Previous Page Next Page 
జోగబాల పేజి 39


    "సరేలే. ఆ విషయాలు తర్వాత మాట్లాడుదాం. వజ్రం ఒకసారి నిన్ను ఇంటికి రమ్మంది, వెళ్ళిరా."


    "వీలు చూసుకుని వెడతానండీ" అన్నాడు వినయంగానే. కానీ వెళ్ళలేదు.


    ఒకరోజు షాపునుంచి గదికి వెళుతోంటే విలాస్ కనిపించాడు. అతను ఊళ్లోనే వేరే ఎక్కడో ఉంటున్నట్లుగా తెలిసింది. ఎక్కువగా మాధవప్రసాద్ తో తిరుగుతున్నాడని కూడా విన్నాడు. శ్రీహర్షను చూసి వెక్కిరింపుగా నవ్వాడు విలాస్. శ్రీహర్ష పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు. ఆ సాయంత్రం గదినుంచి బయటకు రాబోతుంటే పుష్ప కనిపించింది.


    "మీరా? ఇలా ఎక్కడికి?" అన్నాడు చాలా సభ్యతగా.


    "నీ కోసమే నాన్నా."


    "నా కోసమా?"


    "అవును. మయూరంగారింటికి వస్తూవుంటాననుకో. కానీ అక్కడ మాట్లాడితే బాగుండదని."


    "ఏమిటో చెప్పండి."


    "జోగిని అనేదాన్ని దురాచారంగా ప్రచారం చేస్తూ ఉపన్యాసాలిస్తున్నావుట. కమిటీలను రప్పిస్తున్నావుట."


    "అవును."


    "చూడు నాన్నా? ఒకసారి నీకు చెప్పాను ఇటువంటి విషయాల్లో తలదూర్చవద్దని. నీమీద నాకు జాలి. అందుకే చెబుతున్నాను. రానురాను కష్టాల ఊబిలోకి వెళ్ళిపోతావు."


    "అయినాసరే నా కిష్టమే."


    "చివరకు నువ్వు సాధించేదేమీలేదు. నువ్వు చేస్తోన్న ప్రచారం జోగినులకు ఇంకో రూపంగా ఉపయోగపడుతున్నదని మరచిపోకు. ఈమధ్య కాలేజి కుర్రాళ్ళు విపరీతంగా వస్తున్నారు. ఇదివరకు కొంతమంది పేరుకు మాత్రం జోగినులుగా ఉండి, వాళ్ళదగ్గర కెవరూరాక పొలం పనులు చేసుకుంటూ పొట్టపోసుకోవల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా గిరాకీ పెరిగింది. నీ భాషలో దురాచారంగా ఉండేది ఇప్పుడు పూర్తి వ్యభిచార వృత్తిగా మారుతోంది. జోగినిగా ఎక్కడో మారుమూల ఓ పద్ధతిలో నడచుకొన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి పడుపుకత్తెలుగా మారిపోతున్నారు.


    శ్రీహర్షకు తల తిరిగిపోతున్నట్లయింది. నిశ్చేష్టులై ఉండిపోయాడు.


    "చూడు నాన్నా. నిన్ను నువ్వు పాడుచేసుకుంటూ మమ్మల్ని ఇంకా ఇంకా పాడుచేస్తున్నావు. ఈ హెచ్చరిక నిన్ను చేద్దామని వచ్చాను."


    పుష్ప విసురుగా నడచుకొంటూ వెళ్ళిపోయింది.


                                *    *    *    *


    తర్వాత గవర్నరుచేత పంపబడిన కమిటీ వచ్చింది. ఆ కమిటీలో అంతా ఆడవాళ్ళే. ఒక లేడీ డాక్టరుకూడా ఉంది. వాళ్ళతో మాట్లాడడానికీ, వాళ్ళడిగిన ప్రశ్నలకు జవాబివ్వడానికీ మొదట జోగినులు నిరాకరించారు. బ్రతిమిలాడగా, బుజ్జగించగా క్రమక్రమంగా రాసాగారు. వారిలో పుష్పలూ, వాసంతులూ, రాగిణులే కాదు ఎల్లమ్మలూ, పుల్లమ్మలూ , శాయమ్మలూ, గురవమ్మలూ కూడా ఉన్నారు. అందమైన వారూ ఉన్నారు. అందవిహీనమైనవారూ ఉన్నారు.


    కొంతమంది పెడసరంగా జవాబులిచ్చారు. కొంతమంది వినయంగానే మాట్లాడారు. చాలా కొద్దిమంది బాధపడుతున్నట్లు కనిపించారు.


    వైద్యపరీక్షలో వారందరూ ఇంచుమించు సుఖవ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. వాటితోబాటు చాలామంది ఎనీమియా, కొంతమంది లివర్ కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు.


    "మేము మీకు ఉపకారం చేద్దామని వచ్చాం. మిమ్మల్నీ దుస్థితినుంచి తొలగించటానికి వచ్చాం" అంటే వాళ్ళు పకపక నవ్వేసేవాళ్ళు.


    "దుస్థితా? మేము దుస్థితిలో ఉండడమేమిటి? ఒక పవిత్రమైన కార్యానికి మేము ఉపయోగపడుతున్నాం."


    "మీరు చేసే వృత్తి పవిత్రమైనది కాదు. ఈ సంఘం మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసింది. మీరు దారుణమైన అన్యాయానికి గురికాబడుతున్నారు."


    "అన్యాయమా! నిజంగానా?"


    "మీరూ మా అందరిలా జీవించవచ్చు."


    "ఏదీ! ఇలా క్యాంపులు తిరుగుతూనా?"


    "చదువుకుని ఉద్యోగాలు చేసుకోవచ్చా?"


    "వంట చెయ్యటం, అంట్లు తోమటం, పిండి రుబ్బటం ఇలాంటివా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS