"ఏవీ సాధించకుండా .... .... మామూలుగా మన స్వార్థాలతో, సుఖాలతో జీవించడం వల్ల సార్ధకత ఏముంది వర్షా? ఈ సమాజంలో ఎన్నో విషాదభరితమైన అవకతవకలు కొన్నిటినైనా సరిదిద్దగలిగితే...."
"ఈ సమాజం ఎంత క్రూరమైనదో నీకింకా అర్థం కావడం లేదు హర్షా?"
ఆమె తడిగుడ్డతో అతని వొళ్ళంతా తుడిచింది. బట్టలు మార్చుకొమ్మని తన తండ్రి పంచా, చొక్కా తెచ్చి ఇచ్చింది. అతను పంచను లుంగీలా మడిచి కట్టుకున్నాడు. పైన షర్టు తొడుక్కున్నాడు. మయూరంగారు ఊళ్ళో లేరు. వర్ష తల్లి వేడివేడి అన్నం వండింది.
అతను తృప్తిగా భోజనం చేశాక, బద్ధకంగా కునికిపాట్లు పడుతుంటే "ఈ పూట ఇక్కడే విశ్రాంతి తీసుకోండి హర్షా" అన్నదామె కొంత మొహమాట పడుతూనే.
అతను నవ్వాడు. "లేకపోతే నేనింటికి వెళ్ళే ఉద్దేశంతో ఉన్నాననుకున్నావా? ఇప్పుడిహ ఓపిక లేదు" అన్నాడు.
ఆమె నేలమీద పక్కవేసి ఉన్నంతలో చక్కగా పక్క అమర్చింది. దానిమీద మేను వాల్చగానే అతని ప్రాణమెక్కడికో ఎగిరి పోయినట్లయింది. కళ్ళు మూతలు పడిపోయినాయి. అంత నిద్దర్లోకూడా వొళ్ళంతా నొప్పులతో మరిగిపోవటం తెలుస్తూనే ఉంది.
"అమ్మా?" అని మూలిగాడు.
"హర్షా?" అని పిలిచింది. అతను పలకలేదు. మెలకువలో లేడని తెలుసుకుంది.
నిద్రలో ఉండే గుండెమీద చెయ్యివేసి సవరించుకున్నాడు.అక్కడ దెబ్బలు తగిలాయేమో... నొప్పిగా ఉందేమో... బాధతో ఆమె హృదయం విలవిల్లాడింది. అతని ఛాతీపై చెయ్యివేసి నిమరసాగింది. ఎప్పుడో అర్ధరాత్రి దాటాక శ్రీహర్షకు మెలకువ వచ్చింది. ఒక్క క్షణం తనెక్కడున్నాడనిపించింది. కొత్తచోటులా... వెంటనే జరిగినవన్నీ గుర్తొచ్చాయి. ఛాతీమీద ఓ కోమల హస్తం...
తల ప్రక్కకి త్రిప్పిచూశాడు. వర్ష కటిక నేలమీద పడుకునే ఉంది. అతనికి కొంచెం దూరంలో ఆమె చెయ్యి అతని గుండెలమీద ఆని వుంది. అలా నిమిరి నిమిరి, చివరకు నిద్రపోయిందేమో. ఎంత చల్లగా ఉంది? ఆ చేతినందుకుని పెదవులమీద ఉంచుకున్నాడు. యెంత హాయిగా ఉంది? చాలు. ఆమె చేతిని మెల్లగా తీసి ప్రక్కకి జరిపి, తాను రెండోవైపునాకు తిరిగి పడుకున్నాడు. కాసేపట్లో మళ్ళీ నిద్ర పట్టేసింది.
10
అతను ఉత్తరాలు రాయగా రాయగా ఆ కృషి ఊరికేపోలేదు. గవర్నరు కొన్ని సేవాసంస్థలకు కబురు చేసి యీ అంశంపై దర్యాప్తు చెయ్యవలసిందిగా కోరారు. సంస్కార్, చేతన అనే సేవాసంస్థలవారు శ్రీహర్షకు ఉత్తరం రాసి తాము కొద్దిరోజుల్లో వస్తున్నామనీ, జోగినుల గురించి సేవా కార్యక్రమాలను కొనసాగించటానికి తగిన ఏర్పాట్లు చెయ్యవలసిందనీ కోరారు. ఆ బృందంలో ఒకరిద్దరు వేరే డాక్టర్లు కూడా వస్తున్నట్లుగా తెలియజేశారు.
శ్రీహర్షకు కొండెక్కినంత సంతోషం కలిగింది. తనకు తోచినంతలో తగు రీతిలో వాళ్ళు బస చెయ్యటానికి, ఇంటర్వ్యూలు చెయ్యటానికీ, వైద్య పరీక్షలు జరపటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇటు షాపులో పనీ, అటు వచ్చేవాళ్ళ కోసం చేస్తున్న ఏర్పాట్లు అతనికి క్షణం తీరిక ఉండటం లేదు. ఊళ్ళోవాళ్ళు అతనివంక హేళనగా చూస్తున్నారు. ఎగతాళి చేస్తున్నారు.
చలమయ్య కూడా అతన్ని పిలిచి, "ఏమిటాయ్యా నువ్వు? నీ గురించి చాలా వింటున్నాను. ఏవో గొడవల్లో ఇరుక్కుంటున్నావట" అన్నాడు మందలిస్తున్నట్లుగా.
"గొడవల్లో ఏమీ ఇరుక్కోవడం లేదండీ. నా మనసుకు తోచింది నేను చేస్తున్నాను" అన్నాడు.
"అది సరేలే. నువ్వు తలదూరుస్తున్న విషయం అంత మంచిదికాదు. పైకి రావలసిన కుర్రవాడివి. ముందు ముందు నా షాపులో వాటాకూడా ఇద్దామనుకుంటున్నాను. ఇవన్నీ చూస్తూంటే నాకు ఏమిటోగా వుంది."
అతనేమీ జవాబు చెప్పకుండా మౌనంగా నిలబడ్డాడు.
