హతాశురాలైంది వారుణి "రధీ_" అంది జాలిగా.
"మన హిందూ కుటుంబాల ఉమ్మడితనం గురించి తెలియదా నీకు? పైకి కలిసివుంటారు. అందరికీ వేరుపడాలనే వుంటుంది. ఎవరంతకి వాళ్ళు బ్రతకాలనే వుంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్చ వుండదనీ, తమకి ప్రత్యేకత వుండదనీ అనుకుంటూనే తమకి గదులు ప్రత్యేకం కావాలనీ, తమ కోరికలు తీరాలని కోరుతూనే కలిసివుంటారు. ఎప్పుడో హఠాత్తుగా వేరుపడిపోతారు."
నివ్వెరపోయి వింటోంది వారుణి.
"వదినకి వేరు కాపురం పెట్టాలని వుంది. ఫణితో ఎప్పుడూ ఆ విషయమై పోట్టాడుతూనే వుంటుంది. కానీ ఆమె మాట చెల్లుబాటు కావటంలేదు."
"వేరుపడాలని వుందా?
"ఆఁ! అందుకే శతవిధాలా యత్నిస్తుంది. ఇప్పుడు నువ్వేమయినా అంటే అదంతా నీ పైకి వస్తుంది."
"రధీ_" బాధగా పిలిచింది.
"ఇదంతా అర్థంచేసుకో_ అసలే నువ్వు కట్నం తేలేదని, జీతం తనకి యివ్వలేదనీ అమ్మకి కోపంగా వుంది."
"పదేపదే కట్నం మాట ఎత్తుతావేం నువ్వు? నీకు ముందే చెప్పలా?"
"అవుననుకో. అయినా మీ నాన్న పదివేలు బ్యాంక్ లో వేశారట కదా! అది ఆమె ముఖాన వేద్దాం అంటే వినవుకదా!"
"ఆ డబ్బు నాకు వద్దని రాశాను."
"ఆఁ" ఆశ్చర్యపోయాడు సారధి.
"రధీ_ నాకు నాన్నగారి డబ్బు పైసా అక్కర్లేదు. నీ గురించి ఆయనతో చాలా గొప్పగా చెప్పాను. నువ్వు మామూలు అందరి మగాళ్ళలాంటివాడివి కాదనీ, నా కోసమే జన్మించావనీ, నీకు ప్రేమ మాత్రం చాలుననీ, నా కట్నం, నా జీతం ఏదీ ఆశించవనీ చెప్పాను. అవన్నీ కల్లలని యిప్పుడే రుజూచెయ్యకు."
అతనేం మాటాళ్ళేదు కొద్దిసేపు. "చిన్నా! ఆ ఉత్తరం రాసేముందు నాతో ఒక్కమాట ఆలోచించి వుండవలసింది" అన్నాడు.
"ఏం ఆ పదివేలూ లేకపోతే బతకలేమా?"
"చిన్నా! డబ్బు డబ్బే! అదెంతగా వుంటే మనకంత విలువ!"
"రధీ! నువ్వు యిన్నేళ్ళుగా లెక్చరర్ గా చేస్తున్నావు? ఎంత వెనకేసే వేమిటి?" సూటిగా ప్రశ్నించింది. అది నీ స్వార్జితం కదా! నీకూ కుటుంబం ఏర్పడుతుంది. ఉమ్మడి కుటుంబానికి ఆ డబ్బు అవసరం లేదు! మరి అంతా మామగారి చేతికిచ్చావేం? నీ పేర దాచుకోలేదేం? రధీ_ మన మధ్య తరగతి కుటుంబాలన్నీ యింతే. ముందుచూపు లేక చిక్కుల్లో పడిపోతాయి." తన మనసులోని మాట సూటిగా చెప్పింది వారుణి.
అతను లేచాడు.
"ఎక్కడికి?"
"పిక్చర్ కి."
"ఇప్పుడా? సెకండ్ షోకా?"
"అవును." షర్ట్ వేసుకుంటూ అన్నాడు. జేబులో పర్స్ వేసుకున్నాడు. చెప్పులు వేసుకున్నాడు. తలుపు వైపు కదిలాడు.
"రధీ_నేనూ వస్తాను. మనం కలసి ఒక్క సినిమా కూడా చూళ్ళేదు. ఈ రోజు యిలా వెళ్ళిపోవద్దు." నోటిదాకా వచ్చిన మాటలు గొంతులోనే ఆగి గుండెల్లోకి వెళ్ళిపోయి ఆరని మంటలని రగిల్చాయి.
అతను వెళ్ళిపోయాడు.
అలాగే చూస్తూ వుండిపోయింది. అప్పుడు గుర్తుకొచ్చింది ఆ పూట తను భోజనం చెయ్యలేదని. తనేనా? అందరూ చెయ్యలేదా? రధి భోంచేసి వెళ్ళేడా? బావ, మామగారు, అత్తయ్య, ఆడబిడ్డ, అక్క, ఆమె కూతురు. వారుణి మనస్సంతా విషం తిన్నట్టుగా అయిపోయింది.
18
వారం రోజులు గడిచిపోయాయి. ఇంట్లో శీతలయుద్ధం జరుగుతున్నట్టుగా వుంది. ఎవరూ ఎవరినీ ఆప్యాయంగా పలుకరించుకోవటం లేదు.
