Previous Page Next Page 
నేను పేజి 38


    అతన్నలా చూస్తోంటే లోపల్నుంచి 'ప్రేమ'.... దాన్ని ఆ పేరుతోనే పిలుస్తాను.... పొంగి పొర్లి వస్తోంది.


    క్షణాల్లో ఉద్భవించిన ఆ మధుర తరంగాల ప్రాముఖ్యత ఎంత అనంతమైనది.   


    నేను నాలోంచి జారిపోతున్నాను. నాకు తెలీని ఇంకో నేను కనిపిస్తోంది.


    అప్రయత్నంగా ముందుకు జరిగాను.


    అతనికి చాలా దగ్గరగా వచ్చానన్నమాట.


    మంచం మీద మధ్యకి పడుకోవటం వల్ల ప్రక్కనింకా చాలా ఖాళీ ఉంది.


    దగ్గరకు చేరి అంచున కూర్చుని, ప్రక్కకి వాల్చి  ఉన్న అతని ముఖంలోకే చూస్తున్నాను.     


    నా కురులింకా విచ్చుకునే ఉన్నాయి.


    నిద్రలో అనేక దశలుంటాయి. ఒక దశలో బయటి వాతావరణం లీలగా తెలుస్తూ ఉంటుంది.


    అందమైన ఉలికిపాటుతో అతను కళ్ళు విప్పాడు.


    నేనంత చేరువలో ఉండటం అతనికి చాలా సంతోషాన్ని కలిగించి ఉంటుంది.


    "సుకుమార్" అని పిలిచాను.


    'ఊ' అంటూ నావైపు తిరిగాడు.


    "ఎంత హాయిగా నిద్రపోతున్నావు?"


    "నువ్విలా సాక్షాత్కరించటం ఇంకా హాయిగా ఉంది."


    "సుకుమార్. ఓ నిజం చెప్పవా? ఇంతవరకూ ఏ పురుషుడ్ని చూసి ఇంతగా నేను స్పందించలేదు."


    "సతీ! నేనూ ఓ నిజం చెప్పనా?"


    కళ్ళలోకి చూశాను.


    కళ్ళూ, కళ్ళూ కలుసుకోవటంలో ఇంకో మధురమైన పర్వం.   


    "ఏ స్త్రీ కోసం నేనింతగా ఆరాట పడలేదు."


    చాలా సంతోషంగా ఉంది. మత్తుగా ఉంది. గమ్మత్తుగా ఉంది.


    అతని చేతులు ముందుకు జరిగి నా భుజాలను పొదివి పట్టుకున్నాయి.  


    అప్రయత్నంగా ముందుకు వొంగాడు.


    ఇద్దరి పెదవులూ కలుసుకున్నాయి.


    ఈ దృశ్యం.... ఏ దృశ్యమంటే.... పురుషుడు అలా పడుకుని ఉంటే, స్త్రీ ఓ ప్రక్కనుంచి అతనిపై వ్రాలుతూ విచ్చుకుని ఉన్న విశాలమైన శిరోజాలు అతని ముఖాన్ని కప్పేస్తూ ఉండగా, పెదవుల్లో పెదవులు కలవటం....      


    ఈ సుందరమైన అనుభవం, ఇచ్చిన స్త్రీకంటే స్వీకరించిన పురుషుడే బాగా చెప్పగలడు.... అంత సుందరమైన హృదయం కలిగి ఉన్నవాడైతే.


    ఇష్టపడి చేసిన పనికీ, అయిష్టంతో చేసిన పనికీ ఉన్న తేడా ఆ కాసిని క్షణాలలో తెలుస్తోంది. "అబ్బో! ఆ మధుర పారవశ్యంలో నేనెంత మైమరచిపోయానని.   


    కొంతసేపయాక అతని పెదవులలోంచి నా పెదవులు విడదియ్యటానికి ప్రయత్నించాను.


    "ఉహు" అన్నాడు విడవకుండానే.


    "ఎంతసేపు?"


    ఇద్దరం పెదవులు, పెదవులు కలిసి ఉండగానే మాట్లాడుకుంటున్నాం. ఆ సవ్వడి చాలా అస్పష్టంగా, ముద్దగా వస్తోంది. ఆ భాష మా ఇద్దరికే అర్థమవుతోంది.


    "ఎంతసేపైనా.... ఈ అమరత్వాన్ని ఎవరోదులు కుంటారు?"


    "ఆకలి....?"


    "ఇప్పుడు నాకే ఆకలీ తెలీటం లేదు."


    ఇద్దరి కళ్లూ మూతలు పడి.... మగత. అతన్ని గురించి కూడా తెలుస్తోంది.


    ట్రాన్స్ మిషనంటారే.... అది ఒకర్లోంచి ఒకరికి శక్తివంతంగా ప్రవహిస్తోంది.


    చిన్నప్పుడు.... ఇంగ్లీషు సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు, అలా పెదవులూ పెదవులూ కలుసుకుంటూన్నప్పుడు.... ఒకరి ఎంగిలి ఒకరి అయి చికాకనిపించిందా? అంత దగ్గరగా ఒకర్నొకరు చూసుకుంటూ, ఒకరి శ్వాస ఒకరికి తగుల్తూ.... అబ్బ! వళ్ళు గగుర్పొడిచేది.  


    ఆశ్చర్యం, ఈ మహత్తరమైన అనుభూతిలో, మనసుకీ, శరీరానికి సుఖ పారవశ్యమే గాని.... ఆ వ్యతిరేక భావాలన్నీ ఏమయిపోయినాయో.


    మధ్యలో చిన్న విశ్రాంతిలా కొంచం విడివడి కళ్ళు తెరిచి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నాము. ఇద్దరి పెదవుల మీదా మధురమైన చిరునవ్వు.


    "సతీ!"


    "ఊ"


    "ఎంత దయ నీకు? ఈ అద్భుతమైన అనుభవాన్ని ఎంత గొప్పగా ప్రసాదించావు?"


    "బహుశా నన్ను నేను తెలుసుకుంటున్నాను"


    "సతీ! నీకో నిజం చెప్పనా?"


    "బహుశా.... ఈ స్థితిలో నువ్వు అబద్ధం చెప్పలేవు"


    "అవసరం కూడా లేదు"


    అతని నిర్మలత్వం నన్ను ఏ దిగంతాల కవతలకో తీసుకుపోతున్నవి.


    "జీవితంలో.... ఓ స్త్రీతో ఇంత దగ్గరగా రావడం ఇది తొలిసారి"


    ప్రపంచంలోని అమాయకత్వమంతా అతని కళ్ళలో ప్రతిధ్వనిస్తోంది.


    "హఠాత్తుగా ఇంత అదృష్టవంతుడ్నవుతానని తెలీదు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS