Previous Page Next Page 
నేను పేజి 39


    అతని గుండె మీద వ్రాలి గట్టిగా కౌగిలించుకోవాలన్న కోరిక బలంగా కలుగుతోంది. నిగ్రహించుకుంటున్నాను.


    "నువ్విలా నా ముఖానికి దగ్గరగా కూర్చుని, విరబోసి ఉన్న శిరోజాలతో మీదకు వాలినప్పుడు ఈ సృష్టి, అందులోని ఏవేవో రహస్యాలు నన్ను ఆక్రమిస్తూన్నట్లుగా.... అనిర్వచనీయమైన అనుభూతి."  


    ఇహ లోపల్నుంచి ఉబుకుతూ వస్తోన్న ప్రేమను తట్టుకోలేక నా అంతట నేనే అతని ముఖం మీదకు వంగాను.    


    మళ్ళీ ఇద్దరి పెదవులూ కలుసుకుని, నాలికలు ఆడుకుంటున్నాయి.


    ఎంతసేపని? తనివి తీరటం లేదు.


    నాకప్పటికి పూర్తి సెక్స్ అనుభవం లేదు. ఉద్రేకాలతో, కొంత మొరటుతనంతో కూడిన పూర్తి అనుభవం కన్న, మృదు సుగంధం లాంటి ఈ ఆస్వాదనే రసస్ఫూర్తిగా నిండి, అమూలమైనవిగా కనిపించింది.      


    ఇందులో ముగింపు అక్కర్లేదు.


    అలా.... చాలాసేపు....


    ఎందుకనో.... చిన్నపిల్లలు, పసితనంతో, అమాయకంగా ఆటలాడుకుంటూన్నట్లు, చాలా స్వచ్చంగా, రిలీఫ్ గా ఫీలవుతున్నాను.  


                                                   *    *    *


    అతనెందుకంతటితో ఊరుకున్నాడు? నాకేం అనంగీకారం లేదు.


    ఇద్దరం భోజనాలు చెయ్యటం మొదలు పెట్టేసరికి చాలా రాత్రయి ఉంటుంది. టైము చూడలేదు. అయినా సకాలంలోనే తింటూన్నట్లు ఇష్టంగా, ఆకలిగా ఉంది.   


    ఆ వయసులో ఉన్న యువతీ యువకుల మధ్య ఎన్ని కబుర్లుంటాయో, చూసేవాళ్ళకు విపరీతంగా, విడ్డూరంగా ఉండవచ్చు. కాని ఆ కబుర్లలా నిర్విరామంగా, సంతోషంగా పుట్టికు వస్తూంటాయి.


    మధ్యలో ప్రకాష్ బాబు గురించి చెప్పాను.


    అతను నిజంగానే దీన్ని గురించి చాలా సీరియస్ గా ఆలోచించినట్లు కనిపించాడు.


    కొంతమంది ఆలోచిస్తూంటే మొద్దుగా ఉంటుంది. కొంతమంది ఆలోచిస్తూంటే ముద్దుగా కనబడతారు. బహుశా వాళ్ళ ఆలోచనలు కూడా మాలుల్లాగే పువుదిల్లా ఉంటాయేమో.


    "నువ్వేమనుకుంటున్నావు?" అన్నాడు.


    "తెలీటం లేదు. చాలా దీర్ఘంగా ఆలోచించాను. గుర్తింపు, రుచి లేని జీవితం నేను భరించలేను. అలా అని నాది కాని జీవితం కూడా జీవించలేను. గుర్తింపు అంటే డబ్బూ, హోదా.... ఇదే కాదు. ఆ రోజు శమంతకమణి అనేక విషయాలు నూరి పోసింది. వాటిలో చాలా నిజాలు కూడా లేకపోలేదు. కాని నాకు నేను కావాలి. నా విలువలు కూడా నాక్కావాలి. నేను నేనుగా బతకాలి. కాని ఎలాగో స్పష్టంగా తెలీటం లేదు."  


    "సతీ. నీ అందచందాలూ, ఆకర్షణలూ సామాన్యమైనవి కావు. బహుశా సినిమాలోకంలో నువ్వు చాలా ఉజ్వలంగా రాణించగలవు."


    "కావచ్చు. కాని నా మనసటుపోవటం లేదు."


    "ఎందుకని?"


    "అదే అనుక్షణం నన్ను కుదిపేస్తున్న ప్రశ్న."


    "ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను."


    "ఏమిటి?"


    "నువ్వు నాకు కావాలి."


    నోట్లోకి ముద్ద పెట్టుకోబోతూన్న దాన్నల్లా ఆగిపోయాను. ఆ మాటల్లోని ప్రతి అక్షరంలోని నిజాయితీ నన్ను అణువణువునా కుదిపేసింది. ఇహ అన్నం తినడం అనవసరమనిపించింది.   


    "సతీ! చాలావరకూ చొరవ తీసుకున్నాక ఇప్పుడీ మాటలు చెప్పటంలో అర్థం లేదు. నేను సామాన్యుణ్ణి. అందుకని నీ భవిష్యత్తుకి అడ్డు తగుల్తున్నానేమోనన్న భయంతో చెప్పలేకపోయాను. కాని నాలో అనేక భావాలు. సామాన్యుణ్ణయినా నీ జీవితాన్ని అసమాన్యంగా దిద్దగలనన్న చిన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం కన్నా మరో సత్యం నన్ను తుత్తినియలు చేస్తోంది. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు కావాలి. ఈ సప్తాక్షరిమంత్రం నీ ధ్యానం, నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నాకేం కనబడటం లేదు. అసలు నాకింకేం అఖ్కర్లేదు. ఒక్కో క్షణం నన్ను నీవైపు ఇంకా ఇంకా బలంగా లాగి పారేస్తున్నది."


    ఎంత పులకించి పోయానని!


                                                      *    *    *


    భోజనాలయాక చేతులు కడుక్కుని, ముందు గదిలో కొచ్చాము. బయటి వాతావరణమెలా ఉందో చూద్దామని కిటికీ తలుపు తెరిచాను.


    ఒక్కసారిగా చలిగాలి లోపలకు దూసుకొచ్చింది. శరీరమంతా వణికి పోయినట్లయింది. బయటంతా నిశ్శబ్దం. ఈ చీకటి ఈ సృష్టిలో మేము తప్ప ఇంకెవరూ లేరన్న అనుభూతి.


    కిటికీ తలుపులు మళ్ళీ మూసేశాను.


    "ఎంత చలో! అవును. రోడ్డంతా ఇంత నిర్మానుష్యంగా ఉందేమిటి?" అన్నాను.


    "ఇప్పుడు టైమెంత అయిందనుకుంటున్నావు" అంటూ రిస్ట్ వాచి చూచుకొని "పన్నెండు" అన్నాడు.


    "అమ్మో అంత రాత్రయిపోయిందా?"   


    ఇష్టమైన మనుషుల మధ్య కాలం తెలీకుండా ఎలా గడిచిపోతూ ఉంటుంది.


    ఒక్క నిమిషంపాటు ఇద్దరి మధ్యా అందమైన నిశ్శబ్దం.


    "ఇంక వెళతాను" అన్నాడు.


    "ఈ చల్లో ఇంత రాత్రివేళ.... బస్సులూ అవీ కూడా ఏమీ దొరకవు."


    "నడుచుకుంటూ వెళ్ళిపోతాను"


    "ఉహు.... ఈవేళ కాని వేళ నిన్ను వెళ్ళనివ్వను"


    "వెళ్ళకుండా ఎక్కడ పడుకుంటాను?"


    "ఇక్కడే"


    "నువ్వు?"


    "నేనూ ఇక్కడే.... ఈ గదిలోనే పడుకుంటాను. ఏమయింది?"


    అతనేం మాట్లాడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS