Previous Page Next Page 
జోగబాల పేజి 37


    అలానే జోగినులను లేకుండా చేస్తే వాళ్ళు పోఫెషనల్ ప్రాస్టిట్యూట్స్ కింద తయారవుతున్నారు. అప్పుడు వీధివీధికి ఇంకో జోగిని రెడీ అవుతుంది. ఇంకో పేరుతో. మీలో ఏదన్నా లోపముంటే చెప్పలేంకాని (నవ్వులు) మగసిరి ఉన్న వారికి కొంత భోగం కావాలి. మరి ఇప్పుడు యధేచ్చగా వెళ్ళటానికి వీల్లేదు కదా. అందుకని మేష్టారూ? కన్నెపిల్లల జీవితాలతో ఆడుకోకుండా ఉండేందుకు, పక్కవాడిపెళ్ళాన్ని పాడుచెయ్యకుండా ఉండేందుకు. ఈ రకం వ్యభిచారానికి పాపం దేవుడు కూడా సహకరిస్తున్నాడు. కాబట్టి పుణ్యం పంచిపెడుతున్నాడు. కాబట్టి జోగినులు యింకా యింకా విస్తరించాలి. జోగిని వ్యవస్థ వర్ధిల్లాలి. వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి. జోగిని జిందాబాద్.


    "జోగిని జిందాబాద్, జోగిని జిందాబాద్" హాలు హాలంతా కేకలతో మార్మోగి పోయింది.


    శ్రీహర్ష కోపం ఆపుకోలేక పోయాడు. నాలుక స్వాధీనం తప్పింది.


    "యూ బ్రూట్స్."

    
    "ఎవరో ఆ మాట విన్నారు. "మమ్మల్ని బ్రూట్స్ అంటావా? మా కాలేజికొచ్చి మమ్మల్ని తిడతావా?"


    "ఏమిటి? మనల్నే తిడుతున్నాడా?ఎంత ధైర్యం మనలాంటి హీరోలని పట్టుకుని..."


    ముందుగా ఎవరో ఓ చెప్పు విసిరారు. తర్వాత వరసగా చెప్పులవర్షం కురిసింది. కొందరు గురిచూసి రాళ్ళు కూడా విసిరేస్తున్నారు. ఒక రాయివచ్చి కణతకు కొట్టుకుని గాయమై బొటబొట నెత్తురు కారింది. ప్రిన్సిపాల్ గారు వేదిక మీదికి వచ్చి "ప్లీజ్! ప్లీజ్" అని అరుస్తున్నారు. ఆయన మీదకూడా చెప్పుల వర్షం కురిసింది. ఎవరో ఆయన్ని ప్రక్కకి లాగేశారు. శ్రీహర్షకు కళ్ళు తిరుగుతున్నాయి. క్రింద పడకుండా నిలద్రొక్కుకుంటూ ఆలాగే నిలబడ్డాడు.


    ఓ గంట గడిచాక జోగాపురంవైపు వెళ్ళే రోడ్డుమీద చీకట్లో వంటరిగా నడుస్తున్నాడు శ్రీహర్ష. షర్టు నలిగి చిరుగులు పడింది. జుట్టు రేగిపోయి, దుమ్ము కొట్టుకొని ఉంది. కణతమీదా, బుగ్గలమీదా గాయాలు.


    ప్రక్కనేదో అలికిడయినట్లయింది. తలత్రిప్పి చూసేసరికి ఓ వ్యక్తి అతనికి చేరువగా వచ్చాడు. ముప్పై ఐదేళ్ళదాకా ఉంటాయి. అతను శ్రీహర్ష భుజంమీద ఆప్యాయంగా చెయ్యివేశాడు.


    "చాల నీరసంగా ఉన్నారు. పదండి మీకు సాయంగా వస్తాను" అన్నాడు సభ్యతగా.

    
    "మీరు..."


    "నా పేరు గోపాలకృష్ణ. ఇందాక మీరు మాట్లాడిన కాలేజీలో కామర్స్ లెక్చరర్ గా పని చేస్తున్నాను."


    "నా కోసం మీకెందుకు శ్రమ...."


    "మీ భావాలూ, ఆశయాలూ నాకు నచ్చాయి. మీకు తోడుగా నేనుంటాను."


    "థాంక్స్"    


    ఇద్దరూ కలసి నడుస్తున్నారు. మార్గ మధ్యంలో అతను తన గురించి వివరాలు చెప్పాడు. భార్య పోయి రెండు సంవత్సరాలయింది. పిల్లలు లేరు. ఒంటరిగా ఉంటున్నాడు. మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఆలోచన ఉందిగాని పరిస్థితులు కలసి రావటంలేదు. చాలాసేపు నడిచి జోగాపురం పొలిమేరలదాకా వచ్చారు.


    "నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. ఇహ నేను వెళ్ళగలనులెండి" అన్నాడు శ్రీహర్ష.


    "అవసరమొచ్చినప్పుడు కబురు చెయ్యండి వస్తాను." అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ.


    శ్రీహర్షకు యెందుకో గదికి వెళ్ళాలనిపించలేదు. వర్షను చూడాలనిపించింది. హరిజనవాడకేసి బయల్దేరాడు.


    అతని పరిస్థితి చూసేసరికి వర్షకు దుఃఖమాగలేదు.


    "ఎందుకిలా చేస్తున్నావు హర్షా? ఏమి సాధిద్దామని నీ జీవితాన్నిలా కష్టాలమయం చేసుకుంటున్నావు?" అని అతని గుండెమీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS