"ఏమో. అవన్నీ నాన్నగారు వాళ్ళూ చూసుకుంటారు. వాళ్ళు కొంతవరకూ ఉన్నవాళ్ళే. సొంత ఇల్లూ, ఆస్తి అవీ ఉన్నాయి."
చిత్రమేమంటే జీవితంలో ఏమంత అనుభవం లేని వాళ్ళు కూడా ప్రక్కవాళ్ళకు ఆరిందాల్లా సలహాలు చెబుతూ ఉంటారు... బహుశా నేనూ ఆ పనే చేస్తున్నాననుకుంటాను.
"ఆ అబ్బాయిని చూశావా?"
"చూశాను."
"ఎలా ఉంటాడు?"
"బాగానే ఉంటాడు...."
"నీకు నచ్చాడా?"
"నచ్చాడు."
నా మనసులో ఉన్నది ఎలా చెప్పాలో తెలీక ఇబ్బంది పడుతున్నాను.
కాసేపు తటపటాయించి సూటిగా అడిగేశాను.
"ఈ పెళ్ళి నీకిష్టమేనా?"
"ఇష్టమే."
గమ్మత్ ఏమిటంటే కొంతమంది ఆడపిల్లలు వయసొస్తూన్నా పెళ్ళి ప్రసక్తి తీసుకొచ్చేసరికి "పెళ్ళి సంగతి నా ముందెత్తకండి" అంటారు కోపగించుకుంటూ. అందులో నిజంగా కోపగించుకునే వాళ్ళు ఉన్నారు. లోలోపల మురిసిపోతూ పైకి బుకాయింపుగా అనే వారూ ఉంటారు. కొంతమంది యుక్తవయసు వచ్చీరాకముందే పెళ్ళికోసం కలవరిస్తూ ఉంటారు. వైదేహి ఈ కోవకు చెందినదే అనిపించింది.
"ఎందుకిష్టం?"
"ఎందుకేమిటి? ఇష్టమంతే."
"ఇంత చిన్న పిల్లవు. అప్పుడే బరువూ, బాధ్యతలూ, పుడితే పిల్లలూ...."
"ఏమో. నాకు సంతోషంగానే ఉంది."
ఆ పిల్ల అలా మాట్లాడుతూండే సరికి ఇహ తర్కించాలనిపించలేదు. చిన్న చిన్న విషయాల గురించి ఎంతో నిశితంగా, దీర్ఘంగా ఆలోచించే మనుషులు ముఖ్యమైన ఘట్టాల గురించి ఒక్కోసారి ఎంత తేలిగ్గా తీసుకుని తప్పటడుగులు వేస్తూ ఉంటారు!
ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉన్నాను.
ఎంత అలజడి!
చిరాగ్గా ఉండి, సాయంత్రం తలస్నానం చేసి, తెల్లచీర కట్టుకుని, గదిలో అటూ ఇటూ తిరుగుతూ విరబోసుకుని ఉన్న జుట్టు ఫ్యాన్ క్రింద ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకో చాలా థ్రిల్ గా ఉన్నట్లనిపిస్తోంది.
ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది.
వెళ్ళి తలుపు తీశాను.
సుకుమార్.
శరీరమంతా పులకించినట్లయింది.
అతను లోపలకు రాగానే "ఇప్పుడా? ఇన్నాళ్ళకా రావటం.... నన్నొంటరిగా వొదిలేసి...." ఆబగా చెయ్యి పట్టుకుని "నిన్నూ...." అన్నాను.
"మేడమ్ అర్జంటు పనిమీద ఢిల్లీ పంపించారు. వెళ్ళేముందు నీకు చెప్పటానిక్కూడా టైములేకపోయింది."
"నీకు మేడమెక్కువా? నేనెక్కువా?"
"అలా అని కాదు."
"ఏమిటి కాదు? నీమీద కోపమొచ్చింది."
అతని చెయ్యి ఇంకా నా చేతిలోనే ఉంది. "తప్పు చేశానని వొప్పుకుంటున్నాను. ఏ శిక్షయినా విధించు. పడతాను."
"మీ మేడమ్ మీకు కనిపించకుండా చాలా రోజులపాటు నిన్ను దాచేస్తాను"
"దాచేస్తావా. ఎక్కడ."
"ఇక్కడ. ఈ ఇంట్లోనే."
"నిజంగా?"
"నిజం. ఈసారి నిన్ను తేలిగ్గా విడిచిపెట్టను. నా మనసెంత బాధపెట్టావో తెలుసా?"
లోపల్నుంచి ఉబుకు వొస్తున్న ఉద్వేగాన్నణుచుకోటానికి ముని పంటితో పై పెదవిని నొక్కుకున్నాను.
"నేనంటే అంత...."
"నీకర్థం కాదులే...."
"సారీ సతీ."
అతని ముఖంలో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తోంది.
"నువ్వెట్లా బాధపడ్డావో, నేనూ అలానే పడ్డాను. అందుకే.... ఇంటికి రాగానే స్నానం చేసి, ఎకాఎకి ఇక్కడికే వచ్చేశాను. చాలా ఆకలిగా ఉన్నా పట్టించుకోలేదు."
"ఆకలేస్తోందా పిచ్చి నాన్నా "నా మనసు విలవిల్లాడింది. "ఈ పూట ఇక్కడే భోజనం చెయ్యి. మనిద్దరం కలిసి తిందాం బోలెడు కబుర్లు చెప్పుకుంటూ. నీతో బోలెడు విషయాలు మాట్లాడాలి."
అప్పుడతని చెయ్యి విడిచిపెట్టాను. "సుకుమార్, నువ్వీగదిలో రెస్ట్ తీసుకుంటూ ఉండు. ఒక్క అరగంటలో అన్నం, అదీ వండేస్తాను."
తలుపు గడియవేసి గోడకానించి ఉన్న మంచం వాల్చి పరుపు వేసి దుప్పటి చక్కగా సర్దాను.
"నువ్వు చాలా అలిసిపోయినట్లు కనిపిస్తున్నావు. రెస్ట్ తీసుకుంటూ ఉండు" అని లోపలి కెళ్ళిపోయాను.
* * *
చెప్పినట్లే అరగంటలో అన్నీ పూర్తి చేసేశాను. తర్వాత ముందు గదిలో కొచ్చేసరికి సుకుమార్ మంచంమీద పడుకుని నిద్ర పోతున్నాడు.
కొంతమంది నిద్రపోతూన్నప్పుడు చూస్తే చాలా విసుగ్గా ఉంటుంది. వికారంగా కూడా ఉంటుంది. కాని.... సుకుమార్ నిద్రపోతూన్నప్పుడు చాలా అందంగా, సుకుమారంగా, అమాయకంగా, పసిపిల్లాడిలా కనిపించాడు.
అతన్నలా చూస్తోంటే చాలా ముద్దనిపించింది. తెలీకుండానే నాలుగయిదు నిమిషాలలాగే నిలబడిపోయాను.
ప్రేమను గురించి గతంలో సందర్భమొచ్చినప్పుడల్లా చెబుతూ వచ్చాను. దానికంత అత్యున్నతమైన విలువవివ్వవద్దనీ, విలువ ఏ పాటిదైనా, శాశ్వతమైనా అశాశ్వతమైనా దాని గొప్పతనం దానిదే అని కూడా చెప్పి ఉంటాను. సృష్టిలో సరైన నిర్వచనం లేనివాటిలో ప్రేమ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. నిర్వచనం ఇవ్వగలిగిన వాటికంటే ఇవ్వలేని వాటికే ఓ గుబాళింపు ఉంటుంది.
