Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 38

    "ఎలా యిస్తారు"

    "అదేమో నాకేం తెలుసు."

    "తెలియనిదానివి ఎలా అడిగావ్? ఏం తెలుసు తల్లి నీకు? మొగుణ్ని వెంటేసుకు వెళ్ళటం తెలుసు? అసలెందుకు వెళ్ళిపోయావు. ఏం లోపం జరిగింది? నీ సొమ్మంతా ఎవరు తినిపోతున్నారని?" కోపంగా అంది పార్వతి.

    "అత్తయ్యా! మాటకి మాట తెగులు! నీవూ మావయ్యని వెంటేసుకురాలేదా? కొంచెం ఆలోచించండి."

    జ్యోతి అనేసరికి అందరూ నిర్ఘాంతపోయారు.

    పార్వతి వూరుకోలేక పోయింది.

    "ఏవిటే నీకు తెలిసింది. పచ్చగా ఒకటిగా వున్న కుటుంబాన్ని నేను చీల్చలేదే? బాధ్యతలేవీ పూర్తి కాకుండానే మొగుణ్ని వెంటేసుకుని వెళ్ళిపోలేదే? పెద్దా చిన్నా, మంచీ మర్యాదా లేకుండా మాట్లాడకు..."

    ఆవేశపడుతున్న పార్వతిని వారించారు శాస్త్రిగారు.

    "ఇదిగో బావగారూ! ఈ శషబిషలు నాకేం గిట్టవు చెప్పండి. ఎవరు ఇంట్లో వున్నారో వాళ్ళే డబ్బు ఇవ్వాలి. ముందు ఈ ఇంటి ఖరీదు నిర్ణయించండి." అంది అత్తగారి మాటను లెక్కచేయకుండా.

    "నువ్వే చెప్పమ్మా!" విశ్వనాధం అడిగాడు.

    "నే చెప్పానుగా_ యాభై వేలవుతుందని."

    "యాభై వేలా?"

    "ఏం అంత ఆశ్చర్యం అత్తయ్యా? ఈ ఇల్లు ఎంత విశాలంగా వుందో ఆలోచించండి. చుట్టూ కాంపౌండ్. పెరడు పెరట్లో బావి, మేడ. ఈ ఇల్లు ఖరీదు యాభయి వేలంటే చాలా తక్కువ అంచనా! మార్కెట్లో పెట్టి అమ్మితే డబ్భయి ఎనభై వేలకి తక్కువ అమ్మదు."

    "అమ్మా! తల్లీ! మార్కెట్లో వేలం పెట్టి అమ్మేసెయ్. ఎవరొద్దన్నారు? ఇంతదాకా ఇంటి పరువు మర్యాదా, బజారులో పెట్టావు. ఇక ఇల్లు పెట్టేయ్."

    అసహ్యంగా చూసింది జ్యోతి.

    "ఇదిగో! అలా కేకలుపెట్టే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. ఏం కొంపమునిగి పోతోందని అలా అరుస్తారు? పుడుతూ, అన్నదమ్ములు, పెరుగుతూ దాయాదులు అనే మాట విన్లేదా? లోకంలో ఎందరు విడిపోవటంలేదు."

    "మహాతల్లి నీ అంత పచ్చికలి ఎక్కడా వుండదు." పార్వతి అక్కసుగా అంది.

    "మేం లోకవిరుద్ధంగా ప్రవర్తించటంలా. న్యాయంగా మాకు రావాల్సిన వాటా అడుగుతున్నాం..."

    కోడలి మాటలకి ఆవేశంగా ఏదో జవాబు చెప్పబోయింది పార్వతి. శాస్త్రిగారు వారించారు...

    ఆయన కల్పించుకోక తప్పలేదు.

    "పార్వతీ! నువ్వూరుకో! మురిగిన కాలు తెగ కోసుకోవటం మంచిది కాదని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాటా కావాలంటున్నారు..."

    "పండితులుగా ఎన్నయినా మాట్లాడతారు?" ఈసడింపుగా అంది జ్యోతి.

    "అనవసరపు మాటలెందుకు తల్లి! వాటా కావాలి గదా మీకు. ఇదీ ఒకందుకు మంచిదే! కానీ జ్యోతీ ఈ ఇల్లు మేం కొనలేదు... మాకు అక్కరలేదు"

    "అక్కరలేదు! అన్నీ పై మాటలే. డబ్బంటే ఆశ లేనిదెవరికి?" పుల్ల విరుపుగా అంది."

    "యాభయివేలు కాదుగదా, పదివేలుగా నిర్ణయించి మీ భాగంగా రెండువేలు ఇవ్వమన్నా ఇవ్వను, ఇవ్వలేను. ధర నిర్ణయించావు కదా నీవే తీసుకో. మిగతా డబ్బు మాకు యిచ్చెయ్. నా వాటా నా భార్య వాటా, కూతురి వాటా, కోడలు స్వాతి వాటా యిచ్చెయ్. మిగతా వాళ్ళతో నాకేం అక్కర్లేదు."

    ఒక్కక్షణం విభ్రాంతి చెందింది జ్యోతి.

    "అహహ! ఏం బాగా చెప్పారు మామయ్యగారూ! పాతికేళ్ళుగా ఉద్యోగం చేస్తూ, కొడుకులు ఉద్యోగం చేసి సంపాదించి పెడుతుంటే, దాస్తూ అంతో ఇంతో వెనకేసిన వాళ్ళు మీరే వద్దంటే నిన్నగాక, మొన్న బయటికెళ్ళిన వాళ్ళం మేమేం యివ్వగలం? ఇది అన్యాయం_ మీరిలా మడత పేచీ పెడితే ఇల్లు వేలం వేయించాల్సి వస్తుంది" అంది తీవ్రంగా.

    "కానీయమ్మా! నిండా మునిగాక చలేముంది. పరువు ప్రతిష్టలు మిమ్మల్ని కోడళ్లుగా తెచ్చుకున్ననాడే పోయాయి. ఇంకా ఎందుకు పట్టుకుని ప్రాకులాడాలి? అది అవివేకమే"

    "బాబాయ్!" విశ్వనాధం పిలిచాడు.

    "ఏం విశ్వం?"

    "ఇదిలా పరిష్కారం కాదు. మీరే ఆలోచించండి. ఈ ఇల్లుని కొనాలన్నా, అమ్మాలన్నా వ్యవహారం చాలా అవుతుంది. నలుగురిలోనూ నగుబాట్లు కాకుండా గుట్టుగా ధర కట్టేయ్యండి, వాళ్ళ వాటా యివ్వండి."

    "విశ్వం నువ్వు అలాగే అంటున్నావా? ఆరుగురి వాటా ముప్పయివేలు నేనెక్కడ తెచ్చివ్వను?"

    "పోనీ ఇంటిపై అప్పు చేయండి" ఆరిందాలాగా సలహా యిచ్చింది జ్యోతి.

    "జ్యోతీ!" గద్దించారు శాస్త్రిగారు. "మాట మాటకీ నువ్వలా అడ్డురాకు. నాకు సలహా ఇవ్వగలిగింది నువ్వు చెయ్యగలిగిన నాడే నాకు సలహా యివ్వు. నోర్మూసుకుని కూర్చో."

    "నోర్మూసుకుని కూర్చోటానికి ఇది క్లాస్ రూంకాదు. ఇప్పుడు పోయిన హక్కు మళ్ళీ రాదు. మీ ఎదుట నోరెత్తలేదు నా భర్త. అందుకే అడుగుతున్నాను."

    జానకిరాం ఏం మాట్లాడలేదు. ఉస్సురన్నాడు శాస్త్రిగారు.

    దాశరధి కల్పించుకుని అన్నాడు.

    "నాన్నా! నాకీ వాటా అక్కర్లేదు. పిత్రార్జితంగా ఏం వచ్చినా అది మీకే! మీ తర్వాత అమ్మకి చెల్లాయికి. ఒరే అలా వ్రాస్తాను. ఇక నన్ను వెళ్ళనీండి. ఈ పంచాయితీ చూస్తుంటే నాకు రోతగా వుంది.

    "దాశరధి, నాకు ఒకరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు."

    "ఇది దయ కాదు నాన్నా! హక్కు. తల్లి దండ్రుల్ని పోషించాల్సిన బాధ్యత ధర్మం పిల్లలది. అది నెరవేర్చేందుకు నేను ఒంటరిగాడిని అందుకే నా భాగం వదులుకుంటున్నాను" ఖచ్చితంగా అన్నాడు దాశరధి.

    "పోనీ...మామయ్యా! అదిప్పుడు ప్రశ్నకాదు మిగతా సంగతేమిటి?"

    "నేనూ, నా వాటా వదిలేస్తాను అన్నయ్యలాగే" అన్నాడు పట్టాభి.

    శాస్త్రిగారు ఓ చూపు చూశారు. ఎవరూ ఏం మాట్లాడలేదు.

    "ఇక సీతారాం, కోసలరాం మిగిలారు."

    "వాళ్ళ వాటా విషయం అట్టిపెట్టండి!" అన్నాడు జానకిరాం.

    "మీ వాటా కావాలా?"

    "ఊఁ"

    "అయోధ్యా!"

    "ఊఁ"

    "ఇంకేం మామయ్యా?"

    "విశ్వం నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు? నేనెక్కడి నుంచి తేనాడబ్బు? డబ్బుంటే నేనా నోటీసు అందగానే విసిరి కొట్టేవాడిని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS