"ఏమిటి ఈ మధ్య బొత్తిగా మీ దర్శనాలు తక్కువైపోయాయి."
లోకనాథం అన్నాడు___
"వంట్లో సుస్తీగాని చేయలేదు గదా?"
నరసయ్య సమాధానం చెప్పబోయాడు గానీ, రామదాసు కళ్ళతో హెచ్చరించగా నోరుమూసుక్కూచున్నాడు.
"నాకేం బావా నిక్షేపంగా వున్నాను. ఎండలు గదూ కొంచెం నలిగేను. అంతే!" అన్నాడు రామదాసు.
"అవును బావా! చెడ్డమండిపోతున్నాయి ఎండలు!" అన్నాడు లోకనాథం.
"గత పదేళ్ళుగా ఇంతోటి ఎండల్ని నేనెరుగనంటే నమ్మండి!" అన్నాడు సత్రకాయ పెద్ద.
"చోద్యం కాకపోతే ఎండలింత మండిపోవడమేమిటిప్పుడు మరీనూ...." అన్నాడు రెండో పెద్ద.
"మీ ఎండలు తగలడిపోనూ_ వచ్చిన పని మరిచిపోయి వచ్చీ రావడంతోటే ఎండల్నెత్తుకున్నారేమిటయ్యా బాబు!" అన్నాడు వళ్ళు మండిపోయి కనకం.
"అయితే, మీ రాకకి కారణ మేమిటో చెప్పండి. దాచడమెందుకు?" అన్నాడు రామదాసు.
"ఏమీలేదు బావా! మొన్నీమధ్యనూ ఆడంగులు విజయనగరం వెళ్ళేరు. అక్కడికి మహానుభావుడు స్వామి విశేషానందులొచ్చి గొప్ప ఉపదేశం చేశారుట, గమ్మత్తేమిటంటే ఈ స్వామి బొత్తిగా కుర్ర స్వామిట. ఎంతో అందగాడుట. మా ఆడంగులు తిరిగి యింటికొచ్చిన దగ్గిర్నుంచీ ఆ స్వామిని మన తిమ్మాపురానికి పిలిపించవలసిందిగా నా ప్రాణం తీసేస్తోందనుకో! చెప్పొద్దూ___నేను ఉపప్రభువైన దగ్గిర్నుంచీ ఎవరో ఒక స్వామిని పిలిపించుకుని ఉపదేశం పొందుదామని గొప్ప ముచ్చటగా వుంది. బావగారంత స్టేటస్ నాకు ఎట్లాగూలేదు. అందుచేత వారంత ఘనంగా కాకపోయినా, నాచేతనైనంతలో నేనూ ఒక స్వామికి సత్కారం చేసి ముచ్చట తీర్చుకుందామని ఉద్దేశం. కనకాన్ని అడిగేను. కుర్రస్వామి గురించి చెప్పాను. బావని గూడ కనుక్కుని ఏర్పాటు చేద్దామని కనకం అన్నాడు. అందుచేత వచ్చేం." అన్నాడు లోకనాథం.
రామదాసు చాలా ఖచ్చితంగా అనేశాడు.
"మొన్నేగా స్వామీజీ వచ్చి వెళ్లాడు. మళ్ళా ఈ కుర్రస్వామి ఎందుకు చెప్పు? ఈ స్వాములొచ్చి వెళ్లే ప్రతిసారీ గుళ్ళు కట్టించుకోడమంటే చిరాగ్గా వుందోయ్ బావా? నువ్వూ ఆలోచించు."
లోకనాథం వెంటనే సమాధానమిచ్చాడు: "చెప్పడం మరిచాను. ఈ స్వామికి అట్లాంటి పట్టింపుల్లేవుట. గుళ్ళు కొట్టించుకునే అవస్థ మనకుండదు. ఎంచక్క క్రాపులే వుంచుకోవచ్చు. వంటి నెట్లాంటి గుడ్డలున్నా పర్లేదుట. నాక్కావలసింది మీ మనసులేగాని మీ వేషాలు కావు; అన్నారుట. వారుగూడ ఎంతో సాధారణంగా మనందరిలాగ వుంటార్ట!"
"చంపావ్ ఫో! పాపం, ఈ స్వామి ఎవడోగాని ప్రజల్లో పెద్ద డిమాండ్ సంపాదించుకోలేడు. ఏమంటే___చక్కగా గుళ్ళు కొట్టించుకుని, స్నానంచేసి, విభూతి పెట్టుకుని? మడిగట్టుకుని స్వామిని దర్శించే ఏర్పాట్లలో వున్న 'విలువ,' ఏదో సినిమా కెళ్ళినట్టు మైల బట్టల్తో, వాసన గొట్టే వంటితో స్వామిని దర్శించడంలో ఎక్కడుంటుంది చెప్పు?" ఏమంటావ్?
"ఆ....అదంతా నీ పిచ్చిగాని బావా! స్వామి స్వామే! జవాబివ్వవలసినది స్వామిగాని ఆచారాలు కావు గదా. అయినా, అవన్నీ నా కొదిలేయ్ నేను నరుక్కొస్తానుగా.
"అవును లోకం బావా! దీనివల్ల నువ్వు సాధించే ప్రయోజనమేమిటో చెప్పు వింటాను." అన్నాడు రామదాసు.
లోకనాథం ఆ ప్రశ్నకి అదిరిపోయాడు. కనకాన్నీ, మిగిలిన యిద్దరు పెద్దల్నీ గబగబా చూశాడు. వాళ్ళ మొహాల్లోనూ ఆశ్చర్యం తాండవించడంతో, లోకనాథం ధైర్యంచేసి అడిగాడు రామదాసుని___
"అయితే బావా నువ్వూ సాముల్ని పిలిపించుకున్నావు గదా, వాళ్ళొచ్చినందువల్ల నువ్వేం సాధించావు?"
అంత ప్రశ్న అంత సూటిగా వచ్చినందుకు రామదాసు మినహా మిగతా వాళ్ళంతా విని భయపడ్డారు.
రామదాసు ఆ తిక్క ప్రశ్నని చాలా సుళువుగా తీసుకుని నిజాన్ని నిర్భయంగా చెప్పారు____
"నేను పురప్రభువుని బావా! మీ అందరికీ ప్రభున్నేను. మీ బాగోగుల యందూ, మీ అభిరుచులందూ, మీ కష్ట సుఖాలయందూ శ్రద్ధగలవాడినని బోర్డు కట్టుకున్నాను. మీకేం కావాలో, మీకేం యిష్టమో తెలుసుకుని అవి మీకు ఏర్పాటు చేస్తే పది కాలాలపాటు మీ అందరి అభిమానాన్నీ వింటూ నా ఉనికిని నేను కాపాడుకుంటాను. అందుచేత....మీరు స్వాముల్ని కావాలన్నారు గనుక ఏడాదికో సోమరిపోతుని వెతికి పట్టుకొచ్చేసి, గుండు చేసుకున్నాను. మహాభక్తుడి పోజుపెట్టి, విభూతి మొహాన్ని రాసుకున్నాను. మీకు నేనెలా వుంటే నచ్చుతానో అక్షరాలా అలా వుండి డాన్స్ చేశాను. అందువల్లనే నేనింకా మీ అందరికీ ప్రభువుగా చలామణి అవుతున్నాను. ఇదీ నేను సాధించింది. అయితే, నువ్వు కూడా యిదే ఆశిస్తున్నావా?"
లోకనాథం, రామదాసుల మినహాయించి మిగతా వాళ్ళంతా ఒక పెద్ద అఘాతంలో పడిపోతున్నట్టు భ్రమపడుతున్నారు.
లోకనాథం తొణక్కుండా అనేశాడు.
"అవును బావా! సరిగ్గా నేనూ యిదే ఆశిస్తున్నాను. నీ తర్వాత నేనే ప్రభువుని, ఉపప్రభువుని. నువ్వది మరిచిపోకూడదు."
రామదాసు నవ్వి అన్నాడు_
"మరిచిపోను. మరిచిపోయే ప్రమాదం జరగదు. మనం ఇలాంటి తప్పుడు పనులు చాలా చేయాలి. నిజమే! కాని బావా, మన తెలివిని అలా వుంచి___ఇంకోపక్క, మన తెలివివల్ల ఏం జరుగుతూందో తెలుసా? ఈ తిమ్మాపురంలో బద్దకస్తుల్ని తయారు చేస్తున్నాం. ఎక్కణ్ణుంచో దిగుమతి చేసుకుంటూన్న సోమరిపోతులను అందలాలెక్కించి వీళ్ళలో అహంకారాన్ని నింపుతున్నాం. వాళ్ళకి దండలేయడం, భజన చేయడం ఆపకపోతే బావా దేశంలో స్వాముల సమాఖ్య పెరిగి సామాన్యుల సమాఖ్య తగ్గిపోతుందేమోనని నా భయం! ఇప్పటికీ మన ముచ్చట తగ్గకపోతే, దీనికో చిట్కా చెబుతా విను. ఎక్కడ్నుంచో ఎవరో స్వాముల్ని తీసుకొచ్చి మేపడమెందుకుగానీ_ మనూళ్ళో మనుషుల్నే వెతుకు. మన సొమ్ము మనూళ్ళోనే ఉంటుంది. మన చెప్పుచేతల్లో వుండి మనకెదురాడని మనిషిని పట్టుకో. వాడికి గుండు కొట్టించు కాషాయవస్త్రాలు తొడిగించు. కమండలం వగైరా సామాగ్రి సంపాయించి యివ్వు. జై శంకర్!___అనడం నేర్పు. అస్తమానం కళ్ళు మూసుకోడం మంచిదను. సాధ్యమైనంతవరకూ నోరు మూసుక్కోచోమను. నోరు విప్పితే రాముడూ దేవుడూలాంటి శబ్దాలొచ్చేట్టు ట్రైనింగివ్వు. ఒక్క సంవత్సరం చాలు_ మనూళ్ళో తయారైన స్వామి దేశాన్ని ఏలేస్తాడు. నీకా భయమొద్దు_ ముందు మనిషిని వెతుకు. అన్నట్టు ఎవడో ఎందుకు? మన నరసయ్య చాలు. తయారుచేసే నేర్పే వుంటే ఆరు నెలలలో నరసయానంద స్వాములయిపోడూ? ఏమంటావ్?" అని యింకా నవ్వుతూనే వున్నారు.
