Previous Page Next Page 
జోగబాల పేజి 3


    గుండె దడ దడమని కొట్టుకుంటూన్నది.


    ఆ అమ్మాయి పేరు వర్ష.


                                                        *    *    *    *


    కర్ణాటక రాష్ట్రంలో ఓ పల్లెటూళ్ళో రాత్రి ఎనిమిది గంటల వేళలో వింత జరుగుతోంది.


    ఊరి వెలుపల పాడుబడ్డ దేవాలయంలో నిలువెత్తు సత్తెమ్మతల్లి విగ్రహముంది. దేవాలయంలో అలంకరించబడి ఉన్న వందల కొద్ది ఉన్న కాగడాల వెలుగులో ఆ దేవత విగ్రహం తాలూకు పెద్ద పెద్ద కళ్ళు భయంకరంగా మెరుస్తున్నాయి. ఆ ఎరుపులో దేవత తాలూకు ఉవ్వెత్తు గుండెలు, నడుం, తోడలు, కనులు మిరిమిట్లు గొల్పుతున్నాయి.


    దాదాపు డెబ్బయి మంది స్త్రీలు, పురుషులు నగ్నంగా పిచ్చిపట్టినట్లు కేకలు వేస్తూ కేరింతలు కొడుతూ, గెంతుతూ క్రిందపడి పొర్లుతూ, జుట్లు విరబూసుకుని నాట్యం చేస్తున్నారు. ఇది ఏ ఆటవికుల మధ్యో_అనాది కాలంలోనే జరుగుతోన్న సంఘటన కాదు. ఈ ఇరవయ్యో శతాబ్దంలో కేవలం కొన్ని నెలల క్రితం జరుగుతున్న వాస్తవిక సంఘటన.  


    ఒక ప్రక్క చెవులు హోరెత్తించేటట్లుగా డోళ్ళు డమరుకలు, ఇంకా రకరకాల వాద్యాలు విలయతాండవం చేస్తున్నాయి.


    ఆ దృశ్యాన్ని కొన్ని వందల మంది గ్రామస్థులు తిలకిస్తున్నారు. వారిలో వృద్దులూ ఉన్నారు. వయసులో ఉండి సామాన్యంగా సంసారం చేసుకునే గృహస్థులూ ఉన్నారు.


    యుక్త వయస్కులయిన యువతీ యువకులున్నారు. పిల్లలూ ఉన్నారు. వాళ్ళెవరి మొహాల్లోనూ ఆశ్చర్యంలేదు. అసహ్యం లేదు. మహత్తరమైన, అద్భుతమైన శుభకార్యం, పవిత్రమైన భగవత్ కార్యక్రమం తిలకిస్తూన్నట్లు మైమరచి ఆరాధనా భావంతో నిలబడి ఉన్నారు.


    నిమిషాలు గడుస్తూన్న కొద్దీ వాద్యాల మోత మరీ జోరవటం. దాంతోబాటు, నృత్యంలో వేగం, మెరమెరలాడుతున్న అవయవాల కదలికలి.


    వాతావరణంలో ఉగ్రిక్తత ఉత్సాహం ఉరకలు వేస్తోంది.


    ఇంతలో అక్కడికి ఇద్దరు యువకులు సైకిళ్ళ మీద వచ్చారు.


    ఇద్దరికీ ఇరవై ఇరవై రెండేళ్ళ మధ్య వయసుంటుంది.


    ఒకరి ముఖంలో అమాయకత్వం. సుకుమారత్వం దోబూచులాడుతున్నాయి. అతని పేరు శ్రీహర్ష. రెండో యువకుడు కొంచెం పదునుగా, జాగ్రత్తగా చూస్తే కళ్ళలో దాగి వున్న క్రౌర్యం బయటపడేట్లు కనిపిస్తున్నాడు. అతడు విలాస్.


    'ఇదేమిటి?' అన్నాడు శ్రీహర్ష ఆశ్చర్యంగా. అతని ముఖంలో ఆశ్చర్యంతో బాటు జుగుప్స, వికారం లాంటి భావాలు ద్యోతకమవుతున్నాయి.


    "ఇదేమిటో నాకు తెలియదు గాని సెన్సార్ చెయ్యని ఇంగ్లీషు చిత్రాల్లో సైతం ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు చూడం. ఈ మొగవెధవల విషయం పట్టించుకోకు. ఆడవాళ్ళ వైపు చూడు. అందులో కొందరు చాకుల్లాంటి సుందరీమణులు లేరు?" అన్నాడు విలాస్.


    "విలాస్! నీకిలా మాట్లాడడానికి సిగ్గు వెయ్యడం లేదూ"


    విలాస్ నవ్వాడు ప్రకృతి ప్రసాదించిన సౌందర్యంలో పోనీ సౌందర్యాలలో మనమిప్పుడు కొన్ని విలోకిస్తున్నాం. అదిగో ఆ మూల నడయాడే పుత్తడిబొమ్మ అవయవాల సొంపు చూడు. హ్యాండిల్ చెయ్యాలనిపించడం లేదా?"


    'ఛీ' అన్నాడు శ్రీహర్ష. అతని యవ్వనపు గుండెలో సంస్కారపు ముల్లు బలంగా దిగబడినట్లయింది.


    విలాస్! అతని భావాలతో నిమిత్తం లేకుండా కళ్ళతో ఆనందాలను జుర్రుకుంటున్నాడు. వాళ్ళిద్దరికీ కొన్ని అడుగుల ముందు ఒక వృద్ధుడు ఉన్నాడు. శ్రీహర్ష అతన్ని సమీపించి 'తాతా?' అని పిలిచాడు.


    వృద్ధుడు తలతిప్పి చూశాడు. శ్రీహర్షకు కన్నడం కొద్దిగా వచ్చు. "తాతా? ఈ కలాపమంతా ఏమిటి?" అన్నాడు కన్నడంలో.


    "మీరీ ప్రాంతం వాళ్ళు కారా?"


    "కాదు."


    "గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తీవ్రమయిన దుర్భిక్షం అలముకొని ఉంది. వర్షాలు లేవు. ఆకలి దప్పులతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. కరువు బాధలు తట్టుకోలేక చాలామంది చచ్చిపోయారు. సత్తెమ్మతల్లి ఈ ఊరి పెద్దకు కలలో కనిపించి ప్రజలు నగ్నంగా నాట్యంచేస్తే వర్షాలుపడి కాటకం తొలగిపోతుందని సెలవిచ్చింది. అమ్మ ఆనప్రకారం ఈవేళ ఇలా సంబరం జరిపిస్తున్నాం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS