Previous Page Next Page 
రాగోదయం పేజి 38

 

    మరో పది నిమిషాలకి జానయ్య వచ్చేడు.
    "జానయ్య మళ్ళీ ఫేనాల్టీ పడిందిరా!"
    అడిరిపోయాడు జానయ్య. "పట్టా రాలేదా అయ్యా!"
    చిద్విలాసంగా నవ్వేడు కరణం. "ఒరే పట్టా అంత సులభంగా వస్తుందా? ఎకరం రెండువేలుంది మెట్ట పొలం. అలాటిది వూరికే వచ్చేసింది నీకు. మాకు, సర్వేరుకు, ఆర్. ఐ కీ తాసీల్దారుకు గుమాస్తాలకు తలా యింతా ముట్ట జెప్పెదాకా పట్టా ఎట్లా వస్తుంది? నువ్వేమో ఎప్పుడూ బీద ఏడ్పులు ఏడుస్తావు?"
    "మీకు తెలియందేముంది సామీ! తిండికే జరగదు!"
    "అట్లంటే ఎట్లా! ఇట్లా ఎన్నేళ్ళు?"
    నిట్టూర్చాడు జానయ్య.
    "సర్లే డబ్బులు తెచ్చినావా?"
    "ఎంతసామీ?"
    "మామూలే! ఏటా యిస్తూ వుండలా?"
    "ఇప్పుడు తేవాలా సామీ?"
    రుద్రుడయ్యాడు శేషయ్య. "కరణం పిలిపిస్తే ముచట్లు చెప్పటానికి పిలిచాడనుకున్నావా? నువ్వేం బామ్మర్దివా? మేనల్లుడివా? చుట్టంలా చూట్టానికి రావటానికి. తలారి వస్తే పన్ను కోసమో ఫేనాల్టీ కోసమో నని తెలియదూ? ఊరికే వచ్చావా బుద్దీలేదూ?"
    జానయ్య మాటాడలేదు.
    "పో! తీస్కోరాపో!"
    "డబ్బు లేదండీ?"
    ఉగ్రుడయ్యాడు కరణం! "లేవూ మొన్నవచ్చిన లోను డబ్బు ఏమైందిరా! తాగి తందనాలాడినావా? పేక ముక్కల్లో పోయిందా? ముండలకి పెట్టినావా?"
    "మాకు ఆ అలవాట్లు లేవు లెండి." అప్పుడే వచ్చిన సోము అన్న మాటలకి ఉలికి పడ్డాడు శేషయ్య.
    "అయ్ ఏం కూశావ్! మీకు లేకపోతే నాకున్నాయనా అర్ధం! నాలుక చీలుస్తా! జాగ్రత్త!"
    "హు?"
    "ఏంట్రా! ఏంటి? ఏమిటా నీ గుండె బిగవు? ఏమి చూసుకునిరా ఆ ధైర్యం!" చేమ్డాలు తీయిస్తా జాగ్రత్తా"
    "నాయనా పోదాంరా?"
    "జానయ్య ఫేనాల్టీ కట్టకపోతే సాగుచేసుకునే వీల్లేదు. తలార్లను పంపిస్తా. అక్కడికి వినకపోతే పోలీసులు వస్తారు."
    "ఫేనాల్టీ ఎంతండీ?" అడిగాడు సోము.
    "ఏం కడతావా?"
    "అవసరమయితే!"
    "అంటే?"
    "పట్టా రాకుంటే కడతాం?"
    "రాలేదని చెపుతున్నాగా! పన్నుకి అయిదురెట్లు వేశారు. అంటే ఇరవై రూపాయలు అవుతుంది."
    క్షణం ఆలోచించాడు సోము, "వీళ్ళు రికార్డు చూపరు. ఇప్పుడు డబ్బు చెల్లించకపోతే గలాభా- రభస. అయినా తప్పదు. ఈసార్కి చెల్లించి తాలూకాఫీసుకు వెళ్ళి కనుక్కుంటే సరి!" వెంటనే జేబులోంచి తీసియిచ్చాడు.
    దాన్ని చూడగానే అతని ముఖం వెలిగిపోయింది.
    "పొండిరా! పొండి! వెళ్లి బాగా లాయకీ చేసుకోండి. పంట బాగా పందించండి. పన్నెం అవుతుంది. ఈ ఏడాదికి కాకపోతే వచ్చే సంవత్సరానికి పట్టా వస్తుంది."
    జానయ్య నమస్కారం చేశాడు.
    అంతలో యింకో రైతు రావటంతో "వస్తాం బాబూ!" అన్నాడు జానయ్య.
    "రసీదు యిస్తారా?" అడిగాడు సోము.
    ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకున్నాయి. సోము వైపు విచిత్రంగా చూసి "కొత్త బుద్దులు పుట్టుకొస్తున్నాయి." అన్నాడు హేళనగా.
    "రసీదు యివ్వరు. లెక్కలో రాసుకుంటారు, మళ్ళా ఎప్పుడో రసీదు యిస్తాడు మునసుబు. పోదాం పద!" అన్నాడు జానయ్య.
    రగులుతున్న అగ్ని పర్వతంలా వెళ్ళాడు సోము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS