"ఇంకేమి ఆలోచించకు. ధైర్యంగా వుండు. ఈ లోకంలో నాకు నువ్వు నీకు నేను దట్సాల్. ఓ.కే.?"
సుభద్ర తలూపింది.
-రిజిస్ట్రార్ ఆఫీసులో సత్యానికీ, సుభద్రకీపెళ్ళి తతంగం పూర్తయింది. వాళ్ళిద్దరూ ఒక చిన్న ఇంట్లోకి అడుగు పెట్టేరు. సత్యం ఆ యింటిని చూపెడుతూ సుభద్రతో అన్నాడు-
"చాలా చిన్న ఇల్లు కదూ?"
"పెద్దమనసున్నవారు. నాక్కావల్సింది ఇల్లుకాదు. మీ మనస్సు"
"ఈ మాట నువ్వన్నావు గనుక సరిపోయింది. లేకపోతే సినిమా డైలాగ్సు కొట్టి పారేసేవాడిని! నువ్వేమనుకున్నా కొన్నాళ్ళు ఈ ఇంట్లోనే అడ్జెస్ట్ కావాలి తప్పదు. నా చదువు నాకు ఫుడ్డు పెట్టకపోవచ్చు. రెక్కల మీద నమ్మక మెక్కువ నాకు. కష్టపడతాను. కృషి ఫలిస్తే మంచి ఇల్లే కొనుక్కోవచ్చు"
-సత్యం చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తున్నాడు మెల్లి మెల్లిగా అతని స్థితి మెరుగు పడుతోంది. ఫర్నిచరు వగైరాలు వెలిసేయి. కాంట్రాక్టులతో పాటు వసతి కూడా పెరిగిందిప్పుడు. షుమారుగా బావున్న ఇంట్లోనే వుంటున్నారిప్పుడు!
సత్యం భోజనం చేస్తున్నాడు సుభద్ర వడ్డిస్తోంది. భోంచేస్తూ చెప్పేడు సత్యం-
"దాచేపల్లి రోడ్డు కంట్రాక్టు మనకే రావచ్చు - దట్ మీన్స్ టెన్ లాక్స్."
సుభద్ర మాటాడకుండా చారుపోసింది. ఆ చర్యకు సత్యం నీరు కారిపోయాడు.
"పది లక్షల వార్త చెబితే చారుపోసి సర్దుకోమనడం ఏం బాగోలేదు సుభద్రా" నీరసంగా అన్నాడు సత్యం.
"అంతకంటే మంచివార్త నేను చెబుతాను."
"ఏమిటది?"
"ఆ గోడవేపు చూడండి."
సత్యం చూసేడు. అక్కడ మర్ఫీబోయ్ చిర్నవ్వు చిందిస్తున్నాడు.
సత్యం తన ఆనందాన్ని ఏ విధంగా తెలీజేయాలో తెలీక సతమతమవుతుంటే అతనికి పొల మారింది.
సుభద్ర తన చేతుల్తో అతని నెత్తిమీద తట్టింది.
-దాచేపల్లి రోడ్డుపని పూర్తయింది. సుభద్రకి నెలలు కూడా నిండాయి. ఆమెను హాస్పిటల్లో చేర్చాడు సత్యం.
సుభద్రని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు సత్యం. ఆమె మంచాన్ని వదిలి పెట్టకుండా అస్తమానం అంటిపెట్టుక్కూచుంటున్నాడు, సుభద్ర తన అదృష్టానికి పొంగిపోతోంది. కానీ-
"ఎన్నాళ్ళనుంచో మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను."
"ఏమిటది?"
"మా అమ్మనీ నాన్ననీ చూడాలని వుందండీ" అన్నదామె. ఆ మాటకి సత్యం నీరసపడిపోయాడు. సుభద్ర అడిగింది.
"ఏవండీ-నేను అడిగినదాంట్లో తప్పేమైనా వుందా?"
"లేదు ఆడపిల్ల అడగవలసిందే అడిగేవు. తాను ఒక బిడ్డకు అమ్మవుతున్నా తన అమ్మని మరిచిపోని జీవి ఆడపిల్ల! కానీ, మీ అమ్మావాళ్ళు వస్తారంటావా?"
"మీరు వెళ్ళి పిలుస్తే-"
"ఓకే! ఇవాళే వెడతాను."
---అదొక ఇల్లు.
అక్కడ సత్యం ఆగేడుగనక అది ఖచ్చితంగా సుభద్ర పుట్టిల్లే కావాలి.
సత్యం తలుపుతట్టేడు. సుభద్ర తండ్రి తలుపు తీసేడు.
గుమ్మం దగ్గర నిలబడ్డ సత్యాన్ని చూచి క్షణంపాటు షాక్ తిన్నాడు. ఏమి మాటాడాలో తోచక వచ్చే కోపాన్ని దాచుకోలేక ఓకే ఒక్క పొడిముక్క ప్రయోగించాడు.
"మళ్ళీ ఎందుకొచ్చేవ్?"
వెంటనే సమాధానం చెప్పడానికి సత్యం తటపటాయించేడు. వచ్చిన పని చెప్పక తప్పదు గనక నీళ్ళు నములుతూ చెప్పేడు-
"సుభద్రని హాస్పిటల్లో చేర్చేను. పురిటిరోజులు. రేపో మాపో ప్రసవించవచ్చు. మిమ్మల్ని చూడాలని వుందిట..."
"సిగ్గు దానికి లేకపోయినా మాకుంది. మా మాటకాదని ఈ గడపదాటి వెళ్ళినప్పుడే మాకది చచ్చిపోయింది."
"మావగారూ-"
"నోర్మూయ్. మావగారట మావగారు! ఎవర్రా నీకు మావగారు? నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేననా? నీ నెత్తిన అక్షింతలు వేసేననా? పెద్దవాళ్ళని కాదని చట్టాన్ని అడ్డం పెట్టుకుని చేసుకున్నా పెళ్ళికూడా ఒక పెళ్ళే, వెళ్ళరా వెళ్ళు" అంటూ మొహమ్మీదే తలుపు మూయబోయేడు.
సత్యం అతని ప్రయత్నాన్ని కొనసాగ నివ్వలేదు. చొరవగా ఇంట్లోకి అడుగుపెట్టేడు. అతనికి అడ్డం నిలబడి మావ అరిచేడు-
"అటెక్కడికి?"
"మీరు కాదన్నంత మాత్రాన బంధుత్వం తెగిపోదు. మగవారు గనక మొండిగా మాటాడకలిగారు. దారివ్వండి. అత్తగార్ని తీసుకెడతాను."
మావ దారికడ్డం తొలిగి సత్యం మొహంవేపు సీరియస్ గా చూసి అన్నాడు-
"తీసుకెడతావా? తీసుకెళ్ళు అదుగో ఆవిడ..." అంటూ గోడమీద చూపించాడు.
అది అత్తగారి ఫోటో. ఆ ఫోటోకి దండవేసి వుంది. ఆ బొమ్మని చూసి ఒకడుగు వెనక్కి వేశాడు సత్యం.
"కడుపున పుట్టిన బిడ్డే దాని ప్రాణాలు తీసింది. కన్నకూతురు లేచిపోవడం కళ్ళారా చూసిన ఏ తల్లి మాత్రం బతికుంటుంది? తీసుకెళ్ళు. ఆ ఫోటోని తీసుకెళ్ళి దాని మొహానకొట్టు. పో..."
అని యింకా ఏవేవో అరుస్తూనేవున్నాడు మావ.
సత్యం హాస్పిటల్లో అడుగు పెట్టగానే నర్సు ఎదురైంది.
"మగబిడ్డ" అన్నదామె.
సత్యం మాటాడబోతుండగా నర్సే అన్నది...
"కానీ-తల్లిప్రాణం ... ... ..."
ఏం చెబుతుందో ఏం వినాలో నన్న ఆందోళనతో నర్సు చెప్పేమాట వినిపించుకోకుండానే 'సుభద్రా' అంటూ గదిలోకి అడుగు పెట్టాడు.
నర్సు చెప్పినట్టు సుభద్ర చివరి క్షణాల్లోనే వుంది. చిరునవ్వు మాత్రం చెరిగిపోలేదు. భర్తని చూడగానే మొహం ప్రకాశవంతమైంది.
భర్తతో పాటు యింకా ఎవరెవరు వచ్చేరో చూడాలనే ప్రయత్నంలో లేచి కూచోబోయింది.
కాని ఆ ప్రయత్నం వీలుకాలేదు.
సత్యం ఆమె పక్కనే కూచున్నాడు. సుభద్ర చేతుల్ని తీసుకున్నాడు. బాబువేపు చూడమన్నట్టు సైగ చేసింది సుభద్ర. సత్యం చూసేడు.
"గోపాలకిష్ణుడండీ! కనీసం వీడ్ని చూసేందుకైనా అమ్మా నాన్నా వస్తారనుకున్నాను" అన్నదామె భారంగా బరువుగా.
"సుభద్రా!" అన్నాడతను బాధగా.
"ఇంతకీ వాళ్ళేమన్నారు? నన్ను తిట్టిపోసేరా? మిమ్మల్ని అవమానించి పొమ్మన్నారా?... ఏవండి...మాటాడరే?"
"సుభద్రా!"
