Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 3

 

                                    2
    తన ఆశలన్నీ అలా దూది పింజేల్లా విడిపోబోతున్నాయని గ్రహించుకుని నీళ్ళు కారిపోయినట్లు కుర్చీలో జార్లపడి చెంపని చెయ్యి ఆనించుకుని కూర్చుని, భార్య ఉపన్యాసం లాంటి ధోరణి అంతా విన్న ఉమా మహేశ్వరం గారికి చటుక్కున గుర్తు వచ్చింది.
    "అది సరే కాని కోడలు నలుపయితే కులం అంతా నలుపని శాస్త్రమే వుంది -- రత్నం లాంటి పిల్లాడికి ఆ నల్ల పిల్లని కడతానంటావేమిటి? అయినా వాడు ఒప్పుకుంటాడనేనా?'అన్నాడు. ఇంతసేపటికి తనకి ఓ పాయింటు దొరికిందన్న ధీమాతో.
    "సురేఖ ని కాదులెండి -- ఉమని చేసుకుందాం -- దానికంటే ఇది రెండేళ్లో ఎంతో చిన్న' అంది రుక్మిణమ్మ గారు.
    'పెద్ద పిల్లని వదిలి చిన్న పిల్లని చేసుకుంటామంటే వాళ్ళేమైనా అనుకోరా?" ఓ ఆభ్యంతరం లేవదీస్తూ , రవంత ఆశగా భార్య కళ్ళల్లోకి చూశారాయన -- మీ అన్నయ్య మన తాహతు కి తూగలేడు, అందుచేత నాకు ఇష్టంలేదు అని చెప్పగల సాహసం లేకపోయిందాయనకి. అందుకే ఆవిడ కోరిక సమంజసం కాదని ఏదో విధంగా ఆవిడ చేతే ఒప్పించి నెపం తన మీద లేకుండా చేసుకోవాలని అయన తాపత్రయం.
    'నా ఉద్దేశ్యం చెప్పాను మిగిలిన విషయాలన్నీ వాళ్ళే ఆలోచించుకుంటారు-- అయినా కోరి చేసుకుంటామంటుంటే చేదా ఏమిటి?" అంది రుక్మిణమ్మ ధీమాగా-- మొగపిల్లవాడి తల్లి మరి.
    'సరే, అందరికీ అంగీకారం అయితే నా అభ్యంతరం ఏం లేదు" అనక తప్పలేదాయనకి.
    ఆ తరువాత కొడుకు అభిప్రాయం కూడా తెలుసుకునే అవకాశం కోసం చూస్తూ కూర్చుంది ఆవిడ- వేసంగి శలవలుఎప్పుడు వస్తాయా అని రోజులు లెక్క పెట్టుకుంటున్న ఆవిడికి, నాలుగు రోజులు శలవలు కలిసి వచ్చాయని కొడుకు ఇంటికి రావటం శుభ సూచకమే అనిపించింది -- అసాయంకాలం చల్లగాలికి ఆరు బయట మంచం వాల్చుకుని కూర్చుని కొడుకుని పిలిచింది-- అదీ ఇదీ మాట్లాడి చివరికి అసలు సంగతి బయట పెట్టింది. అది వింటున్న రామకృష్ణ మోహంలో రంగులు యిట్టె మారిపోయాయి.
    'ఈ మద్యం టే కాస్త తగ్గింది కాని చిన్నతనంలో ప్రతి ఏడూ వేసంగి శలవలకి తామంతా అమ్మమ్మగారి వూరుకెళ్ళేవారు. నాన్నగారికీ ఎప్పుడైనా వీలు కాకపోయినా అమ్మా తనూ మాత్రం ప్రయాణం మానేవారు కాదు-- ఆ చిన్న వయస్సులో అడా మొగా అనే బేధం లేకుండా పిల్లలంతా కలిసి దాగుడుమూతలు , ఎండ వేళయితే కేరమ్సూ పేకా ఆడుతుండేవారు-- అదేం చిత్రమో కాని సురేఖ కీ తనకీ అసలు ఒక్క క్షణం అయినా పడేది కాదు.
    ఆ రోజుల్లో మామయ్యా గారింట్లో ఓ నల్లావు వుండేది -- అది ఇంట పుట్టిన దూడ.
    'ఇదిగో , అసలు ఆవులు తెల్లగా వుంటాయి కదూ, మీ నల్లావు ని గురించి నేనో కధ చెప్పనా ' అన్నాడు తను ఒకనాడు, సురేఖ వంక ఓరగా చూస్తూ.
    అతని మాటల్లో వ్యంగ్యం వెంటనే స్పురించలేదు అక్కడున్న పిల్లలకి 'ఏమిటది చెప్పు', అన్నారు.
    'ఓస్ -- ఇంత మాత్రం తెలియదా -- అది పుట్టినప్పుడు తెల్లగానే వుండేదిట మా అమ్మ చెప్పింది -- తెల్లగా బొద్దుగా ముద్దోస్తున్న ఆ బుల్లి తువ్వాయి మీద మన సురేఖ ఒక్కసారి అలా చెయ్యి వేసి నిమిరిందిట -- అంతే, మంత్రం వేసినట్లు మరుక్షణం లో అది నల్లటి దూడగా మారిపోయిందిట -- ' తెరలు తెరలుగా వస్తున్న నవ్వు ఆపుకుంటూ అతను చెప్తుంటే కొంతమంది ఆ నవ్వులో శృతి కలిపారు-- మరి కొంతమంది నవ్వటానికి ధైర్యం లేకనో లేకపోతె సురేఖ పట్ల జాలి వల్లనో బొమ్మల్లా మూతులు బిగించుకుని ఆ పిల్ల ఏం చేస్తుందో చూద్దాం అన్నట్లు రెప్ప వాల్చకుండా ఆటే చూస్తూ కూర్చునారు--
    బావ అలా తనని వెక్కిరిస్తుంటే సురేఖ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి -- అవమాన భారంతో తల ఒరిగిపోయింది. ఒక్క క్షణం -- అంతే, మరుక్షణం రెట్టించిన పౌరుషంతోనూ ఉడుకు మోత్తనం తోనూ గొంతు చించుకుంది 'చూడ కళ్ళూ లేవు నారాయణా అన్నట్లు' నీకసలు కళ్ళే కనిపించవుగా....మా ఆవు రంగు పోల్చుకోగాలగటం చిత్రంగానే వుంది -- అసలు నీ కళ్ళకి ప్రపంచం అంతా నల్లగానే కనిపిస్తుందేమో ' అంటూ.
    తరుచు తలనొప్పి వస్తుండటం వల్ల పదేళ్ళ వయస్సు లోనే కళ్ళ జోడు పెట్టుకోవలసిన అవసరం కలిగింది రామకృష్ణ కి- తన అవకరాన్ని అలా నిస్సంకోచంగా ఆ పిల్ల వెక్కిరించటం తో అతనికీ కోపం వచ్చింది -- దానికేదో సమాధానం చెప్పాడు. ఆ పిల్లా వూరుకోలేదు , మాటకి మాట  అంటించిన దాకా -- ఏం చెయ్యాలో తెలియక మిగిలిన వాళ్ళంతా తమకేమీ పట్టనట్లు కేవలం ప్రేక్షకులుగా కూర్చుండి పొతే తామిద్దరూ కాస్సేపు పోట్లాడుకుని చివరికి చెరో మూలా ఏడుస్తూ కూర్చున్నారు-- అలాగే ఆ వూరు వెళ్ళినప్పుడల్లా ఎందుకో అందుకు ఆ పిల్ల వెక్కిరించటం మళ్ళీ నాలుగని పించుకోటం తనకి అలవాటయి పోయింది -- ఇప్పుడు దాదాపు మూడేళ్ళు అవుతోంది తను మామయ్య గారింటికి వెళ్ళి -- ఈ మూడేళ్ళ ల్లో ఎంత మార్పు వచ్చినా సురేఖ రంభలా రూపు దిద్దుకుని వుంటుంది అనుకోటానికి అతని మనస్సు ఒప్పుకోటం లేదు-- ఆ అమ్మాయిని తన ప్రక్కన భార్యగా వూహించుకోటానికే అతని కేలాగో వుంది--
    తన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మొహం ముడుచుకుని మల్లె పందిరి వంకా మందార చెట్టు వంకా చూస్తూ కూర్చున్న కొడుకు ఆలోచనలని పసిగట్టగలిగిన రుక్మిణమ్మ ముసిముసిగా నవ్వుతూ అంది.
    'ఉమకేం తక్కువరా , బంగారపు బొమ్మ కదూ -- చదువులో అయినా అంత మరీ తెలివి తక్కువదెం కాదు-- పరీక్షల ముందు జ్వరం రావటం వల్ల ఆ స్కూలు ఫైనలు పోయింది . ఆ తరువాత మరి చదవనూ అంటూ అదే మానేసింది, వాళ్ళూ శ్రద్ధ పెట్టలేదు....'
    ఆవిడ మాట్లాడటం మొదలు పెట్టిన మరు క్షణం లోనే అతని ఎదలో మల్లెలు విరిశాయి -- ఇంక ఆ తరువాత అతనేం వినలేదు -- తను చివరిసారిగా చూసిన ఉమా రూపం మనస్సులో మెదిలింది -- మోపెడు కుచ్చెళ్ల పరికిణీ, కొత్తగా వేసుకోటం వల్ల అలవాటు లేక భుజం మీద నిలవకుండా జారి జారి పోతున్న వోణీ -- పసితనం పూర్తిగా వదలక ఎప్పటి లాగే చెంగు చెంగున గంతులేస్తూ ఆటలాడే ఉమ -- రెండు జడలు , చెవులకి బెంగాళీ రింగులు , టూత్ పేస్టు ఎడ్వర్టాయిజు మెంటు వాళ్ళ ఫోటో లోలా తెల్లగా మెరిసే చక్కటి పలు వరుస . బుల్లి నోరు, నవ్వితే సొట్టలు పడే నున్నటి బుగ్గలు -- అ ఉమ ఇవాళ ఎలా వుంటుందో ఊహించుకొబోయాడు -- ఎంత దాచుకుందామన్నా దాగని అనురాగం ఆ చిరునవ్వులో బయటపడనే పడిపోయింది.
    మురిపెంగా కొడుకు మొహంలోకి చూస్తూ, 'కావాలంటే మళ్ళీ చదివించమని చెప్దాం ....ఏం, మామయ్యతో చెప్పనా' దాన్ని మళ్ళీ పరీక్షకి కట్టించమని' అని ఆవిడ అడిగిన దానికి 'నీ ఇష్టం -- ' అంటూ తప్పుకున్నాడతను.

                       
    ఉగాది పండుగ పేరుతొ పనిగట్టుకుని వచ్చిన అత్తయ్య మధ్యాహ్నం తీరుబడిగా పెళ్ళి ముచ్చట్లు మొదలు పెట్టేసరికి, ప్రక్క గదిలో కూర్చుని చదువు కుంటున్న సురేఖ చెక్కిళ్ళు ఎర్ర బడ్డాయి. ఆ పిల్లకి తెలియకుండానే-- గుండె ఝల్లుమన్నట్లయింది-- 'ఎలాగయినా అత్తయ్య కి నేనంటే -- అభిమానం -- చిన్నప్పటి నుంచీ నా చదువు చూసీ నాకు వచ్చిన మార్కులు చూసి మురిసి పోయేది.' అనుకుంటూ తియ్యటి వూహలతో తేలిపోతున్న సురేఖ కి అత్తయ్య ఏమందో వినిపించలేదు కాని,  'పెద్దదాన్ని వదిలి, ఉమని చేసుకుంటాననటం న్యాయం కాదు -- సురేఖ అయినా మీ అబ్బాయికి ఈడే' అంటున్న తల్లి మాటలు చెవుల్లో పడగానే వులిక్కిపడినట్లయి ఏమిటిది ఏమయింది అనుకుంది. మనస్సు గిలగిల్లాడి పోయింది-- తేనే సోనలు కురుస్తాయని తహతహ లాడిపోతున్న శ్రవణేద్రియాలలో వాడి శూలాలు గుచ్చుకున్నట్లయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS