"అలా అని కాదు. బాగా చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు... టైపిస్ట్ లు, క్లర్క్ లు, ఆఫీసర్లూ కూడా కావచ్చు."
"అబ్బో! పెద్ద పెద్ద పేర్లే."
"ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుని, చక్కగా సంసారాలు చేసుకుంటూ, పిల్లల్ని కని... ఆ పిల్లల్ని చక్కదిద్దుకుంటూ..."
"అమ్మో పెళ్ళే! గ్రామదేవతకు కోపం రాదూ?"
"ఒక మంచి పనిచేస్తే దేవతకు కోపమెందుకు వస్తుంది? అభినందిస్తుంది."
"మా ఎల్లమ్మ దేవత గురించి మీకు తెలీదులెండి. జోగి చెయ్యబడ్డాక, బాట తప్పితే మా దేవత నిప్పులు కక్కుతుంది. ఆ సెగలకు నాశనమైపోతాయి."
"అదంతా మీ అపోహ. మీ ముందు ఓ అందమైన జీవితం నిలబడుతుంది."
అందమైన జీవితం! ... వారందరిలో నిలబడ్డ వాసంతి ఊహల్లో తేలిపోతోంది. శరీరం పులకరిస్తోంది.
"ఏమిటి? మీలో కొందరైనా పెళ్లి చేసుకొనేందుకు ముందుకు వస్తారా? రారా?"
"మేము రాము. మేము చేసుకోము. మాకు భయం. మేము నశించిపోతాము. ఈ ప్రపంచం నశించిపోతుంది."
"కనీసం...ఒక్కరు...మీ అందరిలో అందమైన జీవితాన్ని ఆశించే వనిత ఒక్కరూలేరా?... ఒక్కరైనా...?"
వాసంతి మంత్రముగ్ధలా, ఏ శక్తి కోవశురాలైనట్లు ముందుకు నడిచింది. "నేనున్నాను. నాకు పెళ్ళి చెయ్యండి"
అందరూ ఆశ్చర్యంగా ఆమెవంక చూస్తున్నారు.
"మీరు చదువుకున్నవారు, ఉన్నతమైన భావాలు కలవారు. ఏదో చేద్దామన్న ఉత్సాహమున్నవారు. నాకు మీరు చెప్పిన అందమైన, దివ్యమైన జీవితాన్ని అనుగ్రహించండి."
"వాసంతీ! నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటి నువ్వు చేస్తోన్న పని? రా! వెనక్కి వచ్చెయి" మిగతా జోగినులు ఆందోళనతో అరిచారు.
"ఊహు. నేను రాను. వాళ్ళందరూ చెప్పిన, నేను యెదురు చూసిచూసి అలసిపోయి అందమైన జీవితం నాకు కావాలి."
"వాసంతీ! నువ్వు చేస్తోన్నది జోగిని ఆచారానికే కళంకం. ఈ లోకం నాశనమై పోతుంది. ఎల్లమ్మదేవత నిప్పులు చెరుగుతూ శపిస్తుంది. వచ్చెయ్, వచ్చెయ్."
వాసంతి మౌనంగా నిలబడింది. ఆమె ముఖం కొత్త ఆశతో. పొంగులువారే మగతతో వెలిగిపోతోంది. కమిటీతో వచ్చిన వారుకూడా ఇంత హఠాత్తుగా ఈ సంఘటన విరుచుకు పడుతుందనుకోలేదు.
ఈమెను ఎవరికిచ్చి పెళ్ళి చెయ్యాలి?
"నేను చేసుకుంటాను" ఓ ప్రక్క నుంచి గొంతు వినిపించింది.
శ్రీహర్ష ఉలికిపడి అటువైపు చూశాడు. గోపాలకృష్ణ. ఆ రోజు కాలేజీలో తనకు దెబ్బలు తగిలినప్పుడు బలభద్రపురం నుంచి తోడుగా వచ్చిన కాలేజీ లెక్చరర్.
ఊళ్ళో చిన్నవేదిక నిర్మించి, దానిమీద గోపాలకృష్ణ వాసంతుల పెళ్ళి జరపటానికి యేర్పాటు చెయ్యబడింది. కమిటీలో వచ్చిన సభ్యులంతా ఉన్నారు. ఊళ్ళోని పెద్దలందరికీ ఆహ్వానాలు పంపబడ్డాయి. పెళ్ళికి ఒక్కరు కూడా తరలి రాలేదు సరికదా పెద్దలందరూ కలసి కమిటీ సభ్యులమీదికి దండయాత్రకొచ్చారు. అందులో పరంజ్యోతి, మాధవప్రసాద్, ఇంకా ఇతరులు కూడా ఉన్నారు.
"కొన్ని వందల సంవత్సరాలుగా ఎప్పుడూ లేదు. ఈ రోజు మీరొచ్చి సంఘ నిర్ణయానికి విఘాతం కలిగిస్తున్నారు. ఇది మీకు తగనిపని" అన్నారు వారిలో ఒకడు.
"మేమేమీ చెడ్డపని చెయ్యడంలేదు. ఒక దురాచారాన్ని నిర్మూలించడం కోసమొచ్చాం. దానికిది ప్రథమ సోపానం."
"మీ దృష్టిలో దురాచారమైనంత మాత్రాన అవి అయిపోదు. మీరు చేస్తున్న పనివల్ల దేశానికి అరిష్టమొస్తుంది. అరాచకం సంభవిస్తుంది."
"అది కేవలం మీ భ్రాంతి_ఒకరి జీవితం బాగుపడటం చూసినప్పుడు మిగతా జోగినులు కూడా ముందు కొస్తారు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లా పాపల్ని చూసుకుంటూ ఇష్టమున్నవారు ఉద్యోగినులుగా మారినప్పుడు ప్రజలందరూ చైతన్యవంతులవుతారు. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది."
"ఆరోగ్యం మాట తర్వాత. దేశం నాశనమౌతుంది."
"ఇలా ఆలోచించటం మీలోని అజ్ఞానం"
