Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 39


    వచ్చిన మనుషులంతా ముక్కులమీద వేళ్ళేసుకున్నారు. రామదాసుగారేనా యిలా మాట్లాడేదని వాళ్లు ఆశ్చర్యపోయారు. వారిలో ఇంత మార్పెందుకు వచ్చిందో అర్థంగాక ఆశ్చర్యపడటం మాని ఆలోచనలో పడ్డాడు లోకనాథం.
    నరసయ్యకి మాత్రం చెడ్డ భయంగా వుంది.
    (ఈ స్వాముల ప్రసక్తి కేవలం పాత్రల మధ్య వచ్చిందేగాని, దీనికి రచయిత ఏ మాత్రమూ బాధ్యుడు కాడు. మనిషిని దోచేది స్వామి ఒక్కడేనని రచయిత అభిప్రాయం కానేకాదు. పోగా_ ఈ చర్చలో ప్రత్యేకించి రచయిత ఉద్దేశం యిక్కడ రాయడంగానీ_ ఎక్కడ ఎవరితోనైనా చెప్పడంగానీ జరగనిపని యింక చదవండి. ___రచయిత)
    నవ్వుని ఒకచోట ఆపి, గుండె పట్టుకుని ఆయాసపడుతూ అన్నాడు రామదాసు___
    "నీ విషయాల్లో నా జోక్యమెందుగ్గాని లోకం! కుర్రస్వామిని నీ ఇష్టానుసారమే పిలిపించు. ఉపదేశం పొందు_ నన్ను మాత్రం ఆ ఛాయలకు పిలవకు వెళ్లు."
    లోకనాథం లేచాడు కనకంతోపాటు ఇద్దరు పెద్దలు లేచారు. నరసయ్య మాత్రం లేవలేదు.
    వాళ్లు నలుగురూ గది గుమ్మం దాటబోతుండగా రామదాసు జనాంతికంగా ఒక ప్రకటన చేశారు.
    "లోకం బావా! నేను నా పదవికి రాజీనామా ఇద్దామనుకుంటున్నాను. నీకు సంతోషమేనా?"
    "బాబూ!" అన్నాడు నరసయ్య.
    లోకనాథంతోపాటు మిగతా ముగ్గురూ ఆ ప్రకటన విని చకితులయ్యేరు. వెంటనే ఆ గది విడిచి పోవాలని వాళ్ళకనిపించలేదు. అందుచేత వాళ్లు గుమ్మం దగ్గిరే నిలబడిపోయారు.
    "నిజమోయ్ బావా! ఆశ్చర్యపోమాకు_ వెధవది_నీ మొహంలో అది ఆనందమో ఆశ్చర్యమో తెలీడం లేదుగాని_ ఏర్పాట్లు మాత్రం చేయించు. నాకీ పదవి తగదు. నేను చక్కబెట్టుకోవలసిన స్వవిషయాలు చాలా వున్నాయి.... చాలా ఏళ్లు మత్తులో వున్నానుగదా!.... ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే ఎలా చెప్పూ?....ఈ పదవికీ, నా సమస్యలకీ బొత్తిగా పడదు....అందుచేత పదవి వదులుకుంటున్నాను.... ఇంక వెళ్ళండి....నమస్కారం."
    వాళ్లు వెళ్ళిపోయారు. గదిలో మిగిలివున్న నరసయ్య కదల్లేని స్థితిలో వున్నాడు. అతన్ని చూస్తూ అన్నారు రామదాసు.
    "నరసయ్యా. గుండెపోటు ఎక్కువవుతూంది. చావనుగాని భయంగా వుంది. ఆమాటకొస్తే నేను త్వరగా చావకూడదు. కొన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాను. వెళ్ళి డాక్టర్ని తీసుకురా- ఇంక ఓర్చుకునే శక్తి నాకు లేదు. దొంగ డాక్టరు దగ్గిరకెళ్ళకు_ దొంగ డాక్టరొస్తే నాది దొంగ జబ్బనుకుంటాడు. మంచి డాక్టర్నే పిలు వెళ్ళు."
    నరసయ్య విసిరిన బాణంలా ఆ గది నుంచి బయటకు పరుగెత్తాడు.

                                            13

    తిమ్మాపురం యావత్తూ అలజడిగా వుంది.
    పెద్ద వర్గాల్లోనూ, చిన్న నాయకుల్లోనూ, కాబోయే రాజకీయ వస్తాదుల్లోనూ; కాంట్రాక్టర్లలోనూ ఈ వార్త విడ్డూరంగా గొప్ప షాక్ గా, నమ్మలేని నిజంగా పని చేస్తోంది.
    పురప్రభువు పదవికి రామదాసుగారెందుకు రాజీనామా ఇచ్చారో ఎవ్వరికీ సరైన కారణం తెలీడం లేదు.
    రామదాసుగార్ని పరామర్శించడానికి వెళ్ళిన పెద్దలు తెల్లమొహాల్తో తిరిగి వస్తున్నారేగాని, 'రాజకీయ రహస్యాల్ని, తెలుసుకోలేకపోతున్నారు.
    వారు రాజకీయ జీవితంతో విసిగిపోయారా? వత్తిడేవైనా పరోక్షంగా వచ్చిందా? కొంపమీదికొచ్చే సమయాన్ని కనిపెట్టి నిష్క్రమించేరా? లేక వైరాగ్యమా?___ఏదీ తేల్చి చెప్పలేని పరిస్థితిలో ప్రజలు రకరకాలుగా వూహించి, రకరకాల కట్టు కథల్ని ప్రచారంలో వుంచేస్తున్నారు.
    ___రైల్లోనే తండ్రి రాజీనామా వార్తని తెలుసుకుని చిరంజీవి నివ్వెరపోయాడు.
    మహాసభలో తనకి పరిచయమైన కుర్రనాయకులు 'కారణాన్ని' అడిగారు. తెలీదంటూ పెదవి విరిచాడు చిరంజీవి. కానీ, తన 'పాడు కథ' కారణమై వుంటుందేమోనన్న బెంగ మాత్రం అతన్ని వదల్లేదు. ఆ ప్రక్కనే_తండ్రి ఈ జన్మకి మంచి సన్నాసి కాలేదనే చిన్న ఆశ ఆ బెంగని కొట్టిపారేస్తోంది.     
    ఎవరో సుమతి అనే ఆడపిల్లతో అక్రమ సంబంధం పెంచుకుని ఆ పిల్లని అన్యాయం చేశాడనే ప్రచారం (బహుశా ఆ స్థితికి ఎదిగుండదు కథ) వల్ల తండ్రి రాజీనామా చేసేయగలడా?
    చిరంజీవి రైలు దిగి వేగంగా యింటికి వెళ్ళాడు. గుమ్మంలోనే ఎదురయ్యాడు తండ్రి. ఆయన్ని చూసి అక్కడే ఆగిపోయాడు కొడుకు. చేతిలోని సూటుకేసు కింద పెట్టి అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS