పది నిమిషాల్లో దుప్పటి మార్చి పక్క సిద్ధం చేశాను. నేను నేల మీద చాప పరుచుకుని, దిండు వేసుకున్నాను. శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది. లైటు తీసేసి చాపమీద పడుకున్నాను. బెడ్ లైట్ మాత్రం వెలుగుతోంది.
నాకు శరత్ బాబు నవలలు గుర్తొస్తున్నాయి. ఆయన నవలల నిండా ఇలాంటి మధుర దృశ్యాలు గుప్పించి ఒదిలాడు. చరిత్రహీనులలో సతీష్, సావిత్రి, భారతిలో భారతితో, శేష ప్రశ్నలో కమలతో....
ఆ స్త్రీ పురుషుల మధ్య మనసుని ఉద్వేగంతో నింపే సంభాషణలు, గుండెల లోతుల్లోని విషాదం చిలికిస్తూ సన్నివేశాలు. అంతకన్నా ముందుకు పోరు. ముద్దులూ, కౌగిలింతలూ, కామోద్రేకాలూ ఎక్కడా చిత్రించడు. అయినా ఎక్కడా అసహజ మనిపించదు. ఆ సన్నివేశమలా నడిపిస్తేనే బావుంటుందనిపిస్తుంది. శరత్ బాబు ఈ కాలంలో పుట్టి ఉంటే ఇలా రాసి ఉండేవాడా?
సాహిత్యంలో గుభాళింపులు ఉండాలంటే వాస్తవికత భ్రమ కలిగిస్తూ, అక్కడక్కడా అందమైన అసహజత్వంతో అలంకరించాలి.
అసలామాట కొస్తే వాస్తవికతకు దగ్గరగా రాగలగటమే కాని పూర్తి వాస్తవికతను ఎవరూ చేరుకోలేదు. అదంతా దుర్బేధ్యం కాబట్టి.
అతనేదో మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు తెలీకుండానే ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను.
బహుశా తెల్లవారటానికి ఇంకా కొంత వ్యవధి ఉండి ఉంటుంది. చెంపమీద ఏదో మృదువుగా తగిల్తే మెలకువ వచ్చింది.
సుకుమార్ ప్రక్కమీదే పడుకుని ఉన్నాడు. నిద్దట్లో నాకు తెలీకుండా మంచానికి దగ్గరగా జరిగి ఉంటాను. అతని చెయ్యి నా చెంపల్ని మృదువుగా రాస్తోంది.
ఆ చెయ్యి పట్టుకుని చెంపకానించుకున్నాను.
"సతీ" అన్నాడు.
"ఊ"
"నీకు దూరంగా ఉండలేక పోతున్నాను"
"ఏం చెయ్యను?"
"దగ్గరగా వచ్చెయ్"
"దగ్గరగానే ఉన్నాను."
"చాలదు ఇంకా...." అంటూ అతని చేతిలో ఉన్న నా చేతిని పట్టుకుని తనవైపు లాగాడు. ఆ క్షణంలో అతన్ని కాదనే శక్తిలేదు. అతని చేయి ఏదో రహస్యాన్ని విప్పి చెబుతోంది. వెళితే ఏం జరుగుతుందో తెలుసు. అయినా ఏమీ వ్యతిరేకత చూపకుండా ఆ చేత్తోబాటు మంచం మీద కెళ్ళిపోయాను.
తర్వాతేం జరిగిందో చెప్పనక్కర్లేదు. నేనే దశలోనూ ప్రతిఘటించలేదు.
ఆ అనుభవంలో ఒకటి తెలుస్తోంది. ప్రేమతో ఆకర్షించబడి, ఆ ప్రేమలో ఓ భాగంగా ఇది ఇమిడిపోయినప్పుడు, కామం అని, సెక్స్ అనీ ఇంకేవేవో పేర్లతో పిలుస్తూంటారే.... అవి ఎంత సుందరమైనవో అర్థమయింది.
స్త్రీ ఎప్పుడూ కామం కోసం కామంగా అర్రులు చాచదు. అది ప్రేమలో అమాయకంగా అంతర్గతమై ఉంటుంది. ఇది అర్థం చేసుకోని మనుషులు ఇలాంటి సంఘటనకు గురయిన స్త్రీని రకరకాలుగా వ్యాఖ్యానిస్తుంటారు. చిత్రమేమిటంటే స్త్రీయే మరో స్త్రీని గురించి దూకుడుగా మాట్లాడుతుంది.
ఆ అనుభవం తాలూకు మృదు తరంగాలు మనసులో హాయిగా, విషాదంగా మెదుల్తూంటే కళ్లు మూసుకుపడుకున్నాను.
పెదిమిల మీద ముద్దు పెట్టుకుంటూ "ఇదేమిటి కన్నీరు? ఏడుస్తున్నావా?" అన్నాడు. అతని గొంతులో ఉలికిపాటు తెలుస్తోంది.
కనులు తెరిచి మెల్లగా నవ్వి మళ్లీ మూసుకున్నాను. వ్రేళ్లు కనురెప్పల ప్రక్క కదిలిస్తూ "మాట్లాడవేం?" అన్నాడు.
"లేదు"
"మరి ఈ తడి?"
"కొంచెం కన్నీళ్లు కారాయి. అది ఏడుపో కాదో తెలీదు!"
"నిన్ను బాధపెట్టానా?"
"బాధ అనుకుంటే నన్ను అర్పించుకునేదాన్ని కాదు సంతోషంతోనే. పూర్తి ఇష్టంతోనే అంగీకరించాను. కాని ఒక్కొక్క నిజం అనుభవంలోకి వస్తేనే గాని తెలీదు. ఇది చాలా సున్నితమైన సత్యం. ఈ అర్పణలో, పోనీ సుఖం అందామా.... ఇందులో అమాయకమైన దుఃఖం, విషాదం మిళితమై ఉంటాయి. దాచినా దాగని సత్యంలా కన్నీళ్ల రూపంలో అవి ప్రవహించి ఉంటాయి. ఈ కన్నీళ్లకు చాలా విలువుంది సుకుమార్."
నా ముఖం మీద ముఖం ఆనించి స్తబ్ధుగా ఉండిపోయాడు.
"సుకుమార్ ఎందుకిలా నిశ్శబ్దంగా ఉండిపోయావు?"
"గిల్టీగా ఉంది. నిన్ను పాడు...."
చేత్తో అతని నోరు మూశాను. "అలాంటి మాటలే ఒద్దన్నాను"
బయట రోడ్డుమీద మనుషుల కదలికలు, వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి.
"సతీ! ఇహ వెళతాను. తెల్లవారుతోంది."
తల ఆడించాను.
అతను లేచి నిలబడ్డాడు.
"మళ్లీ...."
"రేపు కలుస్తాను"
"సుకుమార్. తలుపులు దగ్గరగా వేసి వెళ్లిపో. నాకు నిద్రవస్తోంది."
ఒంగి, నుదుటి మీద ముద్దు పెట్టుకుని నెమ్మదిగా వెళ్లిపోయాడు.
వెంటనే నా కనులు మూతలుపడి గాఢమైన నిద్రలోకి జారిపోయాను.
15
తర్వాత నాలుగయిదు రోజుల దాకా సుకుమార్ కనిపించలేదు.
నాకెందుకో అంతగా ఆరాటమనిపించలేదు. అందమైన అనుభవం తర్వాత కొంత విరామం కూడా అవసరమేనేమో... ఇష్టమైన మనుషుల్ని అతిగా చూడడం కన్న. వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఆనందించటంలోనే మాధుర్యముంది.
