Previous Page Next Page 
జోగబాల పేజి 41


    "గోపాలకృష్ణా! విద్యావంతుడివి. కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం చేసుకుంటున్నావు. నువ్వు తీసుకుంటున్న ఈ చర్యవల్ల అనేక అనర్థాలు దాపురిస్తాయి. విపరీత పరిణామాలు సంభవిస్తాయి."


    గోపాలకృష్ణ చెక్కు చెదరలేదు. స్థిరంగా నిలబడ్డాడు.


    "గోపాలకృష్ణా! ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు పెద్ద రొంపిలో ఇరుక్కోబోతున్నావు."


    అతనేమీ జవాబు చెప్పలేదు. వాళ్ళిద్దరి పెళ్ళీ జరిగిపోయింది.


                                                                              11


    ఆ రాత్రి శ్రీహర్ష అలసిపోయిన శరీరంతో గదికి తిరిగి వచ్చాడు. గదిలో వజ్రం మంచంమీద కూచుని ఉంది. ఉలికిపడ్డాడు.


    "ఏమిటి మీరిలా...?"


    అతన్ని చూస్తుండగానే ఆమె కనులు విప్పారాయి. ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళూ చేయించటమేనా? మన పెళ్ళి గురించి ఆలోచించటమేమయినా ఉందా?"


    "మన పెళ్ళా?"


    "ఏమిటమ్మా అంత ఆశ్చర్యం?" అంటూ మంచం మీదినుంచి అతని దగ్గరకొచ్చి నిలబడింది.


    "ఆరాత్రి...ఇక్కడే...యెంత తియ్యని రాత్రి! మనం ఇద్దరం కలిసి ఇదయ్యాక...నిన్ను కలుసుకుందామని యెంతో ప్రయత్నించాను. ఉహూ, కుదరలేదు బైటకు రావడానికి వీలుపడలేదు. నువ్వేమో రావు."


    "మన మిద్దరం కలిసి ఇదయ్యామా? అంటే"


    "అంటే నీకు తెలీదా హర్షా. వలపులు కురిపించి అమర సుఖాలందించి, మత్తులో ముంచి, తేల్చి..."


    "వజ్రం! నువ్వేం మాట్లాడుతున్నావు?"


    "ఉన్న విషయమే మాట్లాడుతున్నాను హర్షా. ఆరాత్రి మనమిద్దరం ఇదయి నప్పట్నుంచే మెలకువగా ఉన్నా, పడుకున్నా కళ్ళలో యెప్పుడూ నువ్వే ... అహార్నిశలూ నిన్నే కలవరిస్తున్నాను హర్షా. హర్షా! హర్షా! మరేం నీకో విషయం చెప్పాలి. అబ్బ! సిగ్గేస్తోంది. అయినా నీకు గాక ఇంకెవరికి చెప్పను? అక్కడేం ... మరేం ... అక్కడ ... సామా... తెలిసిందిగా? ఏదో బాధ, మంట. నాకు భయమేస్తోంది హర్షా. లేడీ డాక్టర్ కి చూపించుకోవాలి. కాని ఎలా వెళ్ళను? మరేం అక్కడ..."


    అతను నిశ్చేష్టుడై నిలబడ్డాడు. అతని కళ్ళలో విలాస్ మెదులుతున్నాడు.


                                                        *    *    *    *


    గోపాలకృష్ణ, వాసంతిల కాపురం మొదలయింది. బలభద్రపురం ఊళ్ళోనే అంతకు ముందు ఉంటున్న గది ఖాళీ చేసి చిన్న యిల్లు అద్దెకు తీసుకున్నాడు. మొదటిరాత్రి, భార్య పోయి చాలారోజులు అయినందువల్లా, స్త్రీ సుఖం కోసం అలమటించి పోతున్నందువల్లా మధురంగానే గడిచింది. అంతకుముందే వాసంతి కమిటీలో వచ్చిన లేడీ డాక్టరు దగ్గర అన్ని పరీక్షలు చేయించుకుని, ట్రీట్ మెంట్ చేయించుకుని తన శరీరాన్ని ఆక్రమించి ఉన్న సుఖ వ్యాధులనుంచి విముక్తి పొందింది. గోపాలకృష్ణకు ఆమెవల్ల తన ఆరోగ్యం పాడవుతుందన్న భయంలేదు. అందుకే తృప్తిగా సుఖాలను జుర్రుకున్నాడు. ఆమె అంటే ప్రేమ కూడా కలిగింది. తన భార్యతో గడిపిన తొలిరోజుల్లోని అనుభూతుల్నే పొందాడు.


    మర్నాడు కాలేజీకి వెడితే అందరూ తన మొహంలోకి పట్టిపట్టి చూస్తున్నట్లనిపించింది. తన వెనకనుంచి నవ్వుకుంటున్నట్లనుమానం. పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించాడు.


    ఊళ్ళో ఒక సినిమాహాలు వుంది __ రెండు రోజులు పోయాక గోపాలకృష్ణ వాసంతిని సినిమాకు తీసుకెళ్ళాడు. ఆ ఊళ్ళో ఎప్పుడూ తెలుగు సినిమాలే వస్తాయి. వాసంతి జోగినిగా మారక ముందెప్పుడో సినిమా చూసింది. ఆమెకు భర్తతో కలిసి, అతనిప్రక్కన కూర్చుని సినిమా చూస్తోంటే చాలా గొప్పగా, థ్రిల్లింగ్ గా యెంతో సరదాగా ఉంది. ఈనాటికి తాను ఓ గృహిణి అయింది. అందరితో కలిసి ప్రపంచంలో కాలు పెట్టింది. మిగతా ఆడవారిలా ఒకే ఓకే పురుషునితో సంచరిస్తోంది. ఆమెకు చాలా గొప్పగా వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS