ఇద్దరి మధ్య ఏదో అడ్డు తెర.
అప్పుడప్పుడూ వారుణికి సారధిపై చెప్పలేని కోపం వస్తోంది. ఇదా ప్రేమ? ఇంత త్వరగా కరిగిపోతుందా యీ ప్రేమ? ఎన్నెన్ని కబుర్లు? ఎన్నెన్ని ఊహలు? ఎన్ని ఆశలు! అన్నీ ఆశించినన్ని రోజులు నిలవలేదే! ఇలా అవుతుందని అనుకుందా తను_అని చింతిస్తుంది.
ఉత్తరం యిచ్చేశాడు సారధి.
ఓ రెండు దశాబ్దాలపాటు కాపురం చేసి, కన్నపిల్లలు ఎదిగివచ్చి జీవితం నిత్యసంగ్రామ రంగంగా తయారై, బ్రతుకు పోరాటమే జీవిత లక్ష్యమైపోయిన దంపతుల్లా వున్నారిద్దరూ.
"రధీ_" వారుణి మనస్సులో ఎన్నో ఆలోచనలు. "ఊ మగవాళ్ళింతేనేమో! ప్రతి దాన్లోనూ పట్టుదల! మొండితనం! మగతమ ఋజువుచేసుకోటానికా అన్నట్టుగా మొరటుగా ప్రవర్తించటం, పురుషాధిక్యత ప్రదర్శించటం. ఈ మగబుద్ధి యింతేనేమో!" అనుకుంది. "సో! యిలా లాభంలేదు. యితన్నిలా వదిలేస్తే మరీ మొండికెత్తొచ్చు! తనేం ఆశించింది! అది సాధించుకోవాలి. అనుకూలుడైన భర్త! ఆదర్శ దాంపత్యం! హాయైన చీకూ చింతా లేని జీవితం! తమకి ఆర్ధిక చిక్కులు లేవు_రావు. ఇంకెందుకు తిని కూర్చోలేక పోట్లాడటం?" అని తీర్మానించుకుంది.
"ఊఁ"
"అలా కూర్చో!"
అతను ముభావంగానే కూర్చున్నాడు. ఆ రోజు తల్లి చెప్పిన మాటలు యింకా మనస్సులో నాటుకునే వున్నాయి. "సారధి_ నువ్వు పొరపాటు చేశావు. నాగరత్నం మామయ్య అడిగినంత కట్నం యిస్తానన్నాడు. వసంత కూడా బి.ఎస్సీ చదివింది. ప్రయివేటుగా ఎమ్మే చేయించి వుంటే సరిపోయేది. పైగా వసు ఒద్దికగల పిల్ల. అనకూడదు కానీ నీ భార్య గడుసుది. భయం భక్తీ లేదు. బెదురూ నదురూ లేదు. ఆ అమ్మాయిననకూడదు. ఆ తల్లిదండ్రులని అనాలి! ఊరికే అన్నారా! కులమూ గోత్రమూ సంప్రదాయమూ చూసి చేసుకోవాలని.
అయిందేదో అయిపోయింది. నువ్వు నీ భార్యకి లోకువ కావద్దు. ఈ రోజు మెత్తబడ్డావా! జీవితాంతం నెత్తినెక్కి కూర్చుంటుంది. అంతే! తర్వాత దిగమన్నా దిగదు. నువ్వు దించలేవు. నేను మొదటిరోజే అనుకున్నానురా అబ్బాయ్! ఇది నీతో కాపురం చెయ్యదని! అలాగే అయిపోతోంది. నువ్వేం చింతించక, మేమున్నాం! ముక్కుతాడు పట్టి లొంగదీస్తాం! అత్తా మామా అన్న భయంలేదు. పెద్దది తోడికోడలని గౌరవం లేదు. బావ అని భక్తి లేదు. భర్తని జంకు లేదు. అంతా తనిష్టమేనా? చూద్దాం! ఎలా దిగిరాదో! ఇదో_నువ్వు మాత్రం బెట్టుగా వుండు. జావకారిపోయావో_"
కూర్చో రధీ_" మళ్ళీ పిలిచింది. ఆ గొంతులో అభ్యర్ధన వుంది. లాలన వుంది. తన మగడిని తనవాడిగా చేసుకోవాలనే ఆరాటం వుంది.
తల్లి పంచతంత్రాన్ని మనసులోనే ఉంచుకొని ముభావంగా కూర్చున్నాడు సారధి.
అతనికి దగ్గరగా జరిగింది. అతని భుజంపై చేయి వేసింది. ఆమె స్పర్శ అతనికి వినూత్నంగా వుంది. ఉత్తేజకరంగా వుంది. ఈ పది రోజుల ఎడబాటు వియోగజ్వరం.. మారిపోయి రక్తాన్ని కుతకుత లాడించింది. రక్తం నరాల దారుల్లో ప్రవహిస్తూ చిన్నా చిన్నా అని కేకలు పెట్టింది. కానీ సారధి చాలా నిగ్రహం వహించాడు.
"రధీ_ నీ మనస్సు ఒట్టిపోయిందా?"
అతనేం అనలేదు.
"ఆ ప్రేమంతా ఏమయింది? మా నాన్నగారు అంగీకరిస్తే విరహిణి అనీ తిరస్కరిస్తే మేఘసందేశం అని టెలిగ్రాం యివ్వు అన్న నీ భావుకత ఏమయింది? చిన్నా! మా వాళ్ళు తిరస్కరించినా మీ వాళ్ళు అంగీకరించకపోయినా మన పెళ్ళి ఆగదు. మనం సివిల్ మేరేజ్ చేసుకుందాం. ఇద్దరం సంపాదిస్తున్నాం. మనకి ఒకరి జీతం ఎక్కీ తొక్కీ అవుతుంది. మనం నా జీతంతోటే లగ్జరీ లైఫ్ సాగించవచ్చు. నీ జీతం నీ పేర్నే వేసుకుందాం మన భవిష్యత్తు కోసం_ సంతానం కోసం_ మన జీవితాలని ప్రణాళికలాగా నిర్మించుకుందాం. మనం ఎవరికీ భయపడక్కర్లేదు చిన్నా! ప్రేమ అనేది చాలా బలమైన టానిక్. దానిలాగా ఆవేశం కల్పించే శక్తి మరి దేనికీ లేదు. ఇన్ని ఊహలు ఎక్కడికి పోయాయిప్పుడు?"
సారధి ఆమెవైపు చూశాడు.
