Previous Page Next Page 
వారుణి పేజి 39


    ఆ రోజు మళ్ళీ శిరీష జాబు రాసింది.
    "వారుణీ !"
    ఇక్కడ ఎంత బావుందే! మామయ్య యీ మధ్య ఎకౌంటింగ్ బాధ్యత అంతా నాకే అప్పగించారు. బీరువా తాళాలు ఆయనకిచ్చారు. ప్రతి పైసాకి నేను ఖర్చు రాయాలి. ఉదయం గతరోజు జరిగిన ఖర్చుకి వివరాలు చెప్పాలి మామగారికి. అంతా డైనింగ్ టేబిల్ ముందు బ్రేక్ ఫాస్టుకి కూర్చుంటాం అప్పుడు వివరిస్తాను.
    అన్నట్టుగా ఆయనకి నిన్న పోస్టింగ్స్ వచ్చాయి. ఎప్పుడో గ్రూప్ ఫోర్ సర్వీసుకి రాశాడట. సెలక్షన్ వస్తుందని అనుకోలేదు. ఉద్యోగం చెయ్యాలనీలేదు. నీకు తెలుసుగా! పెద్ద కొడుకుగా ఏనాటికయినా ఆ యింటి బాధ్యత అంతా ఆయనదే! పొలాలు, తోటలు అన్నీ అజమాయిషీ చేసుకోవాలి. మామయ్య తన బాధ్యత తీరిపోయినట్టుగ అనుకుంటున్నారప్పుడే.
    రవి ఇంజనీరింగ్ లో చేరాడు. కాబట్టి అతను తిరిగి యీ వూరికి వచ్చేది అబద్ధం. మా కాపురమే శాశ్వతం. కానీ ఆయన డ్యూటీలో చేరాలనుకుంటున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో గుమాస్తాగా వేశారు. ఇంకా జాయినింగ్ టైం వుంది. ఆలోచించుకో అన్నారు మామగారు. "ఏనాడూ నా మాట విని ఉద్యోగం మానేశాననే బాధ నీలో కన్పించకూడదు. నీ నిర్ణయం నువ్వే తీసుకో" అన్నారు. దాంతో ఆయన వెనకా ముందూ ఊగిస లాడుతున్నారు.
    నన్నడిగారు. నేను వెళ్ళొదన్నాను. ఆరువందల జీతంతో యీ ఖరీదైన రోజుల్లో అంతదూరం వెళ్ళి ఏం సుఖపడతామన్నాను. అత్తయ్యా అదేమాట అంది. వారుణీ! అత్తయ్య నేనంటే ప్రాణం పెడుతుంది. అమ్మని మరిపిస్తోంది.
    విజయకి సంబంధాలు చూస్తున్నారు. గుంటూర్లో ఎవరో వున్నారట. ఎం.డి. చదివి ప్రాక్టీసు పెట్టుకున్నాడట. ఫియట్ కారు కొనిస్తే చేసుకుంటానన్నాడట. మామగారు నన్ను అడిగారు ఉద్దేశ్యమేమని. అన్ని విధాలా నచ్చితే_ విజయకీ యిష్టమైతే కారు తీసివ్వటానికి సిద్ధమే అని రాయండి అన్నాను.
    ఇదిలా వుండగా మన తోటని ఆనుకుని వున్న తోటవాళ్ళు మద్రాసులో వున్నారు. ఫిల్మిండస్ట్రీలో ఏదో ప్రొడక్షన్ మేనేజరట. అతను ఏదో బడ్జెట్ పిక్చర్ తీసెయ్యాలని యీ తోటని లక్ష రూపాయలకి అమ్మెయ్యాలన్నట్టుగా కబురొచ్చింది. ఇల్లు పక్కయిల్లు చేనిపక్క చేను తోటపక్కతోట కొనాలని అంతా ఆశపడతారట. అటు కరణంగారికీ ఆశ వుంది. మనకైతే ఆ ధర. ఆయన కయితే యింకో పాతికవేలట. ఇన్నేళ్ళు మామగారి అజమాయిషీలో వుంది. ఇప్పుడు చేజార నివ్వకూడదని పాలేర్లు పట్టుబడుతున్నారు. అవసరమయితే బంగారం అమ్మో, బ్యాంక్ లో లోన్ తీసో ఆ పొలం కొనెయ్యాలని అంటున్నారు. మామయ్య యీ నిర్ణయమూ నాకే వదిలేశారు. ఆయన్నడిగితే ఫలితం వుండదన్నారు.
    ఏమో వారుణీ! ఉదయం నుంచీ రాత్రి దాకా ఊపిరి సలపని పనిలాగా వుంటుంది. అయినా విసుగనిపించదు. విశ్రాంతి కావాలనిపించదు. రాత్రయితే మేడపై ఆరుబయట ఆయనతో అదోలోకం. దాన్ని గురించి నీకు వివరించాలా. తొలి ప్రొద్దులోని సుఖాలు, రాత్రులంతా అమృతమే కురుస్తున్నాయోయ్ అంటారాయన. అదిగో మీ మరిదిగారొస్తున్నారు. కట్టిపెడుతున్నాను. అన్నట్టు జవాబు క్లుప్తంగా రాయొద్దు. నీ ప్రేమ వివాహంలో రంజు ఎలా వుంది!
                                                                      నీ చెల్లాయి    
                                                                         శిరీష
    ఉత్తరం పూర్తిచేసింది వారుణి.
    మళ్ళీ ఓసారి చదవాలనిపించి మళ్ళీ చదివింది.
    "ఎంత హాయిగా వుంది తను!" అనుకుంది. "బాధ్యత, బరువు, పరువూ మర్యాద, అనుకూలుడైన భర్త_ అన్నిటికీ తనపై ఆధారపడే అత్తామామా_ ముఖ్యంగా అమ్మని మరిపిస్తోంది అన్నమాట ఎంత బావుంది."
    "చిన్నా!"
    సారధి రాగానే ఉత్తరం అందించింది వారుణి.
    ఈ వారం రోజులుగా యిద్దరి మధ్యా తలగడ వెలిసింది. మాటలు కూడా కొద్దిగా తగ్గిపోయాయి. సౌత్ ఇండియన్ టూర్ అన్నది ఒక ఊహగా మిగిలిపోయింది. సారధి ఆ ప్రసక్తి తేలేదు. వారుణికి అవమానకరంగా అనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS