"మీరుండండి! ఇదిగో విశ్వం. ఈ చంద్రహారం పది తులాలుంటుంది .దీన్నమ్ముకుని వాళ్ళ వాటా తీసుకోమను. తక్షణం నా ముందునుంచి వెళ్ళిపొమ్మను. వాళ్ళ ముఖాలు చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయి." అని మెడలోని చంద్రహారం తీసి సర్రున విసిరేసింది.
దాన్నందుకుని "సరే మీ యిష్టం" అన్నాడు విశ్వం.
"అదెట్లా? ఆ బంగారంలోనూ మాకు వాటా రావాలి" అంది జ్యోతి.
"నువ్వు నోర్ముయ్! అది నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన బంగారం. అదే కాదు, నా గాజులు, నెక్లెస్, జడ బిళ్ళ, నా గొత్తులు గొలుసు అంతా నా పుట్టింటి బంగారమే. కావలసి వస్తే పేర్లు చూడు. మావయ్యనడుగు"
ఆ మాటలకి జ్యోతి నోరెత్తలేదు.
"ఒరే విశ్వం! వాళ్ళిద్దరినీ వాటా సొమ్ముగా ఆ బంగారం ముట్టినట్లు రసీదివ్వమను. తక్షణం నా ఇంటినుండి వెళ్ళిపొమ్మను_"
"అప్పుడే అయిందా అత్తగారూ! మెళ్ళో హారం విసిరేయగానే పూర్తయిందా! ఇంట్లో మీరు పూజచేసే విగ్రహం మాటేమిటి?"
నువ్వెరపోయారంతా! "అంటే జానకి పూచిక పుల్ల కూడా వదలదల్చుకోలేదన్నమాట!" అనుకున్నారు.
"అదీ అంతేనే! అది శ్రీకృష్ణదేవరాయలు మా పూర్వీకులకు యిచ్చిందట, అల్లసాని పెద్దనగారికి బంధువట ఈయన. ఆయన చెబితే అగ్రహార యిచ్చారు. దాని వెంటే ఈ విగ్రహం కూడా ప్రసాదించారుట. మా నాన్నగారు మా అన్నయ్య వెధవ కావటం చూసి పూజా పునస్కారాలు పాటించే అల్లుడికి కన్యాదానం అప్పుడు యిచ్చారు, అది నీలాంటి నాస్తికుల కెందుకే? అమెరికాకి అమ్మేస్తావా? బంగారం కరిగించి సొమ్ము చేసుకుంటావా?" ఆవేశంగా అంది పార్వతి.
జ్యోతికి నోరు పెగల్లేదు. ఒక్కక్షణమాగి "అన్నిటికి అన్ని సమాధానాలు చెపుతున్నారు. పాత్ర సామాను అదీ యివ్వరా?" అంది.
"ఊహూఁ అంతా నాపుట్టింటివాళ్ళు యిచ్చింది మీ మామగారు సంపాదించిందీను. ఆయన స్వార్జితంలో మీకు దమ్మిడీరాదు. ఇక వెళ్ళు ఇంకా వాగావంటే ముఖాన చీపురుపెట్టి చిమ్ముతా" అంది ఆవేశంగా.
"పార్వతీ!"
"చూడండి ఈ నంగనాచి ఎలా అడుగుతుందో అన్నీను. ఆనాలి ముచ్చు నోర్ముసుకుని ముసుగేసుకున్నాడు. ఆ వెధవా అంతే ఆడంగి వెధవ. పెళ్ళానికి పెత్తనం కట్టారు. వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారు."
జానకిరాం లేచాడు_
అయోధ్య లేచాడు_
ఇద్దరూ విశ్వంవైపు చూశారు.
అదిచూసి_ "పదండ్రా వెళదాం! బాబాయ్ రేపు ఈ సొమ్ము ముట్టినట్లుగా డాక్యుమెంట్స్ వ్రాయించి ఇస్తాను. రిజిష్టర్ చేయిద్దాం" లేచాడు విశ్వం.
జ్యోతి, అహల్య కూడా కదిలారు.
జ్యోతి ఒక్కక్షణం ఆగి పార్వతి దగ్గరికి వచ్చింది.
"అత్తయ్యా నిన్ను 'పార్వతీ!" అని పిలవాలనిపిస్తుంది."
పార్వతి బాధతో కృంగిపోయి వుంది_ "కానియ్ తల్లి అదికూడా కానివ్వండి" అంది స్పష్టంగా.
"కానీ నాలోని సంస్కారం అప్రయత్నంగా అత్తయ్య అని పిలిపించింది. నువ్వు మామచాటున వుండి ఆడిస్తున్నావు"
"నీవు నీ మొగుడి చాటున వుండి ఆడించటం లేదూ?"
"ఆడిస్తున్నానని మురిసిపోవచ్చు. మాకేమీ యివ్వకుండా బయటికి పంపే ఆలోచన చేస్తున్నావు. ఫర్వాలేదు మేమేమీ కాము. మేం ఇద్దరం చదువుకున్నాం_ఉద్యోగాలు చేసుకుంటున్నాం! హాయిగా బ్రతుకుతాము."
"మరి ఈ ముష్టి కెందుకొచ్చారు?" పార్వతి తీవ్రంగా చూస్తూ అడిగింది.
"హక్కున్నది కనుక అడగాలని వచ్చాము. మీ మనసుల్లో ఇంత కుళ్ళు వుందనుకోలేదు. కానీ కొడుకులందరికీ చెడ్డయిపోయి, ఆయన నువ్వూ తల చెడిన కోడలితో ఎలా నెగ్గుకొస్తారో మేం చూస్తాం."
పార్వతి, శాస్త్రిగారు ఖిన్నులైపోయారు.
పదిహేను నిముషాలు కాలం బరువుగా కత్తిమీద సాములా గడిచింది. అక్కడ గాలి లేక ఉక్కిరిబిక్కిరై పోతున్నట్లు అనిపించసాగింది.
దాశరధిలేచి తండ్రి వద్దకి వచ్చి కూచున్నాడు.
దాశరధి మాట్లాడలేదు. అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. గుండెలో బాధ రగులుతోంది. ఆడుకున్న గుండెలమీద నిర్ధాక్షిణ్యంగా తన్నేసి ఎలా వెళ్ళిపోగలరీ ప్రబుద్ధులు? అతని మనసంతా అసహ్యంతో నిండిపోయింది.
"మీ అమ్మని సప్తపర్ణి అనే వాడిని. ఏడుగురు కొడుకులతో ఏడాకుల అరటిలాగా దినదిన వర్ధమాన మయ్యేది సంసారం. మీ అమ్మని తమాషా పట్టిస్తుండేవాడిని. ఆఖర్న అమ్మాయి పుడితే అష్టలక్ష్మివే అనేవాడిని. ఇంకొకరు పుడితే నవగ్రహం అంటారేమో అనేది మీ అమ్మ. ఆఖరికి సప్తపర్ణినే ఖాయం చేశాడు కోదండం."
"ఇప్పుడు ఒక్కో ఆకూ విడిపోయి ఆఖరికి మీ అమ్మని అపర్ణని చేస్తారేమో బాబూ!"
"ఊరుకోండి నాన్నా! తవ్వుకునేకొద్దీ దుఃఖం పెరుగుతుంది."
"ఏం చూసుకుని శాంతంగా ఉండాలి దాశరధీ! ఎంతో బుద్ధిమంతుడనుకునే పట్టాభి కూడా వెధవయ్యాడు"
"వయసు నాన్నా! తప్పు చేశారు_ పెద్దవారు మీరు క్షమించాలి."
"హు అంతకంటే చేయగలిగిందేముంది?"
"ఏమండీ?" అని పిలిచింది పార్వతి.
"ఏమిటి?"
"ఇక పడుకోండి అర్దరాత్రి దాటింది. నువ్వూ ఇక్కడే పడుకోరా దాశరధీ!"
"వస్తానాన్నా! పిల్లల్ని తీసుకురాగానే వస్తాను" అని కదిలాడు.
చూస్తూ వుండిపోయారిద్దరూ.
తెల్లగా తెల్లారింది పార్వతి లేచేసరికి.
రాత్రి అందరూ వెళ్ళిపోయాక చాలాసేపటి దాకా భార్యాభర్తలిద్దరూ ఒకర్నొకరు ఓదార్చుకుంటూ తమ తమ కర్మాన్ని నిందించుకుంటూ విలపించారు.
"ఏమండి లేవండి, తెల్లారిపోయింది." అని భర్తని నిద్రలేపి ఇంట్లోకి వెళ్ళింది. భార్య వెంటే వెళ్ళి దంతధావనానికి ఉపక్రమించారు.
"ఏమిటో ఇంకా విద్యా, స్వాతి కూడా లేవలేదు."
"పడుకోనీ రాత్రంతా మన గొడవవింటున్నారేమో?"
"ఏమో!"
"పట్టాభి కూడా లేవలేదా?"
"లేచినట్టే వున్నాడు. బ్యాట్ కనిపించలేదు హాల్లో. ప్రాక్టీసుకి వెళ్ళాడేమో?" అంది భర్తకి కాఫీ అందిస్తూ.
