ఆ సినిమాకి కొంతమంది కాలేజీ విద్యార్థులు కూడా వచ్చారు. వాళ్ళనిచూసి గుసగుసలాడుకున్నారు. పైకి ఎగతాళిగా నవ్వారు. ఈలలు కూడా వేశారు. గోపాలకృష్ణకు ముళ్ళమీద కూచున్నట్లుగా ఉంది. అతనికి భార్యతో కలిసి సినిమాకు వచ్చినట్లుగా ఉంది. కొంతమంది స్త్రీలు యింట్లో అలరించటానికే పనికి వస్తారు. వెంటేసుకుని నలుగురి మధ్యా తిరగటానికి సరిపడరనుకున్నాడు. ఆ మాట కొస్తే కొంతమంది నిజమైన భార్యలు కూడా బయటేసుకుని తిరిగితే ఉంపుడుగత్తెలులా, పదిమందీ యెగతాళిగా చూసేలా కనిపిస్తారు.
వాసంతి మాత్రం యిదేమీ పట్టించుకోవటం లేదు. మధ్య మధ్య అతనితో కబుర్లు చెబుతూ, చెయ్యి పట్టుకుని లాగుతూ చాలా ఉత్సాహంగా వుంది. ఆ రాత్రి యింటికి వచ్చాక అతను మౌనంగా వుండి, పడుకునే ప్రయత్నం చెయ్యటం చూసి "అదేమిటి అప్పుడే పడుకుంటున్నారు. రండి యిద్దరం కలిసి భోంచేద్దాం" అంది.
"నా కాకలిగా లేదు. నువ్వు తిను."
"ఎందుకని ఆకలిగా లేదు?"
"నాకు తలనొప్పిగా ఉంది" అని మంచం మీదకు చేరి కళ్ళు మూసుకున్నాడు.
"అయ్యో! తలనొప్పిగా ఉందా? పాడు సినిమా వెళ్ళకపోయి ఉన్నా బాగుండేది. నొక్కుతాను ఉండండి అంటూ మంచంమీద అతని ప్రక్కన కూర్చుని తలమీద చెయ్యివేసి నొక్క సాగింది.
"ఒద్దు. నువ్వెళ్ళి అన్నం తిను."
"ఉహు. మీరు తినకుండా నాకు సహించదు."
అతనికి చిరాకు పుట్టింది. "నాకిలాంటివి నచ్చావు... పతివ్రతలా"
ఆమె నవనాడులూ క్రుంగిపోయినట్లయినాయి. అతని తలమీద కదిలే ఆమె చెయ్యి ఆగిపోయింది. "అదేమిటండీ అలా అంటారు. నేను పతివ్రతను కానని తెలుసు, కాని ప్రస్తుతం మీ భార్యనండీ"
"అయితే? యిలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు నాకు నచ్చవు"
ఆమె చాలా చిన్నబుచ్చుకుంది. "నచ్చకపోతే మిమ్మల్ని బాధపెట్టనులెండి" అంటూ లైటు ఆర్పేసివచ్చి అతని ప్రక్కన పడుకుంది. అతను కొంచెం దూరంగా జరిగాడు.
"ఏమండీ! నేనేమన్నా మీకు కష్టం కలిగించే పని చేశానా?"
"లేదులే. నాకు నిద్రవస్తోంది పడుకోనియ్."
ఆమె చాలాసేపు ఆలోచించింది. సినిమాకు వెళ్ళే వరకూ యెంతో ప్రేమగా వుండి యిప్పుడిలా యెందుకు ప్రవర్తిస్తున్నారు? ఎక్కడో హరిజనవాడలో ఒక హరిజన యువతిగా, జోగినిగా బతుకుతూన్న తనని సభ్యసమాజంలో పక్కనేసుకుని తిరుగుతూ ఉండటంవల్ల అతని పరపతి దెబ్బతిందేమో. ఒకవేళ అలా చెయ్యటం తప్పేమో.
"ఏమండీ" అని పిలిచింది.
అతను పలకలేదు. ఛాతీమీద చెయ్యివేసింది. ఆ చేతిని త్రోసేసి రెండోవైపుకు తిరిగి పడుకున్నాడు. తెల్లవారుజామునెప్పుడో అతనికి మెలకువ వచ్చింది. జరిగినదంతా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఆమె గత జీవితం తనకు తెలుసు. తెలిసే సంస్కరణాభిలాషతో ప్రేరేపితుడై ముందుకువచ్చి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. నిజంగా తనంటే ఆమె ఎంతో ప్రేమ కురిపిస్తోంది. అమృతాన్ని పంచి పెడుతోంది. తనకు రవ్వంత తలనొప్పి వస్తే విలవిల్లాడిపోతోంది. ఆమె యేమి నేరం చేసిందని తాను హింస పెడుతున్నాడు? సమాజం క్రూరమైనదనీ, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు యెగతాళి చేస్తుందని తెలీనంతటి అమాయకుడా? తనని నమ్ముకొని యెన్నో ఆశలు నిర్మించుకుని తన దగ్గరకు వచ్చింది. ఆ ఆశలన్నీ వమ్ము చేస్తున్నాడా?
ఆమెమీద జాలివేసింది. గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. ఆమెకేసి తిరిగి ముఖంలోకి చూశాడు. చెంపలమీద కన్నీటి చారలు. గుండె కరిగినట్లయింది. దగ్గరకు జరిగి పెదాలు ఆమె బుగ్గమీద ఆన్చి ముద్దు పెట్టుకున్నాడు. వాసంతి కళ్ళు తెరచి చూసింది. దుఃఖంలో ఉప్పొంగిన ఆనందరేఖ.
"మీకు...మీకు కోపం పోయిందా?" అతనిచుట్టూ చేతులువేసి దగ్గరకు లాక్కుంది. అతడామెను తన బిగి కౌగిలిలో బిగించాడు. కళ్ళనూ, చెంపల్నీ, పెదవుల్నీ ముద్దులు పెట్టుకున్నాడు. ఆమె కళ్ళలో మళ్ళీ తడి, దుఃఖం సుఖంలో కరిగి కలిసిపోతున్నట్లు.
"దయవుంచి మీరు నన్ను బాధపెట్టకండి. దూరంగా జరక్కండి. మీకే విషయంలోను కష్టం కలిగించను. ఈ భార్య స్థానాన్ని యెప్పుడూ చెరిగిపోనివ్వకండి." ఆమె కళ్ళ నుంచి జలజలమని నీళ్ళు కారుతున్నాయి.


