Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 37


    చిరంజీవి పరీక్షలు రాయకపోతే వాటిల్లే నష్టమేవిఁటో, ఆ నష్టం ఏ ప్రజలకి సంబంధించిందో ఆ 'పని మనుషులు'కి అర్థం కాలేదు. అందుచేత వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు.
    "వీడు సుమతిని నట్టేట ముంచేస్తాడా!" అని లోలోన అనుకున్నారు. ఆ అనుకోడంతో గుండెపోటు ఎక్కువయ్యింది.
    "అబ్బా!" అన్నారు.
    "చంపేస్తూంది." అని గూడా అన్నారు.
    వెంకటస్వామికి అర్థమైపోయింది. అతను వెంటనే వీధిలోకి వెళ్ళి, మరో పావుగంటలో నరసయ్యని వెంటబెట్టుకొచ్చేడు.
    నరసయ్య వస్తూనే నవ్వుకుంటూ అన్నాడు___
    "బాబుకి నొప్పి వచ్చిందని వెంకటస్వామి చెప్పీ చెప్పడంతోనే వచ్చేశాను. ఏం బాబూ! ఇన్నాళ్ళూ ఎక్కడ కెళ్ళేరు? ఎప్పుడొచ్చేరు! అది సరే, మళ్ళా లోకనాథం బాబుతో ఏవైనా పేచీ పడ్డారా! మన దొంగ డాక్టరు బాబుని పిలవమంటారా? మీరు ఊఁ అంటే బాబూ, ఈ ఇల్లంతా మందీ మార్బలంతో నిండిపోద్ది. చెప్పండి బాబూ!"
    అంత నొప్పిలోనూ రామదాసు సిగ్గుపడ్డారు.
    "ఇంక, దొంగ డాక్టరుతోగాని, మందీ మార్బలంతోగాని పని పడదు నరసయ్యా! నీకా శ్రమ వుండదింక. రా! వచ్చి అలా కూచో!" అన్నారు.
    నరసయ్య కళ్ళింతవి చేసుక్కూచుంటూ అన్నాడు.
    "బాబేదో చిత్రంగా మాటాడుతున్నారు."
    రామదాసు పక్కగా వొత్తిగిల్లి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని చాలా నెమ్మదిగా అన్నాడు: "ఈ ఏడాది మా చిరంజీవి పరీక్ష లెగ్గొట్టి మైసూరు మహాసభ కెళ్ళాడట. అందుచేత, వాడు నన్ను మించిన ప్రభువై నీ ముచ్చటలన్నీ తేర్చేయగలడు నరసయ్యా! నా సేవ వదిలేసి, చిరంజీవికి చిట్టాలు నేర్పు. నీతో అవసరం పడేవాళ్లు అస్తమానం వుంటానే వుంటారు.
    నరసయ్య మరింత ఆశ్చర్యపడిపోయాడు.
    "బాబు నన్ను వేళాకోళం చేస్తున్నావ్."
    "కాదు. నిజమే చెబుతున్నాను."
    "అంటే?"
    "రహస్యం చెబుతున్నాను విను. చిరంజీవిని చేతులారా నేనే పాడు చేశాను. నేను విషం తింటూ, వాడిచేత కూడా తినిపించేను. ఆ విషాన్ని ఏ డోసులో ప్రారంభించాలో గూడా చెప్పేశాను. వెధవ సూక్ష్మగ్రహి. నా కడుపున పుట్టాడు గదా! విద్యని సుళువుగా గ్రహించాడు. వెంటనే ఎదిగిపోయాడు.
    ఇవాళ నేను వాడికి చెప్పే స్థితిలోనూ లేను.  ఆశ్చర్యపడకు, నిజమే చెబుతున్నాను. 'నాయనా జీవీ! నేనూ నువ్వూ ఇన్నాళ్ళూ విషమే తిని బతికేమురా! నేనికముందు విషాన్ని తిననుగాక తినను. నా బాబువి కదూ. నువ్వూ తినకురా నాయనా!' అని సలహానిస్తే వాడు నా మొహమ్మీద కొట్టేస్తాడేగాని, నా సలహా వినడు. ఈ రాజకీయ నిషాలో థ్రిల్స్ కాలా వున్నాయి నరసయ్యా! పదిమంది నిన్ను ఆకాశానికెత్తేస్తూ, నీకు జై కొట్టేసే పరిస్థితిని వదులుకోవడం కష్టం కనక, చిరంజీవి మరి నాకు దక్కడు."
    నరసయ్య తల తడుముకున్నాడు. గదినంతా పరిశీలించి చూశాడు. రామదాసుగారిని మరీ మరీ చూశాడు. అతడికి ఈ వేదాంత రహస్యంలో నిజముందో లేక ఎగతాళి వుందో తెలీడం లేదు. చాలా ఖంగారు పడిపోతున్నాడు. అతని నోట మాట పెగిలి రావడం లేదు.
    అంత నొప్పిలోనూ రామదాసు మెల్లిగా నవ్వారు.
    "దిష్టి బొమ్మవై పోయావేమిటోయ్ నరసయ్యా?" అన్నారు.
    నరసయ్య చలించాడు.
    "బాబూ నన్ను దిష్టిబొమ్మన్నాడు. ఎన్నడూ వినని మాటలు బాబు నుంచి యివాళ వింటున్నాను. ఏం జరిగింది బాబూ? బాబు నెవరైనా మంత్రించేరా? బాబుకి ఎవరైనా మందు పెట్టేరా?"
    రామదాసు తలూపారు తలూపి,
    "నువ్వన్నది నిజమే కావచ్చు."
    "అయితే! అయితే బాబూ. నేనామాటనలేను. మీరు నాకు చెప్పొద్దు. ఇన్నేళ్ళు బాబు పక్కనున్నాను. బాబు దయవల్ల ఇల్లూ, భూమి కొని, పిల్లాపాపతో కులాసాగా వున్నాను. వేలిముద్ర వేయడమే వచ్చు. ఇవాళ బాబు నన్ను వెళ్ళిపొమ్మని తోసేస్తే, బాబూ___ కదలలేను. నా వేలిముద్రకిక గిట్టుబాటుండదు! నన్ను అన్యాయం చేయకండి."
    "పిచ్చివాడా? దేశాన్నేలే ప్రభువుల్లోనే వేలిముద్ర బాబులనేకమందున్నారు. ఇంకా నీ వేలి కేవిఁటి భయం? ఈ తిమ్మాపురం యింతలో నిద్ర లేవదు. నీ వేలిముద్రకి గిట్టుబాటు యింతలో తగ్గదు. నీకాభయమక్కర్లేదు. నీ సాయం కావలసిన బాబులనేకమందున్నారు. ఇంక నన్నొదులు నరసయ్యా! నన్నొదులు."
    నరసయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగేయి.
    "బాబు నన్నేడిపిస్తున్నాడు."
    "నేనూ ఏడుస్తున్నాను నరసయ్యా! ఎందుకో తెలుసా? నేను? చెప్పను. ఇప్పుడు నేను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. పై పెచ్చు నేనేదో దుర్మార్గం తలపెట్టేనని భయపడి చస్తారు. అందుచేత నేను చెప్పదలుచుకోలేదు. నీకు స్వామి భక్తి ఎక్కువని నేననుకుంటున్నాను. ఇన్నేళ్ళూ నేను చెప్పకుండానే నా నిర్ణయమేమిటో సరిగ్గా ఊహించి నువ్వు కొన్ని పనులు చేశావు. ఇవాళ గూడా నేకీమీ ఉపదేశించను. నీకు మంచిదని తోస్తే అది చెయ్యి."
    రామదాసు నరసయ్యకి యింకేం చెప్పేవారోగాని, ఆ భవంతి ముందు (సరిగ్గా ఆ వేళకి) కారాగిన చప్పుడూ, మనుషులు మేడెక్కి తన గది సమీపించిన వైనమూ పసిగట్టి అన్నారు: "ఎవరో వస్తున్నట్టుంది. నాకు గుండెపోటు వచ్చిన సంగతి దాచిపెట్టు."
    నరసయ్య తలూపాడు.

                                                       *    *    *    *

    మొట్టమొదట కనకంగారూ, ఆ వెనుక లోకనాథంగారూ వారి వెనుక మరో యిద్దరు పెద్దలు గదిలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే వాళ్ళంతా రామదాసుగారికి నమస్కారాలు చేశారు. నమస్కారాలన్నీ స్వీకరించి కళ్ళతో పలుకరించారు రామదాసు.
    కనకం అన్నాడు___


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS