Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 3


    "ఊహుఁ పెళ్ళి చేసినందుకు. అన్న కూతురని మురిసిపోయి తెచ్చుకున్నావుగా. అది తెగ నీల్గుతోంది. చూస్తూ చూస్తూ వుండండి. నాకు విసుగు పుట్టిందంటే ఏం చేస్తానో తెలుసా? ఏదో ఒకరోజు దానికి విడాకులిచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను." దురుసుగా అనేశాడు.

    "అది మేం బ్రతికుండగా జరగదురా."

    "ఎందుకు జరగదు. నేను సుఖంగా బ్రతకాలని లేదా మీకు? నేను అత్తారింటి అల్లుడిలాగా అక్కడికి ట్రాన్స్ ఫర్ చేసుకుని నీ మేనకోడలికి కాళ్ళకి మడుగువొత్తుథూ వుండాలట. నేనేమన్నా గాజులు తొడుక్కుని కూర్చున్నానని అనుకుందేమో?" రోషంగా అన్నాడు.

    "నువ్వు నోర్మూసుకోరా ముందు! నేవెళ్ళి పిలుచుని వస్తాను. అది రాదో దాని నాయన పంపడో చూస్తాను. దాని తలలో జేజిమ్మ దిగిరావాలి.

    "అమ్మా! ఎందుకీ ప్రయత్నాలు. వాళ్ళకి బాగా పొగరు! పైగా నువ్విచ్చిన అలుసు. కాస్త శాంతంగా ఎమ్.ఏ. యింప్రూవ్ మెంటుకి కట్టి క్లాసు తెచ్చుకుని లెక్చరర్ నన్నా అవుదామంటే ఈ కొంపలో ఎప్పుడూ గొడవలే! ఛ! ఛ! దరిద్రపు కొంప_"

    "కొంపా గోరీ అంటూ ఏం అర్ధ అనాచారపు మాటలురా అవి! ఎంత మాట నోటికి వస్తే అంతమాట అనెయ్యడమేనా? ఎందుకురా నీ చదువు? సంస్కారం ఇవ్వని చదువు."

    "మళ్ళీ నీతులు చెపుదువు. నేనూ తీరిగ్గా నేర్చుకుంటాను కానీ_ ముందు అన్నం పెట్టు. చెప్పటానికి ఎన్నయినా మాటలు చెప్పొచ్చు."

    ఉస్సురని నిట్టూర్చిందామె. హితోపదేశాలు తలకెక్కించుకుని బాగుపడే రకంకాదు. కొడుకని ఆమెకి బాగా తెలుసు. అయినా ఏదో ఆశ మనసుని పీడిస్తుంది.

    "అత్తయ్యా!" అంటూ పిలిచింది స్వాతి. ఆమె రెండో కోడలు. కోదండరాం చనిపోయినా ఆమె అత్తవారింట్లోనే వుంది. బి.ఏ. పాసైనా వుద్యోగాల జోలికి వెళ్ళకుండా ఇంట్లోనే ట్యూషన్స్ చెబుతూ వేనీళ్ళకి చనీళ్ళలాగా సంపాదిస్తూ వుంది. ఇంట్లో ఎక్కడుందో ఆమెకై ఆమె కనిపిస్తే తప్ప తెలియనంత నెమ్మదస్తురాలు. నిత్యం కావ్య పఠనంతో, గతస్మృతుల్లో విహరించటంలో గడిచిపోతుందామెకు.

    "ఏమ్మా!"...ఆమెతో మాట్లాడాలంటే బాధగా వుంటుంది పార్వతికి. చిన్న వయసులో భర్తను పోగొట్టుకుని  అన్ని సౌఖ్యాలకు దూరమై విరాగిణిలా బ్రతుకుతున్న కోడల్ని చూస్తే ఆమె గుండె బరువెక్కిపోతుంది.

    "బావగారి స్కూలులో చదివే కుర్రాడొచ్చాడు. వాళ్ళ సమితి ప్రెసిడెంటుని ఎవరో ఖూనీ చేశారుట అందుకని ఈ రోజూ రేపు బడి మూసేశారట" బావగారికి విషయం చెప్పాలని వచ్చి చెప్పి వెళ్ళిపోయిందామె.

    "అయ్యో!" అని బయటికి వచ్చి చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడు దాశరధి.

    "అడగ్గానే అన్నం పెట్టానుగాను పాపిష్టిదాన్ని!" అనుకుందా మాతృ హృదయం.

    ఇద్దరికీ కంచాలు పెట్టింది జ్యోతి. ఏమీ మాట్లాడకుండా వడ్డించింది పార్వతి. జ్యోతికి టైపింగ్ తెలుసు. భర్తతోబాటే తాలూకాఫీసుకి వెళ్ళి బయటే మిషన్ పెట్టుకుని పిటీషన్ లు, అర్జీలు, అప్లికేషన్స్ టైప్ చేస్తుంది. మంచి డ్రాఫ్టింగ్ నాలెడ్జి కూడా వుంది. ఆమె పుట్టిల్లు ఆ వూరే! తల్లీదండ్రి అవతల పేటలో వుంటున్నారు. ఆయన రిటైర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. పేరుకి ఆఫీసరే కానీ గ్రేడు గుమాస్తా గ్రేడ్! ఆయనకి ఇద్దరే పిల్లలు. జ్యోతి, సుధాకర్.

    అయన ఎంతో కష్టపడి కొడుకుని మెడిసన్ చదివించారు. అతగాడు స్టేట్స్ వెళ్ళిపోయాడు. అక్కడే ఎలిజిబెత్ అనే డాక్టర్ని పెళ్ళిచేసుకుని పౌరసత్వం తీసుకుని సెటిలయిపోయాడు. కుమారుడిమీద మమకారంతో యిండియాకి వచ్చేయమని చాలాసార్లు రాశారాయన. దానికి జవాబుగా యిండియాని, తెలుగుదేశాన్ని తిడుతూ జవాబు రాశాడు.

    "ఈ ముసలితనంలో మాగతి ఎలా అనుకుంటున్నావ్? పోనీ మేమూ స్టేట్స్ కి వచ్చేస్తాము. చార్జీలకి పంపించు. ఇక్కడ వున్నదంతా నీ చదువుకోసం, నీ అభివృద్ధికోసం దోచిపెట్టేశాము. మాకేం మిగలలేదు. మా గతి ఏమిటి?" అని రాస్తే... ఘాటుగా జవాబు రాశాడతను.

    "ఇదే మనదేశంలో దౌర్భాగ్యం! కొడుకుని కని చదివించి వాడి సంపాదన ఆశిస్తారు. అదొక పెట్టుబడిలాగ కట్నం లాగుతారు. ఫిక్స్ డ్ డిపాజిట్ పై వడ్డీకి ఆశపడ్డట్టుగా కొడుకు తమని పోషించాలనుకుంటారు. అది చాలా అసహ్యం! పిల్లలు పెరగ్గానే వాళ్ళను వొదిలెయ్యాలి. వాళ్ళపై తాముకానీ, తమపై వాళ్ళుకానీ ఆధారపడకూడదు__

    ఇక్కడికి వస్తామని రాశారు. ఇదేం మంగినపూడి నుంచి మచిలీపట్నం రావడమనుకున్నారా? ఒక్కొక్కరికి వేలరూపాయల టిక్కెట్టవుతుంది. నేను మీపైన అంత ఖర్చు చేయలేను. ఒక వేళ దయతలచి ఖర్చు చేసినా వచ్చి మీరేం చేస్తారు?

    ముసలితనంలో యీ వాతావరణం మీకు పట్టదు. పైగా అత్తమామలకి సేవచేయటానికి ఎలిజబెత్ ఎల్లమ్మ కాదు. ఆమె డాక్టర్! ఇండిపెండెంట్ వూహలున్న వ్యక్తి. మీరిక్కడికి వచ్చినా "ఓల్డుహోం"లో వుండాలి. కష్టపడి సంపాదించినంత తిండి పెడతారు. ఆపైన మీ యిష్టం."

    కొడుకు సుదీర్ఘమైన లేఖ చదువుకున్న ఆ పితృ హృదయం కోపంతో మండిపోయింది. అతని జాబుల్ని, పొటోలనీ గుర్తుకువచ్చే వస్తువులన్నీ తగలేశాడు. "నాకు కొడుకు పుట్టలేదనుకుంటాను. పుట్టినా చచ్చాడనుకుంటాను. వాడికి తిధివారాలు లెక్కబెడతాను" అంటూ రంకె వేశాడు.

    "నాన్నా! వ్యర్ధమైన ఆవేశంతో, కోపంతో ఫలితం లేదు. వాడికి తిధివారాలు చేస్తే ఆ డబ్బు దండగ మనకే! మీరేం భయపడకండి_ నేనున్నాను. కొడుకైనా కూతుర్నయినా నేనే. మీ అల్లుడుగారు కూడా మంచివారు. ఈ రోజునుంచీ నేను మీకోసం కష్టపడతాను. టైప్ చేసి సంపాదించి మీకిస్తాను. మీరు చెప్పించిన చదువు మీకే ఉపయోగపడాలి" అంది జ్యోతి. భార్యమాటల్ని బలపరిచాడు జానకిరాం. నిజానికి బలపరచక చేసేదికూడా లేదు.

    మొదటిరోజు తండ్రి టైపురైటర్ పట్టుకొని ఆమె ఆఫీసుకి బయలుదేరబోతుంటే పెద్ద గొడవే జరిగింది. ఏదో మీరేం మాటాడినా మేం వేరు కాపురం పెట్టాల్సిందే! అట్టేమాటాడితే మా యింటికే వెళ్ళిపోతాం. వాడు బాధ్యతలు తెలియకుండా, పట్టించుకోకుండా పారిపోయాడు. నేనూ నా దారి చూసుకుంటే అమ్మానాన్నల గతి ఏం కావాలి?" అంది ఆవేశంగా.

    శాస్త్రిగారు భార్యని మందలించారు. ఆయనకు వియ్యంకుడంటే జాలి అభిమానం. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS