Previous Page Next Page 
వారుణి పేజి 37


    "అలాగే కానీమ్మా! నేనింతసేపూ చెప్పింది యీ పెళ్ళిని కాదనాలని కాదు. నువ్వు కెమిస్ట్రీ చదువుకున్నావు కదా! ఇది యాసిడ్ టెస్ట్."
    నవ్వుకుంది వారుణి!
    "వారుణీ! నువ్వు నాకో మాట యివ్వాలి!"
    "చెప్పండి నాన్నా !"
    "సారధి నీ మాట వినని విషయంలో నువ్వతని మాట వినాలి?"
    క్షణం ఆలోచించింది. వెంటనే సమాధానం యివ్వలేదు.
    "నిజంగా ఆడపిల్లవి అనిపించుకున్నావు. అదే అబ్బాయి అయితే వెంటనే ఓకే అనేవాడు. మగపిల్లలకి తొందరెక్కువ. ఆడవాళ్ళు కాస్త ముందు వెనకలాలోచించి సరే అంటారు. వారుణీ! నూటిలో తొంభై తొమ్మిది అతను ఓకే చేసినప్పుడు అతడు కాదన్న ఆ ఒక్కటీ ఓకే చెయ్యటం నీ కనీస ధర్మం."    
    "అలాగే నాన్నా !" అంది వారుణి.
    "చిన్నా !"
    ఆ పిలుపుకి ఉలికిపడింది. ఇంతదాకా సాగుతున్న ఆలోచనలు చెల్లాచెదురయ్యాయి.
    "నాన్న చెప్పిన ఆ పరిస్థితి అప్పుడే ఎదురైందా ?" అనుకుంది.


                                            17


    "చిన్నా !"
    ఆ కంఠంలో ప్రేమ వుట్టిపడుతోంది.
    చివుక్కున తల తిప్పి చూసింది వారుణి.
    అతనికామె ఆ సమయంలో బుసకొట్టే తాచులా కనిపించింది. అయినా అందంగానే వుంది. దగ్గరిగా వచ్చి కూర్చున్నాడు. భుజంపై చేయి వేశాడు. వారుణి మృదువుగానే తొలగించింది. అయినా అందులో దురుసుతనమే కనిపించింది.
    "ఏమిటది చిన్నా !"
    "నన్నెందుకు విసిగిస్తారు. కాస్సేపు నన్ను నా కర్మకి వదిలెయ్యండి. నా ఏడుపేడో నేనేడుచుకుంటాను."
    "చిన్నా !" దెబ్బతిన్నట్టుగా పిలిచాడతను.
    "చిన్నా ! చిన్నా ! ఎందుకలా పిలుస్తారు?"
    "నీకు తెలీదా! చిన్నా అంటే వలచిన దానా, చినదానా అని అర్థం! రాణీవాసంలో లాగా పిలుస్తారన్నమాట"
    "మీలో యింకా ప్రేమ మిగులుందా?"
    "ఎందుకలా దారుణంగా మాటాడుతావు!"
    "దారుణమేముంది? మీ మగాళ్ళంతా అంతే! పెళ్ళయ్యేదాకా ప్రేమపాఠాలు వల్లిస్తారు. మా చుట్టూ చేరి వలలు విసురుతారు. మా కడగంటి చూపుల కోసమే జీవిస్తోన్నట్టుగా నటిస్తారు. ఒక మాట ఒక చూపు చాలన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఏముంది? ఆ కాస్త పెళ్ళయిపోయి మీ చేతిలో వాలిపోగానే మా విలువ తగ్గిపోతుంది. మాకోసం పడే ఆర్తి అంతా తగ్గిపోతుంది. అంతదాకా చెప్పిన ప్రణయ కవిత్వం అడుగంటిపోతుంది."
    ఆమె వీపుపై చేయి వేసి మృదువుగా నిమిరాడు సారధి.
    "రధి! దయచేసి దూరంగా వుండు. పెళ్ళయి నెలతిరక్కముందే నేనిన్నాళ్ళూ మేఘాల్లో సంచరించాననీ వాస్తవాలు చూడటం కోసం భూమ్మీదికి వచ్చెయ్యమని నన్ను స్వర్గ వీధుల నుంచి లాక్కొచ్చావు చాలు! నాకు సంసార జీవితం యాంత్రికం కృత్రిమం అని నేర్పించావు."
    "చిన్నా! నీ మాట నీదేనా? నా మాట వినిపించుకోవేం? నువ్వలా సరోజని స్కూల్లో చేర్పించటం, వదిన్ని పేరెట్టి పిలవటం నాన్న ముందు అన్నయ్య ముందు నేనెంత ఘోరంగా తలవంచుకునేట్టు చేసిందో తెలుసా? సిగ్గుతో చచ్చిపోయాను."
    "సిగ్గుతో చచ్చిపోయింది నేను. ఆమె ఎంతగా నటించింది! తనే పేరుతో పిలవమంది. నలుగురి ముందూ నన్ను ఫూల్ ని చేసింది. అయినా ఆ అమ్మాయి గురించి నేను ఆరాటపడకూడదా?"
    "ఎలా వుంటుంది? నీ బిడ్డని గురించి నువ్వు నీ యిష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఆమె పరాయి బిడ్డ. నీకు హక్కు లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS