ఆ రాత్రే జయన్న సోము కలిసి ఆ వ్యవహారం విషయం మాట్లాడుకున్నారు.
"తలుకాఫీసుకి వెళదాం. అక్కడ కనుకుంద్దాం. పట్టా వచ్చి వుంటే పాసుబుక్కు యిమ్మని అడుగుదాం. అప్పుడు యీ ఫేనాల్టీ తగ్గిపోతుంది."
"వాళ్ళయినా మనకి పలుకుతారా?"
"బాగా పలుకుతారు. నా ఫ్రెండ్ ఒకడున్నాడు?"
"ఎప్పుడు వెళదాం?"
"ఎప్పుడో ఎందుకు. రేపే! నాకు సమితి ఆఫీసులో పని వుంది.!"
నిట్టూర్చి వెళ్ళిపోయాడు సోము.
17
హటాత్తుగా పిడుగులా దిగబడ్డాడు జనార్ధన్ పట్టుకెళ్ళిందంతా గోవింద కొట్టించేశాక తిరిగి రావడం అతనికి అలవాటే.
తమ్ముడిని చూసిన చౌదరి ముఖం గంటు పెట్టుకుని పలుకరించలేదు. జనార్ధన్ ని వదిన కూడా పలుకరించలేదు.
అయితే జనార్ధన్ తనే పలుకరించాడు ఆమెని. అన్నని పలుకరించే ధైర్యం లేకపోయినా వదినని పలుకరించే చనువు వుంది అతనికి.
"నన్ను క్షమించండి వదినా! నేను తప్పు చేశాను.
ఆమె సమాధానం యివ్వలేదు.
"ఆకలేస్తోంది వదినా!" దీనంగా అడిగాడు.
ఆ మాటలకి కరిగిపోయిందామె, అయినా కదల్లేదు.
"టిఫిన్ లేకపోతే మాన్లె, ముందుగా యింత కాఫీ యిచ్చి, అనక అన్నం పెట్టు, చద్ది మిగల్లేదా!"
తరతరలాడిపోయింది అచ్చమాంబ. ఆమె మాతృహృదయం నిలువలేకపోయింది. బాబూ! కాళ్ళు కడుక్కుని రా!" అంది.
"వదినా! మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ చనిపోయిందనే ఆలోచనే రాకుండా పెంచావు నన్ను, నిన్ను అమ్మగా అనుకున్నాను. నీలో అమ్మను చూసుకున్నాను. నీవు అమ్మవే అనుకున్నాను. " కాలే యినుముపై సమ్మెట దెబ్బ తీస్తుందని అతనికీ తెలుసు.
ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంతలేసి మాటలు వినటానికి ఆమెకి కొత్త. ఆ భాష మరీ కొత్త. అయినా ఆ భావం ఆమెని కదిలించి వేసింది, జలజలా రాల్చింది కన్నీరు.
కాళ్ళు కడుక్కుని వచ్చాడు జనార్ధన్.
పళ్ళెంలో లాడ్డుండలు, కాజ్జికాయలు, కారప్పూస, వడ్డించిందామె.
ఆప్యాయంగా తినసాగాడతాను. ఆకలి తగ్గిందనిపించాడు.
మళ్ళీ అన్నాడు "వదినా! మీ అందరి దృష్టిలో నేను అప్రయోజకుడిని. దుర్వసనాలకు లోనయిన వాడిని. మీరలా అనుకోవడంలో తప్పు లేదు. ఇన్నాళ్ళూ నేనలాగే తిరిగాను.
"ఇప్పుడదంతా ఎందుకు లేవయ్యా!"
"అదికాదోదినా! మనకి బోలేడంతా వుంది. నువ్వే చెప్పావుగా అన్నయ్య బీరువా అరనిండా డబ్బుందని. అయినా మనిషికి తను సంపాదించుకుంటేనే గానీ తృప్తి వుండదు!"
"ఇదంతా నీ కోసమే జనా! మా ఆశ, మా ప్రాణం అంతా నువ్వే!"
"అందుకే నేనూ సంపాదించాలని వెళ్లాను."
"పోన్లే పొతే పోయింది. మీ అన్నావాళ్ళు ఎట్లాగు సర్దుకున్నారు."
అతని కళ్ళు ఆశాజ్యోతులయ్యాయి.
"ఇప్పుడు ఆ డబ్బు పెట్టి ఓ సినిమా తీస్తున్నా వదినా!
ఆమె ఏమీ అనలేదు. మౌనం వహించింది.
ఆడవాళ్ళకి డబ్బు ఐశ్వర్యం అది తెచ్చే హోదా భోగం వీటిపై మనస్సు వుంటుంది. ఎన్ని చెప్పినా ఆ లక్షణం మాత్రం తగ్గదు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఆ ఆశ కతీతులుగా వుంటారు.
"ఇప్పుడది కొంతదాకా అయింది."
"ఇంకా డబ్బు కావాల్నా?"
"ఆ అన్నయ్య నడిగితే యివ్వడు."
"నేను యివ్వలేను. జనా మనకు ఆ డబ్బెందుకు . అది పొతే పోనీ - మనది కాదనుకుందాం. మనిషి ముఖ్యం గానీ డబ్బు ముఖ్యం కాదు. ఏ పాపం శాపం వల్లో నాకు మగబిడ్డ ల్లేరు. నువ్వు పెళ్ళి చేసుకుంటే నీ కడుపున ఓ కాయ కాస్తే అదే పదివేలు."
