Previous Page Next Page 
రాగోదయం పేజి 41


    చిద్విలాసంగా నవ్వాడు శేషయ్య. "వెర్రివాడా! నీ కింకా తెలియదా! మనం ఎవరు? దేవుడు మనుషులం. దేవుడు లేనిదే మనం లేం. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అంతా దేవుడు సొమ్ము కాదా! ఇదీ అంతే!"
    "ఆహా ఆహా వేదాంత సారాన్నంతా చక్కగా చెప్పారు. మహానుభావులు మీకు మీరే సాటి. రోజు ఒక పూట వస్తుంటాను. ఓ రెండు ముక్కలు నా చెవిన వెయ్యండి!"
    "ఇదిగో పూజారి స్వామి! నీవు బస్సులు జూస్తున్నావా? అందుపై ఏం రాశారు , ఇది ప్రజల ఆస్తి, మీ సొంత ఆస్తిగా చూసుకోమన్లా!అందుకే కదా మనవాళ్ళు సొంత ఆస్తిగా చూసుకుంటున్నారు!"
    "ఆహా ఆణి ముత్యం లాంటి మాట చెప్పినారు."
    "ఊ ఇంతకూ ఎందుకొచ్చినట్టు!"
    నశ్యం ముక్కు నిండా పట్టించి "ఏం లేదు . దేవుడు సొమ్ము మనం తింటే తప్పు అవుతుందా అని భయపడినా. పెద్దలు తప్పులేదన్నారు. అంతే చాలు!" అన్నాడు మెల్లిగా.
    "ఎందయ్యోయ్ ! కరణం వాడిని నన్నే ముగ్గులో దించుతున్నట్టున్నావ్! ఏం సంగతి!"
    "నే దించాలనుకున్నా మీరు దిగుతారా!"
    శేషయ్య సమాధానం యివ్వలేదు.
    "ఓ మంచి కబురు చెప్పమంటారా?"
    గంభీరంగా వూగింది కరణంగారి తల. దాంతో బాటే ఆలోచనలూ! అనుమానంగా చూశాడు స్వామి వైపు.
    "మన వేణుగోపాలస్వామిని చూశారా మీరు?"
    "బాగుందయ్యా! మీ నాయన్ని చూశావా అనడగలేదు నన్ను. ఆ రుక్మిణమ్మ తల్లీ. ఆ వేణుగోపాలస్వామీ దయ చూడబట్టే గదా నేనిలా వుండేది. - రోజూ వచ్చి అమ్మణ్ణి దర్శనం చేసుకుందామనే వుంటుంది. కానీ ఎక్కడ తీరుతుంది నాకు. లెక్కలతోనే అయిపోతుంది రోజంతా. అయినా అమ్మణ్ణంటే డబ్బే కదా! నా తల్లి లక్ష్మిదేవి రోజూ న యింటికి నడిచే వస్తోంది. చెక్కుల రూపంలో, మని ఆర్డరు గ డ్రాప్ట్ లుగా వచ్చేరోజు ఎప్పుడో."
    "మామా!"
    "ఊ!"
    ఉలికిపడ్డాడు శేషయ్య. "ఒరే స్వామి! ఎంత మాటన్నావురా! ఇలా పైసలు , రూపయలు ఎన్ని జమ చేస్తే ఒక తులం అవుతుంది. నా తల్లి దయతలచి బంగారు రూపంలో వస్తేనా, అమ్మణ్ణి బంగారు ప్రతిమ చేయించి బీరువాలో వుంచి భద్రంగా పూజిస్తాను."
    "నేనా మాట చెప్పాలనే వచ్చాను."
    "ఇంకా ఆలశ్యం ఎందుకురా! చెప్పేయ్! చెప్పేయ్!"
    "మన గుళ్ళో బంగారు జహ్వారీ మొత్తం యాభై తులాలదాకా వుంది. వెండి రెండు మణుగులు వుంటుంది."
    అతని మాటలు పూర్తీ కాక ముందే ఉలిక్కిపడ్డాడు శేషయ్య.
    "ఇక చెప్పకు నా కంతా అర్ధమయి పోయింది. అనకూడదు గానీ నువ్వు మేధావివి రా. నిజంగా నీలాటి మేధావులు నా దగ్గరికి రావటం నా అదృష్టం. ఈ విషయంలో నేనింతకంటే చెప్పలేను."
    సిగ్గు పడ్డాడు స్వామి. గుళ్ళో స్వామి అదిరిపడి వుంటాడు.
    "ఇంకేవుంది మామా! గోల్డు నగలు అలంకరించడం ఒక్కొక్కటి నీ ఇంటికి చేర్చడం నువ్వు చేయి విదిలిస్తే చాలు నాకు."
    "ఇదిగో! ఇది మూడో మనిషికి తెలియకూడదు."
    "అలాగే మామా! కానీ సర్పంచి, ధర్మకర్త మునసబు వీళ్ళకన్నా తెలియద్దూ?"
    "వాళ్ళకి చెప్పకుంటే ఎలా? మేమంతా ఒక్కటే పరాయి వాళ్ళకు తెలియకూడదన్నాను అంతే. మరి యిందులో నీ వాటాగా తీసేసుకో నువ్వే! అంతా తూకం వేయిద్దాం ఖర్చు మాత్రం నీదే."
    "ఏ ఖర్చు?" గాబరాగా అడిగాడు స్వామి.
    "గిల్టు నగలు తేవటం, వీటిని కరిగించడం లేదా అలాగే వుంచేసుకుందాం.
    "సరే!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS