Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 40

    గడియారం ఏడుగంటలు కొట్టింది.

    "పార్వతీ వాళ్ళని కేకెయ్!"

    పార్వతి పిలిచిన పిలుపుకి శ్రీవిద్య మంచం దిగి వచ్చింది.

    "స్వాతీ నిద్దర్లేచిందా? ఏదీ ఎక్కడా కనిపించదేం?"

    "పూజా గృహంలో వుందేమో?"

    "ఏమో!" అని వెళ్ళింది పార్వతి. ఒక్కనిముషం తరువాత "లేదండీ!" అని వచ్చింది.

    "ఎక్కడికి వెళుతుంది పెరట్లో వుందేమో చూడు" అప్పటికే ఆయన మనసులో సందేహం తలెత్తసాగింది. ముఖం కళావిహీనమైపోయింది.

    "చూశానింతకుముందే నేను."

    ఒక్కక్షణం అయోమంగా చూశారు శాస్త్రిగారు.

    శ్రీవిద్య పెరట్లోకి వెళ్ళింది.

    "ఎక్కడికెళ్ళిందబ్బా? ఈ ఇంటికేదో శని పట్టుకుంది. అందరికీ జోస్యం చెపుతారు, శాంతులు చెపుతారు_ మీ స్వంతానికేమీ చేయరు. చెప్పరు_చూడండేదయినా శాంతో, జపమో చేద్దాం!"

    అంతలో పెరట్లో వున్న శ్రీవిద్య కెవ్వునకేక వేసింది. "అమ్మా, నాన్నా!" అంటూ.

    పార్వతి ఒక్క ఉదుటున పెరట్లోకి వెళ్ళింది.

    శాస్త్రిగారు గాబరాతో అనుసరించారు.

    "అమ్మా! అటు చూడు...వదిన పైటలాగా ఉంది."

    శాస్త్రిగారూ అయ్యో! భగవంతుడా! అని అరిచి కూలబడిపోయారు. పార్వతి బావిదగ్గరకి వెళ్ళి తొంగిచూసి, "ఏమండీ అది స్వాతి పైట చెంగే. కొంపముంచిందండీ! బావిలోకి దూకేసింది" అంది ఏడుస్తూ...

    శాస్త్రిగారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆయన నోటంట మాట రాలేదు.

    "ఎప్పుడు దూకిందో ఏమో? బండ నిద్రపోయాం. రాత్రంతా సరిగా నిద్రలేదు .ఎవరినయినా పిలవండి ప్రాణాలతో వుందో పోయిందో" అరుస్తుంది పార్వతి.

    ఆమె అరుపులకి ఇరుగుపొరుగు చేరారు.

    ఈతొచ్చిన ఓ వ్యక్తి లోపలికి దిగాడు. అతడు బావిలో వుంది స్వాతేనని ఖాయం చేశాడు. మరో వ్యక్తి దిగాడు. ఇద్దరూ కలసి తాడుకు కడితే స్వాతి బయట పడింది.

    కోడల్ని చూడగానే స్వాతీ అని గొల్లుమంటూ ఆమెపై పడింది పార్వతి. "వదినా వదినా" అంటూ శ్రీవిద్య గుండె పగిలేలా ఏడవసాగింది.

    అంతలో బయటికి వెళ్ళిన పట్టాభి తిరిగి వచ్చాడు.

    స్వాతి శవాన్ని చూడగానే అతడు స్థాణువై పోయాడు. "ఏవిటలా జరిగింది? తనెన్ని కలలుకన్నాడు? ఆమె జీవితాన్ని నందనవనం చేయాలని, పూల ఉయ్యాలలో వూపాలని, ఆమెను ఓ మనిషిగా మనసున్న మంచిమనిషిగా బ్రతికేలా చేయాలని ఎన్ని వూహలల్లుకున్నాడు?

    అంతా గుమిగూడ సాగారు.

    అందరి మధ్యా నిర్జీవంగా స్వాతి, దోషుల్లాగా పార్వతి, శాస్త్రిగారు, శ్రీవిద్య.

    "నాన్నా!" పట్టాభి వెర్రిగా కేకపెట్టాడు.

    శాస్త్రిగారు తలెత్తి చూడలేక పోయారు.

    "నాన్నా! స్వాతిని నువ్వే చంపావు. ఆమెని నేను పెళ్ళి చేసుకుంటానంటే కాదని ఆమెని నువ్వే చంపావు..."

    ఆయన నోరెత్తలేదు.

    "నీవు, నీ మతమూ, నీ సంప్రదాయము ఏమయ్యాయిప్పుడు? అవి ఆమె ప్రాణాన్ని బలిగొన్నాయే? ఇప్పుడవన్నీ తిరిగి ఆమెకి ప్రాణం పోస్తాయా? నువ్వు నీ మత మౌఢ్యమూ హత్య చేశారు. మీరు దోషులు..."

    ఆయన సమాధానం చెప్పలేదు.

    "ఏం ఆమె పెళ్ళి చేసికొనివుంటే తప్పయ్యేదా! దేశం మారింది. పద్ధతులు మారాయి. సిద్దాంతాలు అనుక్షణం మారుతున్నాయి. ఆచారాలు ఏనాడో బూజుపట్టాయి. చచ్చిపోయిన ఆచారాలన్నీ పట్టుకుని ఆమె ప్రాణాలు తీశారు మీరు. మీరు... మీరు హంతకులు..."

    వెర్రిగా అరుస్తున్నాడు పట్టాభి.

    "ఇంకేం నీ మూర్ఖపు పట్టుదలతో కొడుకుల్ని దూరం చేసుకున్నావ్? కోడళ్ళని దూరం చేసుకున్నావ్? ఇప్పుడు ఈమె ప్రాణం తీశావ్. హాయిగా అమ్మా నువ్వూ ఉండండి ఈ ఇంట్లో. నేనూ వెళ్ళిపోతున్నాను. నీవూ, నీ దేవతార్చనా, నీ విగ్రహాలు పూజలూ నిష్టగా చేసుకుంటూ వుండు!"

    "పట్టాభి!"

    శాస్త్రిగారు కంఠం మెల్లగా ధ్వనించింది.

    వెళ్ళబోయిన పట్టాభి ఆగాడు.

    "ఎన్ని మాటలన్నావురా నన్ను? నేను చంపేశానా? నా బిడ్డకన్నా మిన్నగా చూసుకున్నానామెని. ఏం లోటు చేశాను?"

    "హుఁ ఆ లోటు చెపితే తెలిసేది కాదు నాన్నా. మనసుకి తెలియాలి."

    "ముందు నేనడిగినదానికి సమాధానం చెప్పు. సుఖంగా శాంతిగా ప్రశాంతిగా బ్రతికే ఆమెని చంపింది నువ్వు!" అన్నాడు.

    ఉలిక్కిపడ్డాడు పట్టాభి. "నేనా?"

    "అవును నువ్వే! నిన్న ఏమన్నావ్? ఆమెని పెళ్ళి చేసుకుంటానన్నావ్? నువ్వు తప్పుచేస్తే కాపాడేందుకు సాయంచేస్తే ఆ సహాయానికి విపరీతార్ధం తీశావు. నీపై ప్రేమ అన్నావు. ఏమేమో కూశావు, అవన్నీ ఆమె విందో ఏమో? అభిమానవతి గాబట్టి గుట్టుగా సాగే సంసారాన్ని బయట పడెయ్యలేక బావిలో దూకి చనిపోయింది. అయ్యో బంగారంలాంటి కోడలు చనిపోయిందే అని మేము ఏడుస్తుంటే నువ్వు వచ్చి మమ్మల్ని దోషుల్ని చేస్తావా?

    "నీవు విశృంఖలంగా తిరగాలని మతాన్ని ఆచారాన్ని సంప్రదాయాన్ని తిడితే అవి తప్పవుతాయా? వాటిలో లేదురా దోషం! మీలో వుంది. మీలాంటి దుష్టుల్లో వుంది.

    పట్టాభి ఏదో అనబోయేంతలో శ్రీవిద్య పరుగు పరుగున వచ్చింది... "నాన్నా ఇదో వదిన చేతిలో జాబు" అంటూ ఇచ్చింది.

    ప్లాస్టిక్ కవరులో నానకుండా ఉన్న కాగితంతీసి చదవసాగాడు.

    పూజ్యులైన మామగారి పాదపద్మములకు.

    స్వాతి నమస్కారములు.

    మామగారూ! ముందుగా నన్ను మన్నించమని కోరుతున్నాను. ఆత్మహత్య మహాపాపం! ఆత్మహత్య చేసుకునే హక్కు మనకిలేదు. ఆ విషయం నాకు తెలుసు. అయినా గత్యంతరంలేక బాగా ఆలోచించే బావిలో దూకుతున్నాను.

    మీరు రామాయణం రాస్తున్నారు. నాతో వ్రాయిస్తున్నారు. ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. ఐనా పిరికిదయిన నా మనసు ఆత్మహత్యకే మొగ్గింది.

    అయినా నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలో మీకు చెప్పాలి కదా!

    నిన్న రాత్రి మీకూ పట్టాభిరాంకు మధ్య జరిగిన సంభాషణ నేను అప్రయత్నంగా విన్నాను. అతడు నన్ను పెళ్ళి చేసుకోవాలని కోరటం విన్నాను. ఈ నవనాగరిక ప్రపంచంలో అది తప్పు కాదు. ఎందరో భర్త పోయాక మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారు. మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. భర్త వుండగానే వదిలేసి మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారు. అదంతా ఇప్పుడు నాగరికత కింద చెల్లుబాటవుతోంది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS