నిజానికి నాలుగు స్తంభాల ఆటలో నలుగురిలో శేషయ్య, ధర్మారెడ్డి, కొండప్ప నాయుడు చౌదరి ఒకటిగా మెలుగుతూ వూరిని జనాన్ని పాలిస్తూ సమభాగంగా పంచుకుంటూ వున్నా చౌదరి శేషయ్యల మధ్య మిగతా వాళ్ళకి తెలియని కొన్ని లావాదేవీలూ వున్నాయి. ముఖ్యంగా ప్రామిసరీ నోట్ల వ్యవహారంలో వాళ్ళిద్దరి మధ్య బ్రహ్మకైనా తెలియని రహస్యాలున్నాయి.
ఈ నెలాళ్ళూ ఏకధాటిగా నిర్విరామంగా బంగారు గజ్జెల మ్రోతలో ఇనప్పెట్టెలో ప్రవేశించిన ధనలక్ష్మి అమ్మవారు యీ వారం రోజులుగా మూగబోయినట్టుగా వుండటంతో ఆయనకి పిచ్చేకి నట్టుగా వుంది.
అందుకే లెక్కలు ముందేసుకుని కూర్చున్నాడు.
జమాబందీ రికార్దంతా తిరగేస్తూ పనికిరాని ప్రయోజనం లేని గత సంవత్సరం లెక్కలను భద్రంగా కట్టకట్టి అటక మీద చేర్చాడు. అప్పుడు కనిపించింది "బి మేమో " ల లిస్టు .
"చిక్కార్రా దొంగ నాయాళ్ళు!" అనుకున్నాడు.
ఆలీబాబాకి నిధి కనిపించినట్లుగా , అల్లావుద్దీన్ కి బొమ్మ లాంతరు దొరికినట్టుగా, విక్రమార్కుడికి దండక మండలాలు లభ్యమైనట్టుగా అనిపించింది.
దాంతో గబగబా రికార్డునంతా "దస్త్రం" లో కట్టేసి ఆ కాగితాన్ని మాత్రం బయట వుంచేసుకున్నాడు.
పట్టా లేకుండా గవర్నమెంటు అనుమతితోనో, లేకనో గవర్నమెంటు భూమిని నామి దొడ్లని, కళ్లాలకీ, యిళ్ళ స్థలాలకీ ఆక్రమించుకుంటారు రైతులు. దానికి పన్ను కాక కొంత ఫేనాల్టీ కూడా జమా బందీ కాలంలో జమా బందీ ఆఫీసరు విధిస్తాడు. బంజరు సాగుచేసి వ్యవసాయం చేసుకున్నా అంతే!
గబగబ లిస్టు తయారు చేశాడు శేషయ్య.
ఆలస్యం అమృతం విషం అన్నట్టు తలారిని కేకేశాడు లిస్టు తీసుకెళ్ళి ధర్మారెడ్డికి యివ్వమన్నాడు.
ఆ వసూలు చేసే తీరు మునసబుకే చాలా ఏళ్ళుగా అనుభవం. అందులో వున్నదానికి రెట్టింపు వసూలు చేస్తాడు. ఆ రైతులకి అక్షరజ్ఞానం లేదు. ఎంత చెబితే అంత యివ్వాలి యిస్తారు. ఎవడికో మూడు ముక్కలు వస్తే వాడిని బెదిరించో, లాలించో వసూలు చేస్తారు. లేదా మళ్ళీ సంవత్సరానికి ఆ జాగాలో అడుగుపెట్టే అవకాశం వుండదు.
ఆ సమయం నుంచే వసూలు ప్రారంభమైంది.
బంజరు భూములు సాగుచేసుకుంటున్న వాళ్ళని కేకేసుకు రమ్మని కేకేశాడు శేషయ్య.
తలారి తలూపి వెళ్ళేడు.
ఒక్కొక్కరే రాసాగారు.
"ఈ సంవత్సరం కూడా సాగుకీ లాయకీ చేసుకోండి. ఫరవాలేదు నేనున్నాను, పట్టాలకీ దరఖాస్తులు పెట్టండి.'
చిత్తం! చిత్తం!
చేయి చాపేడు శేషయ్య.
"ఎంత బాబు గారూ?"
"మాములే!"
గత సంవత్సరం యిచ్చినంత యిచ్చేశాడు.
"ఒరే! ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువయ్యాయిరా"
వాడు బదులు యివ్వలేదు.
"ఇంకో అయిదు ఇవ్వు.
"ఇప్పుడు లేదులే అయ్యా! రేపో మాపో యిస్తా.
సూటిగా కళ్ళలోకి వురిమి చూశాడు కరణం.
తరతరలాడిపోయాడు వాడు. రొంటిన దోపుకున్న డబ్బు తీసి "మా యింటి దానికి జారం. అందుకే...." అన్నాడు.
"ఊ"
ఇంకేం అనలేదు వాడు, బుద్దిగా వెళ్ళిపోయాడు.
అప్పటికి దాదాపు సాయంకాలం నాలుగు గంటలైంది.
"ఒరే! జయన్ననో,సోమునో, వాళ్ళనాయన జానయ్యనో కేకేసుకురా!"
"ఎందుకయ్యా?" అడిగేడు తలారి.
"అడ్డ ప్రశ్నలు వేస్తావురా గాడిదా! నోర్ముసుకుని పరిగెత్తు."
తలకు గుడ్డ చుట్టుకుని పరిగెత్తాడు వాడు.
