నా చేతికి అందవురా అబ్బీ!"
"మరి....మరి సింహాసనం నాకెక్కడ నాన్నా?"
"నీకు సింహాసనమిస్తే ప్రమాదం."
"మునుపు నాకెందుకు ఆశ పెట్టావ్?"
"అందుకే యిప్పుడు నేను సింహాసనం దిగాను."
"నన్నిప్పుడేం చేయమంటావ్?"
బుద్ధిగా చదువుకుని బాగుపడమంటాను."
"మరి రాజకీయం?"
"వదిలెయ్."
"మా వాళ్లంతా నామీద ఆశలు పెట్టుకున్నారే?"
"మైసూర్ మహాసభలో కలిసిన మీ వాళ్ళా?"
"అవున్నానా!"
"ఇక సభల కెళ్లకు. నువ్విప్పటివరకూ సక్రమంగా పెరగలేదు. మనవి సంకర బుద్ధులు. ఈ బుద్ధులు రాజకీయంలో తగలేస్తే రాజకీయమే తగలడిపోతుంది. వంకరగా తయారై వంకరగా ప్రజల్ని తింటుంది. ఇది మహాపాపం."
చిరంజీవికి కోపం వచ్చేసింది____
"అంటే ఈ పాపం మీకు ఇప్పుడే అర్థమైందా నాన్నా?"
"అవున్నాయనా! సుమతి కథ తెలీకపోతే యిప్పుడూ అర్థమయ్యేది కాదు."
"సుమతి?"
"నీ భార్య!"
చిరంజీవి కొంచెం నెమ్మదించేడు. చాలా తాపీగా అన్నాడు.
"నాకు తెలుసు నాన్నా! నేను అనుకుంటూనే వున్నాను. సుమతికి నేను అన్యాయం చేసేపని తెలిసి నువ్వానాడు బాధపడ్డావు. క్షమించు నాన్నా! నీ మాటకి ఎదురాడనింక! నేను సుమతిని తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను. నీ రాజీనామాని ఉపసంహరించుకో."
"సలహా ఇవ్వకురా ఫూల్! రాజకీయానికి నువ్వుగానీ, నేను గానీ తగం. రాజకీయంలో పడీ పడటంతోటే మనకి వళ్లు తిమ్మిరెక్కి, మనల్ని మనం మరిచిపోతాం. ముందు....వెంటనే నువ్వు సుమతి వాళ్ళింటికి వెళ్ళు, వెళ్ళి అమ్మాయికి క్షమాపణలు చెప్పుకో మళ్ళా మీ యిద్దరూ కలిసిక్కడకి రండి."
"నాన్నా?"
"అంతే!"
"నువ్వు నీ రాజీనామా ఉపసంహరించుకోవుగాని, నేను సుమతిని పెళ్లాడాలి. అంతేనా?"
"రాజీనామాకీ సుమతికీ సంబంధ మేమిట్రా ఫూల్! సుమతి నీ భార్య!"
చిరంజీవి వేడి మీద అనేశాడు____
"నువ్వు రాజీనామాని ఉపసంహరించుకోకపోతే సుమతి నాకు భార్యగా రాదు."
రామదాసు పెళ్ళున నవ్వేశారు. నవ్వి అన్నారు.
"నువ్వీమాట అంటావని నాకు తెలుసురా సన్నాసీ! సుమతి నీకు భార్యగా ఈ యింటికి రాకపోతే, ఈ యింట్లో నీకు స్థానమేలేదు. చాలా నిర్ణయాలు నేనింతకు మునుపే చేసుకున్నాను. ఆ పిల్లకి అన్యాయం చేసి నువ్వెక్కడికి పోతావో నేనూ చూస్తాను. ఆ పిల్ల నీకు భార్య కాకపోతే నాకు కోడలురా రాస్కెల్! కొడుకూ, కోడలూ అన్నీ ఆ పిల్లే. నా స్వార్జితమైన ఇంత పెద్ద మేడకీ, ఇంత ఆస్థికీ ఆ పిల్లే సర్వాధికారిణి! అండర్ స్టాండ్?.....దెన్ గెటప్!....గెటవుట్ ఆఫ్ మై సైట్ యూ స్కౌండ్రల్!"
మొట్టమొదటిసారిగా తండ్రి కోపాన్ని రుచి చూచిన చిరంజీవి నిలువెల్లా వణికిపోయాడు. రుద్రుడి రూపంలో కనిపిస్తున్న తండ్రిని భయంగా చూస్తూ____
"నాన్నా!" అన్నాడు.
"నన్నంత మెత్తగా పిలవకు. నన్ను మెత్తగా పిలిచి మళ్ళీ నన్ను దుర్మార్గుణ్ణి చేయకు వెళ్ళిపో!....గో!.... నీ యిష్టమొచ్చిన సభలకెళ్ళి అక్కడ చేరిన నక్కలూ, పులులూ, సింహాల్తోటి చేతులు కలిపి మనిషిగా సర్వనాశమైనపో! వెళ్ళిపోరా గాడిదా! నువ్వు కనికరించకపోతే సుమతి బతకలేదనుకుంటున్నావేమో ఆ పప్పులు నా దగ్గిరుడకవు. చెబితినే సుమతి నా కొడుకూ, కోడలూ సర్వం అని. నేనిప్పుడే వెళ్లి ఆ పిల్లని తీసుకొస్తాను. మేము వచ్చేవేళకి నువ్విక్కడుంటే__నీ రక్తం కళ్ళజూస్తాను. తమాషాకి అనడంకాదు. నిజమే అంటున్నాను. తర్వాత నీ యిష్టం!" అని, ఆయనలేచి వెళ్ళబోయారు.
